Apple Computer: తొలితరం యాపిల్‌ కంప్యూటర్‌కు రూ.1.84 కోట్లు

యాపిల్‌ సంస్థ తొలినాళ్లలో రూపొందించిన వ్యక్తిగత కంప్యూటర్లలో ఒకటి అమెరికాలోని బోస్టన్‌లో ‘ఆర్‌ఆర్‌ ఆక్షన్‌’ సంస్థ నిర్వహించిన వేలంలో రూ.1.84 కోట్లకు (2,23,000 డాలర్లకు) అమ్ముడుపోయింది.

Updated : 26 Aug 2023 15:08 IST

వేలంలో ఊహించిన ధర కంటే అధికం

బోస్టన్‌: యాపిల్‌ సంస్థ తొలినాళ్లలో రూపొందించిన వ్యక్తిగత కంప్యూటర్లలో ఒకటి అమెరికాలోని బోస్టన్‌లో ‘ఆర్‌ఆర్‌ ఆక్షన్‌’ సంస్థ నిర్వహించిన వేలంలో రూ.1.84 కోట్లకు (2,23,000 డాలర్లకు) అమ్ముడుపోయింది. ఈ కంప్యూటర్‌పై యాపిల్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడైన స్టీవ్‌ వాజ్నియాక్‌ సంతకం సైతం ఉండడం విశేషం. యాపిల్‌-1 కంప్యూటర్‌ను పూర్తిస్థాయిలో పనిచేసే స్థితికి పునరుద్ధరించామని, దీనికి కస్టమ్‌ కేస్‌తోపాటు, బిల్ట్‌ ఇన్‌ కీబోర్డును అమర్చినట్లు బోస్టన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ‘ఆర్‌ఆర్‌ ఆక్షన్‌’ సంస్థ తెలిపింది. 1976, 1977ల్లో కాలిఫోర్నియా లాస్‌ ఆల్టోస్‌లోని స్టీవ్‌ జాబ్స్‌ గ్యారేజీలో ఇలాంటి కంప్యూటర్లను 200 వరకు తయారు చేశారు. అప్పట్లో దీనిని సుమారు రూ.55,000 (666 డాలర్లకు) విక్రయించారు. వాస్తవానికి యాపిల్‌-1 కంప్యూటర్‌ వేలంలో సుమారు రూ.1.65 కోట్లు (2,00,000 డాలర్లకు) పలుకుతుందని అంచనా వేశారు. దీనిపై 2017లో బ్రియంట్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వాజ్నియాక్‌.. ‘వాజ్‌’ అని సంతకం చేశారు. వేలంలో దీనిని దక్కించుకున్న వ్యక్తి వివరాలను ఆయన అభ్యర్థన మేరకు ‘ఆర్‌ఆర్‌ ఆక్షన్‌’ సంస్థ ప్రకటించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు