Pakistan: పాకిస్థాన్‌కు భారీ ఉపశమనం.. ఐఎంఎఫ్‌తో డీల్‌ ఓకే..!

ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్థాన్‌కు ఓ సానుకూల పరిణామం చోటు చేసుకొంది. ఐఎంఎఫ్‌తో ఒప్పందం కీలక దశకు చేరింది. 

Published : 30 Jun 2023 12:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్థాన్‌ (Pakistan)కు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి 3 బిలియన్‌ డాలర్ల రుణం ఇచ్చేందుకు సిబ్బంది స్థాయిలో ఒప్పందం జరిగింది. దీనికి ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. దీనిని బోర్డు జులైలో పరిశీలించవచ్చని ఐఎంఎఫ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి ఈ ఒప్పందం దాదాపు కొన్ని నెలలుగా ఎటువంటి పురోగతి లేకుండా ఉండిపోయింది. ఈ ఒప్పందం ప్రకారం ఐఎంఎఫ్‌ సూచించిన నిబంధనలు పాక్‌ పాటించాల్సి ఉంటుంది.

2019లో ఐఎంఎఫ్‌ అంగీకరించిన 6.5 బిలియన్‌ డాలర్ల సహాయ ప్యాకేజీ నుంచి విడుదల కావాల్సిన 2.5 బిలియన్‌ డాలర్ల కోసం పాక్‌ ఎదురు చూస్తోంది. తాజాగా ఆశించిన దాని కంటే 0.5 బిలియన్‌ డాలర్లు అదనంగా ఇచ్చేందుకు ఈ ఒప్పందం కుదిరింది. దీనిపై ఐఎంఎఫ్‌ అధికారి నాథన్‌ పోర్టర్‌ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల కాలంలో పాక్‌ ఆర్థిక వ్యవస్థ చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి నిలిచిపోయింది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. అధికారులు ఎంత ప్రయత్నించినా.. ద్రవ్యలోటును పూడ్చలేకపోయారు. విదేశీ మారకద్రవ్యం నిల్వలు పడిపోయాయి. విద్యుత్తు రంగం తీవ్ర ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. కొత్త ఒప్పందం ప్రకారం పాలసీ విధానాలు, ఫ్రేమ్‌ వర్క్‌ను అమలు చేయడంతో పాటు.. పవర్‌ సెక్టార్‌లో కఠిన నిబంధనలు కొనసాగుతాయి’’ అని పేర్కొన్నారు. 

గతేడాది పాకిస్థాన్‌లో తీవ్రమైన వరదలు రావడంతో ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతింది. దీనికి తోడు చాలా కుటుంబాలు రోడ్డునపడ్డాయి. మరోవైపు ఇమ్రాన్‌ ప్రభుత్వ పతనం వంటి రాజకీయ అస్థిర ఘటనలు కూడా చోటు చేసుకొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని