Nauru: తైవాన్‌కు షాక్‌.. దౌత్య సంబంధాలు తెంచుకొన్న నౌరు..!

తైవాన్‌కు గట్టిషాక్‌ ఎదురైంది. తనకు గుర్తింపునిచ్చే దేశాల జాబితా మరింత కుదించుకుపోయింది. నౌరు తాజాగా చైనా పక్షాన చేరింది.  

Updated : 15 Jan 2024 15:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అధ్యక్ష ఎన్నికలు ముగించుకొన్న 48 గంటల్లోనే తైవాన్‌కు గట్టి షాక్‌ తగిలింది. మైక్రోనేసియాలోని ద్వీపదేశమైన నౌరు దౌత్య సంబంధాలను తెంచుకొని చైనా పక్షాన చేరింది. ఈ మేరకు ఆ చిరు దేశం ఓ ప్రకటన విడుదల చేసింది. నౌరు రిపబ్లిక్‌ ప్రజల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాతో సంబంధాలను పునరుద్ధరించుకోవాలని నిర్ణయించుకొన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది.  తాజాగా నౌరు నిర్ణయాన్ని చైనా విదేశీ వ్యవహారాలశాఖ ప్రతినిధి స్వాగతించారు. ‘వన్‌ చైనా సిద్ధాంతం’ ఆధారంగా  ఇరు దేశాల మధ్య బంధంలో కొత్త అధ్యాయం మొదలైందని వెల్లడించారు. 

నౌరులోని రాజకీయ అస్థిరతను వాడుకొని ఆర్థిక సాయం పేరిట ఆ దేశాన్ని డ్రాగన్‌ తనవైపు మళ్లించుకొందని తైవాన్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి తియాన్‌ చుంగ్‌ క్వాంగ్‌ ఆరోపించారు. ఇలాంటి వ్యూహాలతో తైవాన్‌ను తొక్కిపెట్టవచ్చని బీజింగ్‌ భావిస్తోందన్నారు. తమ దేశంలో ప్రజాస్వామ్య అభివృద్ధిని ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు. 

తమ ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు వ్యతిరేకంగా చైనా చేపట్టిన ప్రతీకార చర్యగా తైవాన్‌ దీనిని అభివర్ణించింది. నౌరు నిర్ణయం తమ దేశాన్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని తైవాన్‌ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జోసఫ్‌ వూ అన్నారు. ఈ నిర్ణయంతో తైవాన్‌ను గుర్తిస్తున్న దేశాల సంఖ్య 12కు తగ్గిపోయింది. వీటిల్లో పరాగ్వే, మార్షల్‌ ఐలాండ్స్‌, గ్వాటెమాల వంటివి ఉన్నాయి. నౌరు-తైవాన్‌ సంబంధాలు తెగిపోవడం ఇదే తొలిసారి కాదు. 2002లో ఒక సారి ఇలానే జరిగింది. కానీ, 2005లో ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగి మొదలయ్యాయి. 

ఇటీవల జరిగిన తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (డీపీపీ) అభ్యర్థి లాయ్‌ చింగ్‌ తె విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఆ దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గత ఎనిమిదేళ్లుగా దేశాధ్యక్షురాలిగా కొనసాగుతున్న త్సాయింగ్‌ వెన్‌ స్థానంలో బాధ్యతలు చేపడతారు. డీపీపీ అగ్రనేతలైన త్సాయింగ్‌ వెన్‌, లాయ్‌ చింగ్‌ ఇద్దరూ... తైవాన్‌ను విలీనం చేసుకోవాలన్న చైనా యత్నాలను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.  లాయ్‌ను చైనా ఇప్పటికే సమస్యలు సృష్టించే వ్యక్తిగా విమర్శించడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని