పొరపాటుగా బందీలపై కాల్పులు.. ఇది అంతులేని విషాదమన్న నెతన్యాహు

Israel-Hamas Conflict: హమాస్ ఉగ్రదాడితో గాజాలో ఇజ్రాయెల్‌ చేస్తోన్న భీకర దాడుల్లో ముగ్గురు బందీలు మృతి చెందారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. 

Updated : 22 Dec 2023 16:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హమాస్‌(Hamas) అంతమే లక్ష్యంగా గాజాలో జరుపుతోన్న దాడుల్లో శత్రువులుగా పొరపాటుపడి ఇజ్రాయెల్‌(Israel) సైన్యం ముగ్గురు బందీలను కాల్చి చంపింది. ఈ విషయాన్ని ఐడీఎఫ్‌(IDF) స్వయంగా వెల్లడించింది. దీనిపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అంతులేని విషాదమని వ్యాఖ్యానించారు.

‘మన ముగ్గురు బందీల మృతితో నేను కూడా దుఃఖంతో తలవంచుకుంటున్నాను. ఇది అంతులేని విషాదం. ఈ వార్త తెలిసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలంతా దుఃఖంలో మునిగిపోయారు. ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాల గురించే నా ఆలోచనంతా. తమ ప్రాణాలను పణంగా పెట్టి, బందీలను విడిపించేందుకు పోరాడుతోన్న మన సైనికులు మనోబలంతో ముందుగా సాగాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో బందీలను సురక్షితంగా తీసుకువచ్చేందుకు గాయాలు కనిపించకుండా, పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం ’ అని నెతన్యాహు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

మేం ఇజ్రాయెల్‌ పక్షమే.. పునరుద్ఘాటించిన అమెరికా

మృతి చెందిన వారిలో ఒకరు ఇజ్రాయెల్‌లోని కెఫార్‌ అజా ప్రాంతానికి చెందిన యోటమ్‌ హైమ్‌ కాగా, మరొకరు కిబుట్జ్‌ నిర్‌ అమ్‌ ప్రాంతానికి చెందినవారిగా సైన్యం గుర్తించింది. మూడో వ్యక్తి పేరును కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు గోప్యంగా ఉంచింది. హమాస్ జరిపిన నరమేధానికి ప్రతిగా ఇజ్రాయెల్ చేస్తోన్న దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 18 వేల మందికి పైగా మృతి చెందారు. దాంతో గాజాలో యుద్ధాన్ని ఆపాలని అంతర్జాతీయ సంస్థలు, కనీసం మానవతా సాయం కొనసాగించేందుకు వీలుగా యుద్ధ తీవ్రతను తగ్గించాలని అమెరికా సహా పలు దేశాలు ఇజ్రాయెల్‌ను కోరుతున్నాయి. ఈ క్రమంలో బందీల మృతి ఘటన చోటుచేసుకుంది.

ప్రస్తుత ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన భద్రతా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ‘ఇది తీవ్ర ఆందోళనకర విషాదం’ అని శ్వేతసౌధ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ విచారం వ్యక్తం చేశారు. ఇందుకు దోహదం చేసిన పరిస్థితులపై ఇజ్రాయెల్ విచారణ జరుపుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని