Israeli: ఇజ్రాయెల్‌ దౌత్యకార్యాలయం ఎదుట అమెరికా వాయుసేన ఉద్యోగి ఆత్మహత్యాయత్నం..!

గాజాపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ అమెరికా వాయుసేనకు చెందిన ఓ ఉద్యోగి ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసుకొన్నాడు.

Updated : 26 Feb 2024 11:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా వాయుసేనకు చెందిన ఓ ఉద్యోగి వాషింగ్టన్‌ డీసీలోని ఇజ్రాయెల్‌ దౌత్యకార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనకు ముందు అతడు తనను తాను ఆరోన్‌ బుష్‌నెల్‌గా పరిచయం చేసుకొన్నాడు. ‘‘ఈ నరమేధంలో నేను ఇంక భాగస్వామిని కాబోను’’ అని ప్రకటించాడు. పాలస్తీనా వాసుల బాధతో పోలిస్తే తాను అనుభవించబోయేది తక్కువే అని పేర్కొన్నాడు. ఆ తర్వాత రికార్డ్‌ పరికరాన్ని నేలపై ఉంచి తన వెంట తెచ్చుకొన్న పెట్రోల్‌ను శరీరంపై పోసుకొని నిప్పంటించుకొన్నాడు. ‘ఫ్రీ పాలస్తీనా’ అనే నినాదాలు చేశాడు. అగ్నికీలల్లో కాలుతూ నేలపై పడిపోయాడు. సమాచారం అందుకొన్న సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది తగిన పరికరాలతో అక్కడకు చేరుకొని మంటలను ఆర్పేశారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నట్లు సమాచారం. 

ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ అత్యంత తీవ్రమైన రాజకీయ నిరసన చర్యగా అభివర్ణించారు. డిసెంబర్‌లో కూడా అట్లాంటాలోని ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయం ఎదుట ఒక వ్యక్తి ఇదే విధంగా చేసినట్లు గుర్తు చేశారు. అమెరికా వాయుసేన దీనిపై స్పందిస్తూ.. ఆరోన్‌ తమ సిబ్బందే అని పేర్కొంది. తన నిరసనను అతడు ఓ సామాజిక మాధ్యమంలో లైవ్‌స్ట్రీమ్‌ చేశాడు. కానీ, తర్వాత ఆ దృశ్యాలను దాని నుంచి తొలగించారు.

అక్టోబర్‌ 7వ తేదీన హమాస్‌ జరిపిన దాడిలో 1200 మంది ఇజ్రాయెలీలు మరణించారు. ఆ తర్వాత గాజాపై మొదలైన ప్రతిదాడిలో ఇప్పటి వరకు దాదాపు 30,000 మంది పాలస్తీనా వాసులు మరణించగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు. దీనిని ఆపాలని ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు