Maldives: ఇండో-పసిఫిక్‌లో మాల్దీవులు కీలక భాగస్వామి: అమెరికా

మాల్దీవులు ఇండో-పసిఫిక్‌లో కీలకమైన భాగస్వామి అని అమెరికా పేర్కొంది.  

Published : 09 Feb 2024 13:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో మాల్దీవులు తమకు కీలక దేశమని అమెరికా పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐకు వెల్లడించింది. ‘‘మాల్దీవులతో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అమెరికా కట్టుబడి ఉంది. స్వేచ్ఛాయుత, సురక్షితమైన ఇండో-పసిఫిక్‌లో ఆ దేశం కీలక భాగస్వామి’’ అని పేర్కొంది. గత నెల 29-31 తేదీల మధ్య అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి డొనాల్డ్‌ లూ మాల్దీవుల్లో పర్యటించారు. ఈ పర్యటన వివరాలను కోరగా అమెరికా విదేశాంగ శాఖ నుంచి ఈ మేరకు సమాధానం వచ్చింది. 

తన పర్యటనలో భాగంగా లూ మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుతో భేటీ అయ్యారు. రక్షణ సహకారం, ఆర్థిక వృద్ధి, ప్రజాస్వామ్య పాలన వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఈ విషయాలను అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వివరిస్తూ.. ‘‘మాల్దీవుల్లో అమెరికా దౌత్య  కార్యాలయం ఏర్పాటుపై వారు చర్చించుకున్నారు. అది ఇరు దేశాల భాగస్వామ్యాన్ని, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు’’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత లూ అక్కడి  పౌరసమాజ ప్రతినిధులు, ఉన్నత విద్యాశాఖ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పాలన, పారదర్శకతపై చర్చలు జరిపారు.

బైడెన్‌కు ఆ విషయాలూ గుర్తులేవు.. కీలక నివేదికలో సంచలన ఆరోపణలు!

భారత్‌-మాల్దీవుల మధ్య దౌత్య ఘర్షణ చోటు చేసుకున్న సమయంలో అమెరికా నుంచి ఈ స్పందన రావడం గమనార్హం. తాజాగా భారత్‌ మాల్దీవుల్లోని సైనిక సిబ్బందిని వెనక్కి పిలిపించి.. ఆ స్థానంలో సాంకేతిక సిబ్బందిని భర్తీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు భారత్‌తో వివాదం కారణంగా ముయిజ్జుపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని అక్కడి సుప్రీం కోర్టు నిలిపివేసింది. అధ్యక్ష, ఉపాధ్యక్షుల అభిశంసనకు పార్లమెంటు సభ్యుల్లో రెండింట మూడొంతుల(2/3) మెజారిటీ అవసరమని రాజ్యాంగం నిర్దేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని