China: తైవాన్‌ను చుట్టేస్తున్న చైనా.. తమ భూభాగంలో కలిపేసేందుకు ‘బ్లూప్రింట్’ విడుదల

China-Taiwan: చైనా, తైవాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తైవాన్‌ను విలీనం చేసుకొనే దిశగా డ్రాగన్‌ మరో దుందుడుకు చర్య చేపట్టింది.

Updated : 14 Sep 2023 10:49 IST

హాంకాంగ్‌: తైవాన్‌ (Taiwan)ను ఎలాగైనా ఆక్రమించేందుకు చైనా (China) తన కుయత్నాలను ముమ్మరం చేసింది. ఈ ద్వీపం తమ దేశంలోని భాగమేనని వాదిస్తున్న డ్రాగన్‌.. తాజాగా దీన్ని తమ భూభాగంలో విలీనం చేసుకొనేందుకు ఓ ప్రణాళికను ఆవిష్కరించింది. ఈ బ్లూప్రింట్‌ను విడుదల చేయడానికి ముందు.. తైవాన్‌ను బెదిరించేందుకు ఆ ద్వీపం దిశగా చైనా యుద్ధనౌకలను పంపించింది.

చైనాలో తీర ప్రావిన్స్‌ ఫుజియాన్‌, తైవాన్‌ (Taiwan) మధ్య జలసంధుల పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే విధంగా డ్రాగన్‌ ఇటీవల ఓ ప్రణాళికను ఆవిష్కరించింది. తైవాన్‌ భవిష్యత్తు అభివృద్ధికి బ్లూప్రింట్‌గా చెబుతున్న ఈ ప్లాన్‌ చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ సెంట్రల్‌ కమిటీ విడుదల చేసింది. తైవాన్‌తో సమగ్ర అభివృద్ధికి ఫుజియాన్‌ను ‘ప్రత్యేక జోన్‌’గా మార్చడంతో పాటు తైవాన్‌ నివాసితులు చైనాలో స్థిరపడేందుకు, ఇక్కడ వ్యాపారాలు చేసేందుకు వీలుగా ఫుజియాన్‌ను ‘ఫస్ట్‌ హోం’గా పేర్కొంటూ ఈ ప్రణాళికను ఆవిష్కరించినట్లు డ్రాగన్‌ మీడియా కథనాలు వెల్లడించాయి.

పోరాడండి.. నా మద్దతు మీకే: పుతిన్‌కు కిమ్‌ హామీ

అయితే, తైవాన్‌ చుట్టూ యుద్ధ మేఘాలు అలుముకున్న వేళ.. చైనా ఈ బ్లూప్రింట్‌ను తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత వారాంతంలో అమెరికా, కెనడాలకు చెందిన యుద్ధనౌకలు తైవాన్‌ జలసంధిలో ప్రయాణించి చైనా దుందుడుకు చర్యలను సవాలు చేశాయి. దీంతో ఆగ్రహించిన డ్రాగన్‌ .. సోమవారం తన యుద్ధనౌకల దండును తైవాన్‌ జలసంధిలోకి పంపించింది. సైన్యం ఇక్కడ యుద్ధవిమానాలు, జలాంతర్గాముల సన్నద్ధత, ఇతర యుద్ధ విన్యాసాలను చేపడుతుందని చైనా మీడియా వెల్లడించింది.

మరోవైపు వచ్చే ఏడాది జనవరిలో తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో చైనా కొత్త బ్లూప్రింట్‌ను ఆవిష్కరించడం గమనార్హం. అయితే, దీనిపై తైవాన్‌ చట్టప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ఇది ‘హాస్యాస్పదం’ అంటూ డ్రాగన్‌పై మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని