నిర్మాణాల తొలగింపునకు ఆదేశాలిచ్చే పరిధి లోకాయుక్తకు లేదు: హైకోర్టు

ప్రైవేటు వ్యక్తులకు చెందిన నిర్మాణాలను తొలగించాలంటూ ఆదేశాలిచ్చే పరిధి లోకాయుక్తకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.

Published : 09 May 2024 03:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేటు వ్యక్తులకు చెందిన నిర్మాణాలను తొలగించాలంటూ ఆదేశాలిచ్చే పరిధి లోకాయుక్తకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో చేపట్టిన నిర్మాణాలను తొలగించాలంటూ 2015 డిసెంబరులో లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ సీహెచ్‌ హనుమంతరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌కు చెందిన 194 చదరపు గజాల స్థలంలో 33.33 గజాలను రోడ్డు విస్తరణలో భాగంగా జీహెచ్‌ఎంసీ తీసుకుందన్నారు. ఇందుకు ఎలాంటి పరిహారం చెల్లించలేదని తెలిపారు. పిటిషనర్‌ స్థలంలో చేపట్టిన నిర్మాణాలపై అంజమ్మ అనే మహిళ ఫిర్యాదు మేరకు వాటిని తొలగించాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా, తమ వాదన వినకుండా నిర్మాణాలను పోలీసు రక్షణతో తొలగించాలని జీహెచ్‌ఎంసీకి ఆదేశాలు జారీ చేసిందన్నారు. చట్టప్రకారం పబ్లిక్‌ సర్వెంట్స్‌ కేటగిరీకి చెందిన అంశాలపై మాత్రమే లోకాయుక్తకు పరిధి ఉంటుందన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం నిర్మాణాలను కూల్చివేయాలంటూ ఆదేశాలిచ్చే పరిధి లోకాయుక్తకు లేదని, ఆ ఆదేశాలను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు