Pakistan: ప్రధాని రేసు నుంచి భుట్టో నిష్క్రమణ.. నవాజ్‌కు మార్గం సుగమం!

పాకిస్థాన్‌ ప్రధాని రేసు నుంచి తాను వైదొలిగినట్లు ‘పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ’ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో ప్రకటించారు.

Published : 13 Feb 2024 22:48 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (PML-N) అధినేత, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ (Nawz Sharif) నాలుగోసారి పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ప్రధాని రేసు నుంచి వైదొలిగినట్లు పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP) ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ (Bilawal Bhutto) వెల్లడించారు. నూతన ప్రభుత్వంలో తమ పార్టీ భాగమవ్వకుండానే.. ‘పీఎంఎల్‌-ఎన్‌’ ప్రధాని అభ్యర్థికి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ రెండు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అంగీకరించినట్లు వార్తలు వచ్చిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.

మీడియాతో భుట్టో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థానాలు పొందడంలో తమ పార్టీ విఫలమైందన్నారు. ఈ కారణంగా ప్రధాని అభ్యర్థిత్వం కోసం పోటీ పడటం లేదని చెప్పారు. ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన ‘పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌’ పార్టీ తమతో సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడానికి నిరాకరించిందన్నారు. దేశంలో రాజకీయ స్థిరత్వం కోసం.. పీఎంఎల్‌-ఎన్‌ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

మూడేళ్లు మీకు.. రెండేళ్లు మాకు?

గత ప్రభుత్వంలో ‘పీఎంఎల్‌-ఎన్‌’తో తమ అనుభవం బాగా లేదని, సంకీర్ణ ప్రభుత్వ హయాంలో తమ సమస్యలను ఆ పార్టీ పరిష్కరించలేదని భుట్టో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎటూ తేలని ఫలితాలు వచ్చిన నేపథ్యంలో.. మరోసారి పోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉందా? అని అడిగిన ప్రశ్నను తోసిపుచ్చారు. తన తండ్రి, మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని మరోసారి దేశాధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుత సమస్యల నుంచి ఆయన దేశాన్ని గట్టెక్కించగల సమర్థుడని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు