సీతమ్మసాగర్‌ పనుల పరిశీలనకు ద్విసభ్య కమిటీ

నిలిపివేతకు ఉత్తర్వులు ఇచ్చినా సీతమ్మసాగర్‌ నిర్మాణాలను కొనసాగిస్తుండటంపై నివేదిక ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) ఆదేశించడంతో గోదావరి బోర్డు చర్యలు చేపట్టింది.

Published : 06 Jun 2023 03:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: నిలిపివేతకు ఉత్తర్వులు ఇచ్చినా సీతమ్మసాగర్‌ నిర్మాణాలను కొనసాగిస్తుండటంపై నివేదిక ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) ఆదేశించడంతో గోదావరి బోర్డు చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయి పరిశీలనకు జీఆర్‌ఎంబీ, అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి ఒక్కొక్కరి చొప్పున నియమించాలని ఎన్జీటీ సూచించిన నేపథ్యంలో సోమవారం ద్విసభ్య కమిటీ ఏర్పాటైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం- దుమ్ముగూడెం మండలాల మధ్య గోదావరిపై రాష్ట్ర ప్రభుత్వం సీతమ్మసాగర్‌ ఆనకట్ట నిర్మిస్తోంది. దీనిపై స్థానికులు కొందరు అభ్యంతరాలు లేవనెత్తుతూ ఎన్జీటీని ఆశ్రయించారు. వెనుక జలాలతో నివాసాలు, అడవులు ముంపునకు గురవుతాయని, నష్టపరిహారం పూర్తిస్థాయిలో చెల్లించడం లేదని, సరైన అనుమతులు పొందకుండానే పనులు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ ఏడాది మార్చి 24న పనుల నిలిపివేతకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అయినా పనులు కొనసాగిస్తున్నారంటూ మే నెలలో మరోసారి కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నాయా లేదా పరిశీలించి నివేదిక సమర్పించాలని జీఆర్‌ఎంబీని ట్రైబ్యునల్‌ ఆదేశించింది. ఈ నేపథ్యంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు చెందిన పర్యవేక్షక ఇంజినీరు కె.ప్రసాద్‌ను ఓ సభ్యుడిగా బోర్డు ఛైర్మన్‌ ఎంకే సిన్హా నియమించారు. మరో సభ్యుడిగా అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ ప్రాంతీయ సంచాలకుడు తరుణ్‌.కె ద్విసభ్య నియమితులయ్యారు. వీరు వచ్చే నెల 12లోగా ట్రైబ్యునల్‌కు నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ నెల రెండోవారంలో సీతమ్మసాగర్‌ ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని