India- Canada: భారత వ్యవహారాల్లో జోక్యం వల్లే..! కెనడా సిబ్బంది తగ్గింపుపై జైశంకర్‌

భారత వ్యవహారాల్లో జోక్యం వల్లే ఇక్కడి కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని కోరినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్‌ తెలిపారు.

Updated : 22 Oct 2023 19:55 IST

దిల్లీ: భారత్‌- కెనడా సంబంధాలు (India- Canada Ties) క్లిష్ట దశలో ఉన్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ (Jaishankar) పేర్కొన్నారు. భారత వ్యవహారాల్లో కెనడా దౌత్య సిబ్బంది జోక్యంపై ఆందోళన నెలకొందన్నారు. అందుకే.. వారి సంఖ్య విషయంలో సమానత్వాన్ని (Diplomatic Parity) అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. కెనడాలోని భారత దౌత్యవేత్తల భద్రత విషయంలో పురోగతి కనిపిస్తే.. కెనడియన్లకు వీసాల జారీని పునః ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఓ కార్యక్రమంలో భాగంగా భారత్‌- కెనడా సంబంధాలపై జైశంకర్‌ ఈమేరకు మాట్లాడారు.

‘వియన్నా ఒప్పంద సూత్రాల్లో దౌత్యపర సమానత్వం గురించి స్పష్టంగా ఉంది. భారత వ్యవహారాల్లో కెనడా సిబ్బంది నిరంతర జోక్యంపై మాకు ఆందోళనలు ఉన్నాయి. అందుకే మేం ఈమేరకు చర్యలు తీసుకున్నాం’ అని భారత్‌లో కెనడా దౌత్య సిబ్బంది తగ్గింపుపై జైశంకర్‌ స్పందించారు. భారత్‌, కెనడాల మధ్య సంబంధాలు ప్రస్తుతం క్లిష్ట దశలో ఉన్నాయన్నారు. కెనడా రాజకీయాల్లోని కొన్ని వర్గాలు, వారి విధానాలతో భారత్‌కు సమస్యలు ఉన్నాయని చెప్పారు.

‘దౌత్యవేత్తల తగ్గింపు’ వివాదం.. కెనడాకు భారత్‌ గట్టి కౌంటర్‌

ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో భారత ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించిన దరిమిలా.. రెండు దేశాల మధ్య దౌత్యపర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను ఖండించిన భారత్‌.. కెనడాలో వీసా సేవలను నిలిపేయడంతోపాటు భారత్‌లోని దౌత్యసిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని ఒటావాకు డెడ్‌లైన్‌ విధించింది. ఈ క్రమంలోనే 41 మందిని కెనడా వెనక్కి రప్పించింది. దిల్లీ నిర్ణయం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ట్రూడో సర్కారు ఆరోపించగా.. నిబంధనలకు అనుగుణంగానే చర్యలు తీసుకున్నామని భారత్‌ స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని