ఏపీఎస్‌ఆర్టీసీతో పోలిస్తే టీఎస్‌ఆర్టీసీ కార్మికులకు సగం జీతాలే: ఈయూ

తెలంగాణ సాధనలో కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉద్యమించి సకలజనుల సమ్మెను ఉద్ధృతం చేయడంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వేతనాల పరంగా న్యాయం జరగలేదని ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఈయూ) పేర్కొంది.

Updated : 28 May 2023 03:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సాధనలో కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉద్యమించి సకలజనుల సమ్మెను ఉద్ధృతం చేయడంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వేతనాల పరంగా న్యాయం జరగలేదని ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఈయూ) పేర్కొంది. సంస్థలో ఉద్యోగుల సంఖ్య 56,740 నుంచి 43,700కి.. బస్సుల సంఖ్య 10,337 నుంచి 9,217కి తగ్గిందని ఆందోళన వ్యక్తం చేసింది. విభజన తర్వాత ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులకు వేతనాలు భారీగా పెరిగాయని, వారితో పోలిస్తే టీఎస్‌ఆర్టీసీ కార్మికుల వేతనాలు సగమే ఉన్నాయని ఈయూ ప్రధానకార్యదర్శి కె.రాజిరెడ్డి పేర్కొన్నారు. ‘ఏపీఎస్‌ఆర్టీసీలో కండక్టర్‌, డ్రైవర్ల బేసిక్‌ పేలు వరుసగా రూ.25,220, రూ.27,500 ఉండగా.. టీఎస్‌ఆర్టీసీలో రూ.12,610, రూ.13,780 మాత్రమే ఉన్నాయి. టీఎస్‌ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచుతామని గతంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ నెరవేరలేదు. 2023 మే 1 కార్మిక దినోత్సవం నాడు ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు, ఆర్థికశాఖను ఆదేశించినట్లు సీఎంఓ ప్రకటించినా అమలుకు నోచుకోలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శనివారం లేఖ రాశారు. ‘టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఉద్యోగులకు రెండు పేస్కేళ్లు అమలు చేయాలి. కొత్త బస్సులు కొనాలి. నూతన నియామకాలు చేపట్టాలి. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలి. అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వస్తువుల్ని ఆర్టీసీ కార్గో ద్వారానే రవాణా చేయాలి’.. ఇలా 15 అంశాలను లేఖలో పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని