పల్లెల అభివృద్ధితోనే నిజమైన ప్రగతి

హైదరాబాద్‌తో పాటు పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ ఆవిర్భావ ఆశయం నెరవేరుతుందని గవర్నర్‌ తమిళిసై అభిప్రాయపడ్డారు. కొందరు మాత్రమే కాకుండా రాష్ట్రమంతా అభివృద్ధి చెందడమే నిజమైన ప్రగతి అనిపించుకుంటుందన్నారు.

Published : 03 Jun 2023 04:09 IST

రాజ్‌భవన్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ  వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై
1969 తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌తో పాటు పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ ఆవిర్భావ ఆశయం నెరవేరుతుందని గవర్నర్‌ తమిళిసై అభిప్రాయపడ్డారు. కొందరు మాత్రమే కాకుండా రాష్ట్రమంతా అభివృద్ధి చెందడమే నిజమైన ప్రగతి అనిపించుకుంటుందన్నారు. హైదరాబాద్‌ తనకున్న సహజసిద్ధ అనుకూలతలతో మరింత వేగంగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ నగరంగా పేరు సంపాదించుకుందన్నారు. ‘‘నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజలందరికీ చెందాలన్నది ఉద్యమ ఆకాంక్ష. అయితే ఉన్నత పదవుల్లో ఉన్న కొందరు దానిని అమలు చేయడం లేదు’’ అని ఆరోపించారు. అది నిజమైన స్ఫూర్తితో జరిగినప్పుడే తెలంగాణ ఆశయం సంపూర్ణంగా నెరవేరుతుందన్నారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై 30 మంది 1969 ఉద్యమకారులను సత్కరించారు. అమరవీరుల స్తూపం రూపకర్త ఎక్కా యాదగిరిరావుకు పాదాభివందనం చేశారు. అనంతరం గవర్నర్‌ తన ప్రసంగాన్ని తెలుగులో కొనసాగించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలంగాణ ఉద్యమం పూర్తిగా అహింసాయుతమైంది. ఈ పోరాటంలో ఎందరో ఆత్మబలిదానం చేసుకున్నారు. వారందరికీ జోహార్లు. 1969 ఉద్యమంలో పాల్గొన్న కొందరు యోధులను సత్కరించుకోవడం గౌరవంగా భావిస్తున్నా. రాష్ట్రం ఏర్పడ్డాక జాతీయ రహదారులు రెండింతలయ్యాయి. కేంద్ర, రాష్ట్ర సహకారంతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. రాజ్‌భవన్‌ నుంచి ఆదివాసీలు, గిరిజనులు, మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి నిరంతర కార్యక్రమాలు చేపడుతున్నాం. ‘జై తెలంగాణ’ అనేది ఒక ఆత్మగౌరవ నినాదం. దేవుడు తెలంగాణకు నన్ను పంపడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. ప్రతి ఒక్కరం తెలంగాణ  సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం. దేశానికి ఆదర్శంగా.. నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం’’ అని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ ఆవిర్భావ దినంతో పాటు శుక్రవారం గవర్నర్‌ జన్మదినం కావడంతో వివిధ సంస్థల వ్యక్తులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా.. గవర్నర్‌ వారితో కలిసి పదం కలిపారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ ఒకరు రెడ్‌క్రాస్‌ సేవల కోసం రూ.కోటి గవర్నర్‌ చేతుల మీదుగా అందజేశారు. గవర్నర్‌ కూడా విచక్షణాధికారంతో రూ.20 లక్షలు ఇచ్చారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు