Pashupati temple: ఆలయంలో 10 కిలోల బంగారం మాయం.. రంగంలోకి అవినీతి నిరోధక శాఖ!

నేపాల్‌లోని ప్రముఖ పశుపతి ఆలయం (Pashupati temple)లో 10కిలోల బంగారం మాయం కావడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Published : 25 Jun 2023 20:26 IST

కాఠ్‌మాండూ: నేపాల్‌లోని ప్రముఖ పశుపతినాథ్‌ ఆలయంలో (Pashupati temple) బంగారం మాయం కావడం చర్చనీయాంశమైంది. సుమారు 100కిలోల బంగారు ఆభరణాలు ఉండాల్సి ఉండగా.. అందులో  దాదాపు 10కిలోల నగలు మాయమయ్యాయనే (Gold Missing) ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు.. ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని సోదాలు నిర్వహించారు. దీంతో కొన్ని గంటలపాటు దర్శనాలను నిలిపివేశారు.

కాఠ్‌మాండూలో హిందూ దేవాలయాల్లో పశుపతినాథ్‌ ఆలయం (Pashupati temple) అత్యంత ప్రాచీనమైనది.  గతేడాది మహాశివరాత్రి సమయంలో అందులోని శివలింగం చుట్టూ బంగారంతో కూడిన జలహరిని (Jalahari) ఏర్పాటు చేశారు. ఇందుకోసం పశుపతి ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ 103 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసింది.  ఆ ఆభరణాల్లో దాదాపు 10కిలోల బంగారం మాయమైందన్న వార్తలు వచ్చాయి. దీనిపై అక్కడి పార్లమెంటులోనూ ప్రశ్నలు లేవనెత్తారు. స్పందించిన ప్రభుత్వం.. నేపాల్‌ అవినీతి నిరోధక శాఖను (సీఐఏఏ) దర్యాప్తు చేయాలని ఆదేశించింది.  రంగంలోకి దిగిన సీఐఏఏ అధికారులు..  ఆలయాన్ని తమ స్వాధీనంలోకి తీసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.

బంగారంతో చేసిన జలహరి నాణ్యత, బరువుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దానిని అవినీతి నిరోధకశాఖ అధికారులు పరిశీలిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఘన్‌ష్యామ్‌ ఖాటీవాడీ వెల్లడించారు. అందుకే కొన్ని గంటలపాటు దర్శనానికి అనుమతించడం లేదని, భక్తులను ఆలయంలోకి  రానివ్వడం లేదన్నారు.  ప్రముఖ ఆలయం కావడంతో దర్యాప్తు సమయంలో ఆలయ ప్రాంగణంలో నేపాల్‌ ఆర్మీతో పాటు భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని