Covid: పూర్తిస్థాయిలో టీకాలు వేయించుకోక ఒక్క సీజన్‌లో వేల మరణాలు.. యూకే పరిశోధనలో వెల్లడి

నిపుణులు సూచించినన్ని కొవిడ్‌ టీకా డోసులు తీసుకోవడం సురక్షితం. ఈ విషయాన్ని యూకేలో నిర్వహించిన ఓ పరిశోధనలో గుర్తించారు.

Updated : 16 Jan 2024 13:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నిపుణులు సూచించిన మేర కొవిడ్‌ (Covid) టీకా డోసులు తీసుకోకపోతే కూడా మరణాల ముప్పు పొంచి ఉంటుందని యూకే నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. 2022 వేసవి సీజన్‌లోనే దాదాపు 7,000కుపైగా మరణాలు లేదా ఆస్పత్రుల్లో చేరడాన్ని నివారించే వారని తేలింది. ఈ అధ్యయనాన్ని ‘ది లాన్సెట్‌’ ప్రచురించింది.

జనవరి 2022 నాటికి యూకేలో 12 ఏళ్లు దాటిన వారిలో 90 శాతం ఒక టీకా తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత డోసులు తీసుకున్నవారి శాతం గణనీయంగా తగ్గిపోయింది. జూన్‌ 2022 నాటికి మొత్తం జనాభాలో కేవలం 44 శాతం మాత్రమే పూర్తి స్థాయి డోసులు, బూస్టర్లు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో వీటిని తీసుకొని ఉంటే.. ఆ సీజన్లో కనీసం 7,000 మరణాలు లేదా ఆస్పత్రుల్లో చేరికలను నివారించే వారమని పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనాన్ని హెల్త్‌ డేటా రీసెర్చి యూకే (హెచ్‌డీఆర్‌ యూకే), ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం నిర్వహించాయి.

పశ్చిమాసియా గడ్డపై మరో ఘర్షణ.. ఇరాక్‌పై ఇరాన్‌ క్షిపణి దాడి

‘‘టీకాల ప్రయోజనాలను ఈ పరిశోధన చాలా బలంగా చెబుతోంది’’ అని హెచ్‌డీఆర్‌ యూకే ప్రతినిధి అలెన్‌ కీ వెల్లడించారు. జూన్‌ 2022 నాటికి ఇంగ్లాండ్‌లో 45.7 శాతం, ఉత్తర ఐర్లాండ్‌లో 49.8 శాతం, స్కాట్లాండ్‌లో 34.2 శాతం, వేల్స్‌లో 32.8 శాతం తక్కువ టీకాలు వేయించుకున్నట్లు తేలింది. 2022 జూన్‌-సెప్టెంబర్‌ మధ్యలో 40,393 మంది కొవిడ్‌ కారణంగా చనిపోవడమో.. ఆస్పత్రుల్లో చేరడమో జరిగింది. యూకేలో పూర్తిగా టీకాలు వేసినట్లైతే.. వీరిలో 7,180 మందికి ఈ పరిస్థితి వచ్చేది కాదని తేలింది.

40,393 మందిలో 14,156 మంది తక్కువ డోసులు తీసుకున్నట్లు గుర్తించారు. కొవిడ్‌ బారిన పడిన వారిలో అన్ని వయసుల వారు ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావం వృద్ధులపై అధికంగా ఉంది. ‘కొవిడ్‌ టీకా ప్రాణాలు కాపాడుతుంది. కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుంది. సమాజంలో ఏ వర్గాలపై దృష్టిపెట్టాలనే విషయాన్ని సులువు చేస్తుంది’ అని హెచ్‌డీఆర్‌ యూకే రీసెర్చి డైరెక్టర్‌ అజీజ్‌ షేక్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రకంగా జరిగిన తొలి పరిశోధన ఇదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని