పత్తి విత్తు.. నకిలీల విపత్తు

రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్‌కు నకిలీ పత్తి విత్తనాలు పోటెత్తుతున్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌ తదితర రాష్ట్రాల నుంచి భారీగా రవాణా అవుతున్నాయి.

Published : 07 Jun 2023 03:35 IST

తెలంగాణ మార్కెట్‌ విత్తన మాఫియా విజృంభణ
మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక, గుజరాత్‌ల నుంచి సరఫరా
ప్రముఖ కంపెనీల పేరిట ఏజెంట్లతో విక్రయాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్‌కు నకిలీ పత్తి విత్తనాలు పోటెత్తుతున్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌ తదితర రాష్ట్రాల నుంచి భారీగా రవాణా అవుతున్నాయి. రంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్‌, వికారాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాలను కేంద్రాలుగా చేసుకొని వందల సంఖ్యలో వ్యాపారులు రాష్ట్రవ్యాప్తంగా వీటిని విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ బృందాలు పెద్దఎత్తున నకిలీ విత్తనాలను పట్టుకుంటున్నాయి. 

రెండో పెద్ద పంట..

తెలంగాణలో వరి తర్వాత రెండో ప్రధాన పంట పత్తి. 2021లో 43 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. 2022లో 50 లక్షల ఎకరాలకు చేరింది. ఈ ఏడాది మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పత్తి ఎగుమతుల్లో పెరుగుదల, దేశీయ మార్కెట్లో డిమాండ్లు, రాష్ట్రంలో జిన్నింగ్‌ మిల్లులు, జౌళి పార్కులు పెరగడంతో పత్తి సాగు ఊపందుకుంటోంది. ఇది వర్షాధార పంట కావడంతో జూన్‌ రెండో వారంలో విత్తుకునేందుకు నెల ముందు నుంచే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల కోసం 1.20 కోట్ల విత్తన ప్యాకెట్లు అవసరం. ఇందులో బీటీ-1, బీటీ-2 రకాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. ప్రభుత్వపరంగా సరఫరా మాత్రం లేదు. ప్రముఖ, స్థానిక కంపెనీలవే అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కువగా బీటీ-2 రకం వాడకంలో ఉంది. బీటీ-3 పేరిట వ్యాపారులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారు. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా కాపుకొస్తుందని మాయమాటలు చెప్పి అంటగడుతున్నారు.

వ్యాపారులకు కమీషన్‌

ఆయా రాష్ట్రాల్లో నకిలీ విత్తనాలు తయారు చేయించి, ప్రధాన కంపెనీల తరహాలో ముద్రించిన ప్యాకెట్లలో వేసి తెలంగాణకు రవాణా చేస్తున్నారు. విత్తనాలు, ఎరువుల వ్యాపారులకు కమీషన్‌ ఇస్తామని నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించేలా చేస్తున్నారు. వ్యాపారులు ఏజెంట్ల ద్వారా గ్రామాల్లో అమ్మకం చేయిస్తున్నారు. విత్తనం కొనుగోలు చేసిన సమయంలో రసీదు, బిల్లు తీసుకోవాలని అధికారులు చెబుతున్నా రైతులు పాటించడం లేదు. తరువాత సరైన పూత, కాత రాక మోసపోయామని గుర్తించినా వ్యాపారులను ప్రశ్నించడానికి ఆధారాలు ఉండటం లేదు.

టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశాకే..

ఏపీలోని ఉమ్మడి గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలు, కర్ణాటకలోని యాద్గిర్‌, బీదర్‌, మహారాష్ట్రలో నాగ్‌పుర్‌, పుణె, నాందేడ్‌ల మీదుగా పత్తి విత్తనాలు తెలంగాణకు చేరుతున్నాయి. సరిహద్దుల్లో చెక్‌పోస్టుల గుండా విత్తనాలు చేరుతున్నా కట్టడి జరగడం లేదు. రైళ్లలోనూ భారీగా అక్రమ రవాణా జరుగుతున్నా అక్కడా తనిఖీల్లేవు. తెలంగాణ ప్రభుత్వం పోలీసు, వ్యవసాయాధికారులతో సంయుక్త టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు చేసిన తర్వాత ఈ ముఠాలు దొరుకుతున్నాయి. పక్షం రోజుల వ్యవధిలో రాచకొండ, సైబరాబాద్‌, వరంగల్‌లోని టాస్క్‌ఫోర్స్‌ బృందాలు బాలానగర్‌, దుండిగల్‌, చౌటుప్పల్‌, మడికొండ, గీసుగొండ తదితర ప్రాంతాల్లో 20 టన్నుల మేర నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నాయి. దాదాపు 20 మందిని అరెస్టు చేశారు. దాడులను మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది.


ఏటా ధరల పెంపు, కృత్రిమ కొరత

బ్రాండెడ్‌ పత్తి విత్తనాల ధర ఏటా పెరుగుతుండటం నకిలీ విత్తనాల వ్యాపారులకు వరంగా మారింది. ఈ ధరను కేంద్ర ప్రభుత్వమే నిర్ధారిస్తుంది. మరోవైపు ఇవి విరివిగా లభించడమూ లేదు. ఇదే అదనుగా వ్యాపారులు ధరను అమాంతం పెంచి విక్రయిస్తున్నారు. వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి, జనగామ, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి తదితర జిల్లాల్లో ఒక ప్యాకెట్‌ను రూ.1500- రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని