PM Modi: మానవతా చరిత్రలో యూఏఈ సువర్ణ అధ్యయనాన్ని లిఖించింది: ప్రధాని మోదీ

యూఏఈ రాజధాని అబుధాబీలో ప్రధాని మోదీ హిందూ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూఏఈ సువర్ణ అధ్యయనాన్ని లిఖించిందన్నారు.  

Updated : 15 Feb 2024 07:00 IST

యూఏఈ: అబుధాబీ (Abudhabi)లో హిందూ దేవాలయ నిర్మాణంతో మానవతా చరిత్రలో యూఏఈ సువర్ణ అధ్యయనాన్ని లిఖించిందని ప్రధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు. ఇది మానవత్వానికి వారసత్వంగా నిలిచిపోతుందని అన్నారు. ఆలయ నిర్మాణం సాకారం చేసిన ఆ దేశ అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌కు ఈ సందర్భంగా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తున్న భారతీయులే (Indians) కాకుండా ఇండియా (India) లో ఉన్న 140 కోట్ల మంది గుండెల్లో ఆయన చిరకాలం నిలిచిపోతారన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం యూఏఈ (UAE)కి వెళ్లిన ప్రధాని మోదీ.. అబుధాబీలో 27 ఎకరాల్లో రూ.700 కోట్లతో నిర్మించిన బాప్‌ హిందూ దేవాలయాన్ని (BAPS Hindu Temple) బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన ప్రతి క్షణం జాతికే అంకితం చేశానని అన్నారు. తనకు మాతృభూమితో ఎంతో లోతైన ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, ప్రతిక్షణాన్ని దేశ పురోగతికి వచ్చిన అవకాశంగా భావిస్తానని ప్రధాని వ్యాఖ్యానించారు. 

‘‘బుర్జ్‌ ఖలీఫా, ఫ్యూచర్‌ మ్యూజియం, షేక్‌ జాయెద్‌ మసీదు, ఇతర హైటెక్‌ భవనాలకు ప్రసిద్ధి పొందిన యూఏఈకి ఇప్పుడు మరొక సాంస్కృతిక గుర్తింపు వచ్చి చేరింది. భవిష్యత్తులో మరింతమంది భక్తులు ఇక్కడి వచ్చి ఈ ఆలయాన్ని సందర్శిస్తారని నేను నమ్ముతున్నాను. ఈ ఆలయ వైభవం మరింత మందిని యూఏఈకి వచ్చేలా చేస్తుంది. ఇది ప్రజల మధ్య మంచి సంబంధాలు నెలకొల్పేలా చేస్తుందన్న విశ్వాసం నాకుంది. ఈ ఆలయ నిర్మాణానికి సహకారం అందించిన యూఏఈ అధ్యక్షుడు బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, ఆ దేశ ప్రభుత్వానికి భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరి తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు’’ అని ప్రధాని పేర్కొన్నారు. 

‘‘అబుధాబీలో నిర్మించిన ఈ ఆలయం ఐక్యత, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఆలయ నిర్మాణంలో యూఏఈ ప్రభుత్వం అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిది. ఇటువంటి ప్రయత్నాల ద్వారా ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత పెరుగుతాయని నమ్ముతున్నాను. సాంస్కృతికంగా, దౌత్యపరంగా ఈ దేవాలయం ఇరుదేశాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఆలయ నిర్మాణానికి వేగంగా అనుమతులు ఇచ్చిన యూఏఈ అధ్యక్షుడికి ధన్యవాదాలు. ఆయనకు భారత్‌ పట్ల ఉన్న ప్రేమ, గౌరవం ఈ కార్యక్రమంతో తెలుస్తోంది. ఆయన మద్దతు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు’’ అని ప్రధాని పేర్కొన్నారు. దుబాయ్‌లో భారత కార్మికుల కోసం ఆసుపత్రి నిర్మాణానికి యూఏఈ వైస్‌ ప్రెసిడెంట్‌ స్థలం కేటాయించారని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని