Bangladesh: కొద్దిగంటల్లో ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాలు, స్కూళ్లకు నిప్పు

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ బంగ్లాదేశ్‌(Bangladesh)లో హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. ఇవి రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. 

Published : 06 Jan 2024 15:00 IST

ఢాకా: పోలింగ్ సమయం దగ్గర పడుతున్న తరుణంలో బంగ్లాదేశ్‌ (Bangladesh)లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఐదు ప్రాథమిక పాఠశాలలు, పలు పోలింగ్ కేంద్రాలకు నిప్పంటించారు. ఆదివారం(జనవరి 7) దేశవ్యాప్తంగా జరగనున్న ఎన్నికలకు అంతరాయం కలిగించే లక్ష్యంతోనే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా శివారులో ఉన్న గాజీపుర్‌లో చోటుచేసుకున్న ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ‘మేం పెట్రోలింగ్‌ను మరింత కట్టుదిట్టం చేశాం. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉన్నాం’ అని తెలిపారు. శుక్రవారం కొందరు దుండగులు రైలుకు నిప్పుపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. దానివల్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గత డిసెంబరులోనూ బంగ్లాదేశ్‌లో రైలుకు దుండగులు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే.

‘చలిగా ఉంది.. ఎన్నికలు వద్దు: పాక్‌ సెనెట్‌ వింత తీర్మానం’

ఆపద్ధర్మ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని ‘బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ’ (బీఎన్‌పీ) డిమాండ్‌ చేయగా షేక్‌ హసీనా ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికలను బీఎన్‌పీ బహిష్కరించింది. ఈ క్రమంలో ప్రస్తుత ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ వరుసగా నాలుగోసారి విజయం సాధించడం లాంఛనమేనని సర్వేలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని