Pakistan Rupee: జీవితకాల కనిష్ఠానికి పాకిస్థాన్‌ రూపాయి

పాకిస్థాన్‌ (Pakistan) రూపాయి మారకం విలువ జీవిత కాల కనిష్ఠానికి పడిపోయింది. మంగళవారం మార్కెట్‌ ముగిసేనాటికి డాలరుతో పాక్‌ రూపాయి మారకం విలువ 287.29గా ఉంది.

Published : 05 Apr 2023 02:07 IST

ఇస్లామాబాద్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న పాకిస్థాన్‌ (Pakistan)కు దెబ్బమీద దెబ్బ పడుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నిధులను అన్‌లాక్‌ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పాక్‌కు విదేశీ మారక నిల్వలు (Pak forgine Currency) క్షీణించడం శాపంగా మారింది. మరోవైపు తాజాగా పాకిస్థాన్‌ రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠానికి చేరుకుంది. మంగళవారం మార్కెట్‌ ముగిసే సమయానికి డాలరుతో పాకిస్థాన్‌ రూపాయి మారకం విలువ రూ.287.29కి పడిపోయింది. సోమవారం నాటి మార్కెట్‌తో పోలిస్తే.. 285.04గా ఉన్న పాకిస్థాన్‌ రూపాయి విలువ 0.78శాతం క్షీణించి 287.29కి చేరింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ (ఎస్‌బీకే) వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నెల 2 నాటికి డాలరుతో పాక్‌ రూపాయి విలువ 285.04గా ఉంది.

ఇంటర్‌బ్యాంక్‌ మార్కెట్‌లో విదేశీ కరెన్సీ తక్కువగా ఉండటంతోపాటు.. రూపాయి విలువ తగ్గడంతో ఆర్థిక దిగుమతి దారులు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రూపాయి విలువ మరింత పడిపోయినట్లు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐఎంఎఫ్‌ షరతులకు అనుగుణంగా పన్నులు, ఇంధన ధరలను పెంచేందుకు పాక్‌ సమ్మతించింది. ఐఎంఎఫ్‌ నిధులను విడుదల చేయాలంటే.. రూపాయిపై పాక్‌ ప్రభుత్వం నియంత్రణలను సరళీకరించాలని, రూపాయి మారకపు విలువను మార్కెట్‌ నిర్ణయించేలా చూడాలని ఐఎంఎఫ్‌ పాకిస్థాన్‌ను కోరింది. ఐఎంఎఫ్‌ వద్ద ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 6.5 బిలియన్‌ డాలర్ల నిధుల విడుదలకు ఆమోదం తెలుపుతుందనే ఉద్దేశంతో పాకిస్థాన్‌ వెంటనే ఈ నిబంధనకు అంగీకారం తెలిపింది.

ఐఎంఎఫ్‌ నుంచి 6.5 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం తీసుకోవడానికి 2019లోనే పాకిస్థాన్‌ అంగీకరించినా, ఆ సంస్థ పెట్టిన కఠిన షరతుల వల్ల వెనకడుగు వేసింది. తాము నిధులివ్వాలంటే పాకిస్థాన్‌లో కరెంటు సబ్సిడీలను ఉపసంహరించాలనీ, అంతర్జాతీయ విపణి ధరలకు తగ్గట్టు గ్యాస్‌ ఛార్జీలను నిర్ణయించాలనీ, పాక్‌ రూపాయి మారక విలువను మార్కెట్‌ ఆధారంగా నిర్ణయించాలనీ, లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్లపై నిషేధం తొలగించాలని ఐఎంఎఫ్‌ షరతులు పెట్టింది. తొలుత ఈ షరతులతో విభేదించిన పాకిస్థాన్‌.. వ్యతిరేక పరిస్థితుల నేపథ్యంలో తలొగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని