Israel: ఇజ్రాయెల్‌-అమెరికా మధ్య అభిప్రాయభేదాలు..!

Israel: ఇజ్రాయెల్‌ భద్రతకు స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటే పరిష్కారమని అమెరికా సూచించింది. దీనికి నెతన్యాహు మాత్రం అంగీకరించడం లేదు. దీంతో ఇరు దేశాల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి.

Updated : 19 Jan 2024 11:19 IST

వాషింగ్టన్‌: చిరకాల మిత్రదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్‌ (Israel) మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. హమాస్‌ నియంత్రణలోని గాజా నుంచి బలగాలను వెనక్కి తీసుకోవడానికి ఇదే సరైన సమయమంటూ చేసిన అగ్రరాజ్య సూచనను ఇజ్రాయెల్‌ తిరస్కరించింది. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు ప్రతిపాదననూ వ్యతిరేకించింది. ఈ విషయాన్ని నేరుగా అమెరికాకు తెలియజేసినట్లు ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) గురువారం ప్రకటించారు.

మరోవైపు ఇజ్రాయెల్‌ తీరుపై అమెరికా (USA) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నెతన్యాహు ప్రకటనను తాము భిన్నాభిప్రాయంగా పరిగణిస్తున్నామని వైట్‌ హౌస్‌లోని జాతీయ భద్రతా విభాగం అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ అన్నారు. స్వతంత్ర పాలస్తీనావైపు అడుగులు పడే వరకు ఇజ్రాయెల్‌ (Israel) భద్రతకు హామీ లభించదని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ బుధవారం అన్నారు. రెండు దేశాల ఏర్పాటే ఈ సమస్యకు సరైన పరిష్కారమని అభిప్రాయపడ్డారు. ‘గాజాలో ఇజ్రాయెల్‌ సేనలు దాడుల తీవ్రతను తగ్గించడానికి ఇదే సరైన సమయం’ అని గత వారం వైట్‌ హౌస్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

హౌతీలపై ప్రతీకార దాడులు కొనసాగుతాయ్‌: బైడెన్‌

ఈ ప్రకటనల అనంతరం నెతన్యాహు (Benjamin Netanyahu) గురువారం మీడియాతో మాట్లాడారు. హమాస్‌ మిలిటెంట్లను అంతమొందించి బందీలను విడిపించే వరకు గాజాలో యుద్ధం ఆగదని స్పష్టం చేశారు. సంపూర్ణ విజయం సాధించే వరకు వెనక్కి తగ్గమని తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్‌పై దాడులకు స్వతంత్ర పాలస్తీనా కేంద్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జోర్డాన్‌ నదికి పశ్చిమాన ఉన్న ప్రాంతం మొత్తంపై తమ నియంత్రణ ఉండాల్సిందేనన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు