UK visa: యూకే వీసా కఠిన నిబంధనలు.. నేటి నుంచి అమల్లోకి!

యూకే యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందే భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థులు ఇకనుంచి విద్యార్థి వీసాపై వారి కుటుంబ సభ్యులను తీసుకురావడం కుదరదు.

Published : 02 Jan 2024 01:40 IST

లండన్‌: బ్రిటిష్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందే భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థులకు వీసా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి విద్యార్థి వీసాపై వారి కుటుంబ సభ్యులను తీసుకురావడం కుదరదు. పోస్టుగ్రాడ్యుయేట్‌ రీసెర్చ్‌ కోర్సులతో పాటు ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ కోర్సులు చేసే వారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. వలసల నియంత్రణలో భాగంగా తీసుకువచ్చిన ఈ కఠిన నిబంధనలు నేటి నుంచి అమలు చేస్తున్నట్లు బ్రిటన్‌ పేర్కొంది.

బ్రిటన్‌కు వస్తోన్న విదేశీ విద్యార్థులు తమ కుటుంబీకులను తీసుకురావడం ఇటీవల భారీగా పెరిగింది. 2019 నుంచి 930శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2019 సెప్టెంబర్‌లో 14,839 వీసాలు జారీ చేయగా.. సెప్టెంబర్‌ 2023 నాటికి ఈ సంఖ్య 1.52లక్షలకు పెరిగినట్లు బ్రిటన్‌ జాతీయ గణాంకాల కార్యాలయం (ONS) వెల్లడించింది. వీటితోపాటు అక్రమ వలసలపైనా బ్రిటన్‌ కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది.

యూకేలో కొత్త వీసా రూల్స్‌.. భారతీయ విద్యార్థులపై ప్రభావమెంత..?

ఇలా భారీ సంఖ్యలో వస్తోన్న వలసలను తగ్గిస్తామని బ్రిటన్ పౌరులకు ఇచ్చిన మాటపై తమ ప్రభుత్వం నిబద్ధతను చాటుకుంటోందని బ్రిటన్‌ హోంశాఖ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ పేర్కొన్నారు. ‘సరిహద్దులను నియంత్రించడం, ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థను రక్షించుకునే చర్యలు ఈ ఏడాది మొత్తం ఉంటాయి. ఇందులో భాగంగా విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు వారి కుటుంబీకులను తీసుకువచ్చే అసమంజన చర్యలకు నేటితో ముగింపు పడింది. దీని ద్వారా వేల సంఖ్యలో వలసలు తగ్గుతాయి. ఇలా దాదాపు 3లక్షల మందిని నిరోధించేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాం’ అని జేమ్స్‌ క్లెవర్లీ వెల్లడించారు.

ఇదిలాఉంటే, బ్రిటన్‌లో పని చేసేందుకు స్టూడెంట్‌ వీసాను బ్యాక్‌డోర్‌ మార్గంగా ఎంచుకుంటున్నట్లు గతేడాది మేలో అప్పుటి బ్రిటన్‌ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మన్‌ (Suella Braverman) పేర్కొన్నారు. ఇలా దేశంలో పెరుగుతోన్న అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు వీసా నిబంధనల్లో మార్పులు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే స్టూడెంట్‌ వీసాపై కుటుంబీకులను అనుమతించకూడదని నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని