Canada: హంతకులకు ఆశ్రయం ఇస్తున్నారు.. కెనడాపై బంగ్లాదేశ్‌ మంత్రి తీవ్ర ఆరోపణలు

కెనడాతో వివాదం నేపథ్యంలో భారత్‌కు పొరుగు దేశాలు మద్దతు తెలుపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం శ్రీలంక విదేశాంగ మంత్రి మద్దతు తెలుపగా.. తాజాగా బంగ్లాదేశ్‌ సైతం పరోక్షంగా భారత్‌కు బాసటగా నిలిచింది. 

Updated : 29 Sep 2023 15:37 IST

ఢాకా: కెనడాతో వివాదం విషయంలో బంగ్లాదేశ్‌ పరోక్షంగా భారత్‌కు మద్దతు తెలిపింది. కెనడా హంతకులకు ఆశ్రయం ఇస్తోందని బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్‌ మూమెన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. నేరస్థులను అప్పగించే విషయంలో కెనడా వ్యవహారశైలిని కూడా ఆయన తప్పుబట్టారు. బంగ్లాదేశ్‌ వ్యవస్థాపకుడు షేక్‌ ముజీబుర్‌ రెహమాన్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న నూర్‌ చౌదురిని అప్పగించడంలో కెనడా నిర్లక్ష్యంగా వ్యవహరించిదని ఆరోపించారు. 

‘‘హంతకులకు కెనడా కేంద్రం కాకూడదు. హత్య చేసిన వారంతా కెనడాకు వెళ్లి ఆశ్రయం పొందుతున్నారు. అక్కడ వారు మంచి జీవితాన్ని గడుపుతున్నారు. కానీ, వారి బంధువులు మాత్రం స్వదేశంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. నూర్‌ చౌదురి అప్పగింతపై కెనడాకు మేము అన్ని ఆధారాలు సమర్పించాం. కానీ, కెనడా మాత్రం ఇప్పటి వరకు దానిపై స్పందించలేదు’’ అని అబ్దుల్‌ మూమెన్‌ ఆరోపించారు. భారత్-కెనడా వివాదంపై స్పందిస్తూ.. రెండూ బంగ్లాదేశ్‌కు మిత్ర దేశాలే అని వ్యాఖ్యానించారు. 

ట్రూడో అనుకున్నదొకటి.. అయ్యిందొకటి: నిజ్జర్‌ ఊసెత్తని అమెరికా..!

ఖలిస్థాన్‌ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య విషయంలో కెనడాతో వివాదం నెలకొన్న నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం శ్రీలంక విదేశాంగ మంత్రి సైతం భారత్‌కు మద్దతు తెలిపారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా భారత్‌పై ఆరోపణలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. తాజాగా బంగ్లాదేశ్‌ సైతం కెనడా వైఖరిని తప్పుపట్టింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని