పేపర్‌బాయ్‌ స్థాయి నుంచి చట్టసభకు.. ఇప్పటికీ ఇందిరమ్మ ఇంట్లోనే: ఖానాపూర్‌ ఎమ్మెల్యే

తాను డిగ్రీ చదివిన తర్వాత ‘ఈనాడు’ పేపర్‌బాయ్‌గా పని చేశానని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. ఆ స్థాయి నుంచి చట్టసభకు ఎన్నిక కావడం సీఎం రేవంత్‌రెడ్డి వల్లే జరిగిందన్నారు.

Updated : 17 Jan 2024 12:33 IST

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: తాను డిగ్రీ చదివిన తర్వాత ‘ఈనాడు’ పేపర్‌బాయ్‌గా పని చేశానని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. ఆ స్థాయి నుంచి చట్టసభకు ఎన్నిక కావడం సీఎం రేవంత్‌రెడ్డి వల్లే జరిగిందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో జరిగిన రాష్ట్ర ప్రింట్‌ మీడియా డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ ప్రథమ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏపీజే అబ్దుల్‌ కలాం చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు.

‘2006లో డిగ్రీ పూర్తయిన తర్వాత మా తాత గేదెను విక్రయించి సైకిల్‌ కొనిచ్చారు. దాంతో ఆదిలాబాద్‌ ఆర్టీసీ బస్‌స్టాండు ప్రాంతంలో ‘ఈనాడు’ పేపర్‌బాయ్‌గా చేరాను. తర్వాత ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేశాను. ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లోనే జీవనం సాగిస్తున్నాను. ఇలాగే నిరాడంబరంగా జీవిస్తూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తాను. దినపత్రిక పంపిణీదారుల న్యాయమైన డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను’ అని హామీ ఇచ్చారు. అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు సునీల్‌ పాఠంకర్‌, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వనమాల సత్యం, కె.రాంప్రసాద్‌రావు మాట్లాడుతూ.. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా డిస్ట్రిబ్యూటర్స్‌, పేపర్‌బాయ్స్‌కు వసతులు, పథకాల అమలుతోపాటు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా 2024 క్యాలండర్‌, డైరీలను ఆవిష్కరించారు. అసోసియేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్తార్‌, ఉపాధ్యక్షుడు సతీష్‌కుమార్‌, కోశాధికారి రాజేందర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని