China: అమెరికా వాణిజ్యశాఖ మెయిల్స్‌ హ్యాక్‌..

అమెరికాలోని అత్యంత కీలకమైన శాఖల్లోని కంప్యూటర్లను చైనాకు చెందిన ఓ గ్రూపు హ్యాక్‌ చేసింది. హ్యాకింగ్‌ బాధిత విభాగాల్లో విదేశాంగశాఖ కూడా ఉన్నట్లు సమాచారం. 

Updated : 13 Jul 2023 15:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా కేంద్రంగా పనిచేసే హ్యాకర్లు అమెరికాలోని అత్యంత కీలకమైన గవర్నమెంట్ ఏజెన్సీలు సహా 25 సంస్థల్లోకి చొరబడినట్లు టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. ఈ సైబర్‌ దాడి గురించి తమకు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించినట్లు అమెరికా వాణిజ్యశాఖ సెక్రటరీ గినా రైమాండో వెల్లడించారు. ‘డిపార్ట్‌మెంట్‌ సిస్టమ్‌ హ్యాక్‌ అయినట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది’’ అని వాణిజ్యశాఖ ప్రతినిధి పేర్కొన్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై నిఘా ఉంచామని.. అవసరమైనప్పుడు స్పందిస్తామని తెలిపారు. 

మరోవైపు అమెరికా విదేశాంగశాఖను కూడా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకొన్నారని స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై విదేశాంగశాఖ మౌనం వహిస్తోంది. మరోవైపు తమ దేశం పేరిట జరుగుతున్న ప్రచారం అవాస్తవమని లండన్‌లోని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది. అమెరికానే ప్రపంచంలో అతిపెద్ద హ్యాకింగ్‌ సామ్రాజ్యమని ఆరోపించింది. వాషింగ్టన్‌ను ప్రపంచ సైబర్‌ దొంగగా అభివర్ణించింది. 

మరోవైపు మైక్రోసాఫ్ట్‌ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. చైనా కేంద్రంగా పనిచేసే హ్యాకింగ్‌ గ్రూప్‌ స్ట్రామ్‌-0558 అమెరికాలోని కీలక శాఖల ఈమెయిల్స్‌ను హ్యాక్‌ చేసింది. ఈ గ్రూపు ప్రాథమికంగా పశ్చమ ఐరోపాలోని ప్రభుత్వ ఏజెన్సీలను లక్ష్యంగా చేసుకొంటుంది. గూఢచర్యం, డేటా చౌర్యం, క్రెడెన్షియల్స్‌ యాక్సెస్‌ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. 

మే నెల మధ్య నుంచే హ్యకింగ్‌ చర్యలు మొదలైనట్లు గుర్తించామని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. తాజాగా ఆ దాడులను అడ్డుకొని.. ఇప్పటికే దాడికి గురైన కస్టమర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. అమెరికాకు వ్యతిరేకంగా చైనా చేపట్టిన అతిపెద్ద సైబర్‌ దాడుల్లో ఇది కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు చైనా కూడా ఈ రిపోర్టుపై స్పందించింది. మైక్రోసాఫ్ట్‌ నివేదిక వృత్తిపరంగా అనైతికం, తప్పుడు సమాచారమని పేర్కొంది. తామ ఎటువంటి హ్యాకింగ్‌ కార్యకలాపాల్లో పాల్గొనలేదని బీజింగ్‌ వెల్లడించింది.

ఐరోపాలోని పలు ప్రభుత్వాల ఈ మెయిళ్లను తమ దేశానికి చెందిన స్టార్మ్‌-0558 గ్రూపు హ్యాక్‌ చేసిందని మైక్రోసాఫ్ట్‌ నివేదిక ఇచ్చిన సమయంలోనే ఈ విషయాలు బయటపడటం గమనార్హం. తమ మెయిళ్లలో అసాధారణ కార్యకలాపాలను గుర్తించి వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని