ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో గందరగోళానికి తెర!

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే విద్యాసంవత్సరం (2024-25) బీటెక్‌ ప్రవేశాల కోసం వివిధ ప్రక్రియలను పూర్తిచేసి ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభించాలని సంకల్పించింది.

Updated : 19 Dec 2023 07:26 IST

ఇక ప్రణాళికాబద్ధంగా ‘ఇంజినీరింగ్‌’ అనుమతులు
మే 31 నాటికి అనుబంధ గుర్తింపు
జూన్‌ 30కి తొలివిడత కౌన్సెలింగ్‌ ముగింపు
6 నెలల ముందే కాలపట్టిక ఖరారు

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే విద్యాసంవత్సరం (2024-25) బీటెక్‌ ప్రవేశాల కోసం వివిధ ప్రక్రియలను పూర్తిచేసి ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభించాలని సంకల్పించింది. రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు కొత్త కోర్సులు, సీట్ల పెంపు అనుమతి, విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలలకు అనుబంధ గుర్తింపు జారీ, బీటెక్‌ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ ప్రారంభం తదితర ప్రక్రియలను ప్రణాళికాబద్ధంగా, పక్కాగా పూర్తిచేయాలని నిర్ణయించింది. అందుకు దాదాపు 6 నెలల ముందుగానే కాలపట్టికను రూపొందించింది. ఆ ప్రకారం ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా వర్సిటీలను ఆదేశించింది. దీనివల్ల కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థుల్లో అయోమయ పరిస్థితులు తలెత్తకుండా ఉంటుందని, కౌన్సెలింగ్‌ను హడావుడిగా కాకుండా కూడా సజావుగా నిర్వహించుకోవచ్చని భావిస్తోంది.

రాష్ట్రంలో ఏటా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ కాలపట్టిక జారీ అయిన తర్వాత వెబ్‌ ఆప్షన్లు ప్రారంభమయ్యే రోజుకు కూడా జేఎన్‌టీయూహెచ్‌ ఆయా కళాశాలలకు అఫిలియేషన్‌ ఇవ్వకపోవడం, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేయడం, కొత్త కోర్సులు, సీట్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని, వాటిని మంజూరు చేయాలని కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయిస్తుండటం.. తదితరాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు విద్యాశాఖ.. సాంకేతిక విద్యాశాఖ, జేఎన్‌టీయూహెచ్‌, ఓయూ తదితర వర్సిటీల అధికారులు, పలు ఇంజినీరింగ్‌ కళాశాలల యజమానులతో సమావేశమై చర్చించింది. సమావేశంలో ప్రస్తావించిన అంశాల ఆధారంగా తాజాగా కాలపట్టికను ఖరారు చేసింది. ఆ ప్రకారం వర్సిటీలు అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ మొదలయ్యే వరకు అఫిలియేషన్‌ ప్రక్రియ ఎంతవరకు పూర్తయిందన్న విషయాన్ని విద్యాశాఖ అసలే పట్టించుకునేదే కాదు. ఈ సారి విద్యాశాఖ దాన్ని ఏకంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం.

ఆమోదించిన నెలలో అనుబంధ గుర్తింపు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన ఆయా కళాశాలలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఏప్రిల్‌ 30వ తేదీ నాటికి ఆమోదం తెలుపుతుంది. తర్వాత నెల రోజుల్లో.. అంటే మే 31 నాటికి జేఎన్‌టీయూహెచ్‌, ఓయూ, కాకతీయ వర్సిటీలు నిబంధనల మేరకు అఫిలియేషన్‌ ఇవ్వాలి. కళాశాలలు ప్రవేశపెట్టే కొత్త కోర్సులు, సీట్లు పెంచుకోవడానికి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అందుకు తమ ప్రతిపాదనలను జనవరి 31వ తేదీలోపు యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(యూఎంఎస్‌) పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు