Maldives: మాల్దీవుల ప్రాసిక్యూటర్‌ జనరల్‌పై పట్టపగలే దాడి

మాల్దీవుల రాజధాని మాలెలో పట్టపగలే దేశ ప్రాసిక్యూటర్‌ జనరల్‌పై దాడి జరిగింది. అక్కడ రాజకీయ ఘర్షణలు తలెత్తిన వేళ ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం సృష్టించింది.

Updated : 31 Jan 2024 11:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మాల్దీవుల్లో(Maldives) కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి మొదలైన రాజకీయ ఘర్షణలు పతాక స్థాయికి చేరాయి. ప్రతిపక్షం నియమించిన ప్రాసిక్యూటర్‌ జనరల్‌ హుస్సేన్‌ షమీమ్‌ను రాజధాని మాలెలో గుర్తు తెలియని దుండగుడు పదునైన వస్తువుతో దారుణంగా పొడిచాడు. ఆయన ఉదయం పూట వ్యాయామం చేస్తుండగా ఈ దాడి చోటుచేసుకొంది. షమీమ్‌ ఎడమ చేతికి గాయమైనట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు.

ప్రస్తుత రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ దాడి కలకలం సృష్టిస్తోంది. 2019లో ఎంపీడీ అధికారంలో ఉన్న సమయంలో నాటి అధ్యక్షుడు ఇబ్రహీం సోలి .. షమీమ్‌ను ప్రాసిక్యూటర్‌ జనరల్‌గా నియమించారు. ఆయన పదవీకాలం నవంబర్‌ వరకు ఉంది. ఇప్పటికే ఆ దేశంలో గ్యాంగులు పలు మార్లు రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకున్నాయి. అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుపై అభిశంసనకు విపక్షాలు పట్టుబట్టిన సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం.

మరోవైపు ప్రతిపక్ష ఎంపీలు అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానానికి అవసరమైన సంతకాల సేకరణలో తలమునకలయ్యారు. త్వరలోనే ఈ తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

ఇటీవల ముయిజ్జు ప్రభుత్వంలో ముగ్గురు మంత్రుల నియామకాన్ని పార్లమెంట్‌ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడే ఉన్న అధికార పక్షమైన పీఎన్‌సీ-పీపీఎం సభ్యులు ఎండీపీ ఎంపీలతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పలువురు సభ్యులు గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం తరలించారు. ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.

అధ్యక్షుడు ముయిజ్జు చైనాకు దగ్గరయ్యే క్రమంలో భారత్‌ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నారు. ఆయన అండచూసుకొని ఇటీవల కొందరు మంత్రులు భారత ప్రధానిపై హద్దులు మీరి వ్యాఖ్యలు చేయడంతో అక్కడ రాజకీయ వివాదం మొదలైంది. ఆ తర్వాత సదరు మంత్రులను పదవుల నుంచి తప్పించారు. అధికార పక్ష వైఖరిని ప్రతిపక్ష ఎండీపీ తప్పు పడుతోంది. న్యూదిల్లీతో విరోధం మాలెకు ఏమాత్రం క్షేమం కాదని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడిపై అభిశంసనను తెరపైకి తెచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని