Genocide: ఇజ్రాయెల్‌ది మారణహోమమే..! ‘ఐసీజే’లో దక్షిణాఫ్రికా వాదన

గాజాలో ఇజ్రాయెల్‌ మారణహోమానికి పాల్పడుతోందని అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా వాదనలు వినిపించింది.

Updated : 11 Jan 2024 21:58 IST

ది హేగ్‌: గాజాలో పాలస్తీనీయుల పట్ల ఇజ్రాయెల్‌ (Israel) మారణహోమానికి (Genocide) పాల్పడుతోందని దక్షిణాఫ్రికా తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ ప్రాంతంపై సైనిక చర్యను వెంటనే నిలిపివేయాలంటూ ఆదేశించాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ICJ) అభ్యర్థించింది. పాలస్తీనీయన్లపై పొరుగు దేశం దశాబ్దాలుగా సాగిస్తున్న అణచివేతలో ‘గాజా యుద్ధం (Gaza War)’ ఓ భాగమని దక్షిణాఫ్రికా (South Africa) తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ ఆరోపణలను నెతన్యాహు ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా ఖండించింది.

ఇజ్రాయెల్‌ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై గురువారం ఐసీజేలో విచారణ మొదలైంది. ‘‘మారణహోమం జరిగిందని ముందుగానే ప్రకటించలేం. కానీ, గత 13 వారాలుగా గాజాలో జరుగుతోన్న విధ్వంసం కళ్లముందు కనిపిస్తోంది. హత్యాకాండలో తల్లులు, తండ్రులు, చిన్నారులు.. చివరకు నవజాత శిశువులనూ వదలడం లేదు. ఆహారం, నీరు, ఔషధాల లభ్యత రోజువారీ పోరాటంగా మారింది. ఇజ్రాయెల్‌ ఉద్దేశపూర్వక చర్యలకు ఇవన్నీ తిరుగులేని సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి’’ అని దక్షిణాఫ్రికా న్యాయవాది ఆదిలా హాసిమ్ పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులు తప్ప ఈ దారుణాలను ఏదీ ఆపలేదన్నారు.

‘గాజా పౌరుల ఆకలి కేకలు.. ఇజ్రాయెల్‌ యుద్ధ వ్యూహంలో భాగమే!’

ఈ కేసులో ఇజ్రాయెల్‌ తరఫు న్యాయవాదులు శుక్రవారం వాదనలు వినిపించనున్నారు. సాధారణంగా ఐరాసను, అంతర్జాతీయ సంస్థలను ఈ దేశం పెద్దగా పట్టించుకోదు. కానీ, తమ సైనిక చర్యను సమర్థించుకోవడానికి ఈసారి అత్యంత నిపుణులైన న్యాయవాదులను పంపింది. అంతకుముందు ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. గాజాలో చర్యలను సమర్థించుకున్నారు. తమకు మారణహోమంతో సంబంధం లేదన్నారు. ‘‘మేం హమాస్‌ ఉగ్రవాదులతో పోరాడుతున్నాం. పాలస్తీనా ప్రజలతో కాదు. అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నాం’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని