Kohinoor: పట్టాభిషేక సంవత్సరానికి గుర్తుగా.. ప్రదర్శనకు ‘కోహినూర్‌’ వజ్రం!

చారిత్రక ప్రాముఖ్యం కలిగిన ‘కోహినూర్‌’ వజ్రాన్ని ‘విజయ చిహ్నం’గా లండన్‌ టవర్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారు. మే 26 నుంచి ఈ ప్రదర్శన ప్రజలకు అందుబాటులోకి రానుంది.

Updated : 17 Mar 2023 14:55 IST

లండన్‌: కోహినూర్‌(Kohinoor).. వలస పాలనకు గుర్తుగా ఇప్పటికీ బ్రిటన్‌ రాజకుటుంబం(Britain Royal Family) చేతిలో ఉన్న అరుదైన వజ్రం. విక్టోరియా మహారాణి ‘కోహినూర్‌’ గురించి రాసిన వీలునామా ప్రకారం.. చార్లెస్‌ భార్య, బ్రిటన్‌ రాణి కెమిల్లా(camilla) ప్రస్తుతం దానిని ధరించాల్సి ఉంది. కానీ, కెమిల్లా తన కిరీటంలో కోహినూర్‌ను పోలిన మరో వజ్రం ధరిస్తారని బకింగ్‌హాం ప్యాలెస్‌ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ క్రమంలోనే.. లండన్ టవర్‌(Tower of London)లో బ్రిటన్ రాజాభరణాల (Crown Jewels) ప్రదర్శనలో భాగంగా ఈ వజ్రాన్ని ‘విజయ చిహ్నం(Symbol of Conquest)’గా ప్రదర్శించనున్నారు. బ్రిటన్‌ రాజభవనాలను నిర్వహించే హిస్టారిక్‌ రాయల్‌ ప్యాలెసెస్‌(HRP) ఈ విషయాన్ని వెల్లడించింది. మే 26 నుంచి ఈ ప్రదర్శన ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా కోహినూర్‌తో సహా అనేక విలువైన వస్తువుల చరిత్రను ప్రజల ముందు ఉంచనున్నట్లు హెచ్‌ఆర్‌పీ తెలిపింది.

మొదటిసారి చరిత్ర అందుబాటులోకి..

ఎలిజబెత్‌ రాణి  అనంతరం చార్లెస్‌-3 రాజుగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మే 6వ తేదీన చార్లెస్‌-3తోపాటు ఆయన భార్య కెమిల్లా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. పట్టాభిషేక సంవత్సరానికి గుర్తుగా లండన్ టవర్‌లో రాజాభరణాల సరికొత్త ప్రదర్శన నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వివాదాస్పద ‘కోహినూర్‌’తోపాటు సెయింట్ ఎడ్వర్డ్స్ క్రౌన్, 1905లో దక్షిణాఫ్రికాలో కనుగొన్న కలినన్ వజ్రం, ఇంపీరియల్‌ స్టేట్‌ క్రౌన్‌లోని బ్లాక్‌ ప్రిన్స్‌ రూబీ తదితర ఆభరణాల చరిత్రను తొలిసారి అందుబాటులోకి తేనున్నారు. ‘ఈ ఆభరణాలు బ్రిటిష్ రాచరికానికి శక్తిమంతమైన చిహ్నాలు. ఎంతో చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. మూలాల నుంచి పట్టాభిషేక వేడుకలో ఉపయోగం వరకు.. వాటి గొప్ప చరిత్రను సవివరంగా ఆవిష్కరిస్తాం’ అని నిర్వాహకులు తెలిపారు.

చేతులు మారుతూ.. రాజ్యాలు తిరుగుతూ..

పర్షియన్‌ భాషలో కోహినూర్‌ అంటే ‘కాంతి శిఖరం’ అని అర్థం. ఈ వజ్రం పుట్టుక గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. చాలా మంది ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లూరులో తొలిసారి ఇది దొరికిందని చెబుతారు.  తదనంతం చేతులు మారుతూ చివరకు బ్రిటిష్‌ పాలకుల వద్దకు చేరింది. ప్రస్తుతం ఇది లండన్‌ టవర్‌ వద్దనున్న జ్యువెల్‌ హౌస్‌లో ఉంది. ఈ వజ్రం తిరిగి ఇవ్వాలని భారత్‌ పలుమార్లు విజ్ఞప్తి చేసినా బ్రిటన్‌ తిరస్కరించింది. ‘మొఘల్ చక్రవర్తులు, ఇరాన్ షాలు, అఫ్గాన్‌ ఎమిర్లు, సిక్కు మహారాజులతో సహా అనేక మంది పూర్వ యజమానులతో కూడిన ఈ వజ్రం చరిత్రను వివరిస్తాం’ అని హెచ్‌ఆర్‌పీ తాజాగా పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని