Xi Jinping: అవును..జిన్‌పింగ్ భారత్‌ రావట్లేదు: వెల్లడించిన చైనా విదేశాంగ శాఖ

ఈ వారం భారత ప్రభుత్వం దిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. దీనికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్(Xi Jinping) హాజరు కావడం లేదు. 

Published : 04 Sep 2023 13:45 IST

బీజింగ్: భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(Chinese President Xi Jinping) హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని సోమవారం చైనా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఆయన స్థానంలో ప్రధాని లీ చియాంగ్‌ భారత్‌ వస్తున్నారు.

‘భారత ప్రభుత్వం ఆహ్వానం మేరకు సెప్టెంబర్‌ 9,10 తేదీల్లో దిల్లీలో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని లీ చియాంగ్‌  పాల్గొంటారు. చైనా బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు ’ అని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ మీడియాకు వెల్లడించారు. 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనతో చైనా, భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. 

జీ20పై జిన్‌పింగ్ నిర్ణయం నిరాశపర్చింది: బైడెన్‌

తాజాగా భారత్‌ ఒకవైపు జీ20 సదస్సు(G20 summit)కు ఏర్పాట్లు చేస్తుంటే.. చైనా సరికొత్త మ్యాప్‌తో వివాదం మొదలుపెట్టింది. సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయ్‌ చిన్‌, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రాలను తమ దేశంలోని భూభాగాలుగా అందులో పేర్కొంది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల మధ్య ఆయన భారత్‌ రావడం లేదు. 

ఇదిలా ఉంటే.. ప్రపంచ నేతలు నిత్యం బిజీ షెడ్యూల్‌లో ఉంటారని, వారు ప్రతి సంవత్సరం జరిగే ప్రతి సదస్సుకు హాజరుకావడం సాధ్యం కాదని సంబంధిత అధికారులు అభిప్రాయపడ్డారు. అలాగే ఈ పరిణామాలు ఆతిథ్య దేశంపై ఎలాంటి ప్రభావం చూపవని పేర్కొన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని