Maldives: భారత్‌తో విభేదాల వేళ.. జిన్‌పింగ్‌తో మాల్దీవుల అధ్యక్షుడి భేటీ

Maldives-China: చైనా పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు ఆ దేశాధినేత జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. భారత్‌-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాల వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.

Updated : 11 Jan 2024 13:34 IST

బీజింగ్‌: భారత ప్రధాని మోదీ (PM Modi)పై, లక్షద్వీప్‌పై మాల్దీవుల (Maldives) మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల వేళ చైనా (China)లో పర్యటిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu).. దేశాధినేత జిన్‌పింగ్‌ (Xi Jinping)తో భేటీ అయ్యారు.

ఐదు రోజుల పర్యటన నిమిత్తం ముయిజ్జు చైనాకు వెళ్లిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా ఫుజియాన్‌ నగరంలో పర్యటించిన ఆయన.. మంగళవారం రాత్రి బీజింగ్‌ చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని పీపుల్స్‌ గ్రేట్‌ హాల్‌కు చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడికి జిన్‌పింగ్‌ స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

‘మా దేశానికి విమాన బుకింగ్‌లు తెరవండి’: ఈజ్‌మైట్రిప్‌ సంస్థకు మాల్దీవుల సంఘం అభ్యర్థన

అనంతరం వీరిద్దరూ ద్వైపాక్షికంగా భేటీ అయినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. వీరి చర్చల వివరాలను మాత్రం వెల్లడించలేదు. పర్యటనలో భాగంగా ముయిజ్జు.. చైనా ప్రధాని లి కియాంగ్‌, ఇతర సీనియర్‌ అధికారులతో చర్చలు జరపనున్నారు.

భారత్‌తో దౌత్యవిభేదాల వేళ.. ఈ దేశాధినేతలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. ముయిజ్జుకు చైనాకు అనుకూలుడనే పేరుంది. ఈ క్రమంలోనే  ఆయన  మాట్లాడుతూ.. డ్రాగన్‌ను తమ సన్నిహిత మిత్రదేశాల్లో, అభివృద్ధి భాగస్వాముల్లో ఒకటిగా పేర్కొన్నారు. తమ దేశానికి మరింత మంది పర్యాటకులను పంపించాలని చైనాకు విజ్ఞప్తి చేశారు. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ చైనాలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని