సబ్‌స్టేషన్లకు ‘రిమోట్ కంట్రోల్’!
విద్యుత్ సరఫరా ప్రక్రియనంతా ఆటోమేషన్ పరిజ్ఞానంతో నిర్వహించేందుకు తెలంగాణ ట్రాన్స్‌కో అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది.
నిర్వహణకు అధునాతన టెక్నాలజీ వినియోగం
తెలంగాణ ట్రాన్స్‌కోకు దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థల ప్రశంసలు
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్ సరఫరా ప్రక్రియనంతా ఆటోమేషన్ పరిజ్ఞానంతో నిర్వహించేందుకు తెలంగాణ ట్రాన్స్‌కో అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. సుదూర ప్రాంతాల్లోని విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తయ్యే కరెంటు ట్రాన్స్‌కో ఆధ్వరంలో తొలుత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 400, 220 కేవీ సబ్‌స్టేషన్లకు సరఫరా అవుతుంది. అక్కడున్న సిబ్బందితో కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఆన్‌లైన్ ద్వారా ఆటోమేషన్ టెక్నాలజీతో వీటి నిర్వహణకు ట్రాన్స్‌కో ఉపక్రమించింది. తొలుత కొన్ని సబ్‌స్టేషన్లలో ఈ ప్రయోగం విజయవంతం కావడంతో మరికొన్ని చోట్ల అమలు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల కరెంటు సరఫరాలో సాంకేతిక ఇబ్బందులు తగ్గడంతో పాటు మానవ, ఆర్థిక వనరులు ఆదా కానున్నాయి. ఇటీవల కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, పుదుచ్చేరి విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు హైదరాబాద్ వచ్చి కొన్ని సబ్‌స్టేషన్లలో ఈ విధానాన్ని పరిశీలించి ప్రశంసించారు. తెలంగాణలో కరెంటు సరఫరా, పంపిణీ వ్యవస్థలను ఎలా అభివృద్ధి చేశారో పరిశీలించడానికి ఈ అధికారుల బృందం వచ్చింది.
ఆర్థికభారం పెరగకుండా..
ఆర్థికభారం పెరగకుండా సబ్‌స్టేషన్ల నిర్వహణలో సంస్కరణలు తేవాలని ట్రాన్స్‌కో సంకల్పించింది. ఉదాహరణకు సిద్దిపేటలో 132, 220 కేవీ సబ్‌స్టేషన్లు ఒకే ఆవరణలో ఉండేవి. వీటి కంట్రోల్ రూములు విడివిడిగా ఉన్నందున 10 మందికి పైగా సిబ్బంది పనిచేసేవారు. రెండు సబ్‌స్టేషన్లకు కలిపి ఒక కంట్రోల్ రూం చాలని అక్కడున్న వారిలో ముగ్గురు ఉద్యోగులను బదిలీ చేశారు. సిరిసిల్ల, వికారాబాద్ జిల్లా పరిగి, నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి, హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఇమ్లీబన్, ఎర్రగడ్డలలో రెండేసి సబ్‌స్టేషన్ల కంట్రోల్ రూములను ఒకటిగా చేశారు. హైదరాబాద్‌లో ఫీవర్ ఆసుపత్రి వద్ద ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్ కంట్రోల్ రూంను తొలగించి అక్కడున్న ముగ్గురు సిబ్బందిని బదిలీ చేశారు. దాన్ని ఉస్మానియా యూనివర్సిటీ సబ్‌స్టేషన్ నుంచి నిర్వహిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట 220 కేవీ సబ్‌స్టేషన్‌ను నల్గొండ జిల్లా డిండి 400 కేవీ సబ్‌స్టేషన్ నుంచి నిర్వహిస్తున్నారు. వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని మరికొన్ని సబ్‌స్టేషన్లను ఈ విధానంలోకి తేవడానికి కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి నగరం చుట్టూ ఏర్పాటు చేసిన 400 కేవీ సబ్‌స్టేషన్ల విద్యుత్ వలయాన్ని (పవర్ రింగ్) చూసి కర్ణాటక, కేరళ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెంగళూరు, తిరువనంతపురం నగరాలకు ఇలాంటి పవర్ రింగ్ పూర్తిగా నిర్మించలేకపోయినట్లు వారు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ విద్యుత్ రంగంపై శ్రద్ధతో నిరంతర సరఫరాకు పూర్తి స్వేచ్ఛనివ్వడం వల్ల పవర్ రింగ్ నిర్మాణం వేగంగా పూర్తిచేసినట్లు ట్రాన్స్‌కో అధికారులు వారికి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games 2023: ఈక్వెస్ట్రియన్‌లో మరో పతకం.. చరిత్ర సృష్టించిన అనుష్
-
Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. 26కు చేరిన విద్యార్థుల మరణాలు
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. 19,500 చేరువకు దిగొచ్చిన నిఫ్టీ
-
BJP: భారత తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ!
-
Taiwan: చైనాకు భారీ షాకిచ్చిన తైవాన్.. సొంతంగా సబ్‌మెరైన్ తయారీ..!
-
Manipur Violence: ‘కనీసం అస్థికలైనా తెచ్చివ్వండి’.. మణిపుర్లో ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన