COP28: ‘వాతావరణ సంక్షోభం.. భారత్‌పై ప్రపంచం ఆశలు..!’

శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించే విషయంలో భారత్‌ ఓ ఆశాకిరణమని ‘కామన్‌వెల్త్‌’ సెక్రెటరీ జనరల్‌ ప్యాట్రిసియా స్కాట్లాండ్‌ పేర్కొన్నారు.

Published : 11 Dec 2023 19:14 IST

దుబాయి: వాతావరణ సంక్షోభానికి (Climate Crisis) పరిష్కారం చూపడంలో భారత నాయకత్వం, మేధో శక్తిపై ప్రపంచం ఆశలు పెట్టుకుందని కామన్‌వెల్త్‌ (Commonwealth) సెక్రెటరీ జనరల్‌ ప్యాట్రిసియా స్కాట్లాండ్‌ (Patricia Scotland) పేర్కొన్నారు. ఆవిష్కరణల విషయంలో భారత్‌ అద్భుతంగా రాణిస్తోందని తెలిపారు. దుబాయి వేదికగా సాగుతోన్న ‘కాప్‌-28 (COP28)’ వాతావరణ సదస్సు సందర్భంగా ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈమేరకు మాట్లాడారు.

శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలంటూ ప్రపంచ దేశాలపై ఒత్తిడి పెరుగుతోన్న వేళ.. భారత్‌ తన 140 కోట్లమంది ప్రజలకు ఆహారం, సంరక్షణను అందించాల్సిన అవసరం ఉందని ప్యాట్రిసియా గుర్తుచేశారు. గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించేందుకు భారత్‌ ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ ఉద్గారాలను తగ్గించేందుకు అవలంబించాల్సిన ఉత్తమ మార్గాలపై ‘కాప్‌-28’ సదస్సులో చర్చలు జరుగుతోన్న విషయం తెలిసిందే.

కర్బన సుంకంపై పీటముడి

‘శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించే విషయంలో భారత్‌ ఓ ఆశాకిరణం. భారత్‌తోపాటు కామన్‌వెల్త్‌ దేశాల నుంచి వస్తోన్న మేధోశక్తి.. ఈ సమస్యను పరిష్కరించడంలో సాయం చేయగలదు. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించే విషయంలో భారత్‌ తన నాయకత్వ స్థానాన్ని కొనసాగించాలి. శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక వనరులకు పరివర్తన అనేది చిటికెలో జరిగే పని కాదు. దీనికోసం నిష్పక్షపాత విధానాలు, ప్రణాళికలు అవసరం’ అని ప్యాట్రిసియా వ్యాఖ్యానించారు.

‘వేగంగా అభివృద్ధి చెందుతోన్న భారత్‌.. లక్షలాది మంది ప్రజలను పేదరికం నుంచి విముక్తి చేయడమే కాకుండా, పశ్చిమ దేశాలతో పోలిస్తే తక్కువ వ్యయంతో చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరుకుంది. ఆవిష్కరణల విషయంలో అద్భుతంగా పనిచేస్తోంది. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇది. ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ యూనికార్న్‌లు ఉన్నాయి. భారతీయ ‘జుగాడ్‌’ (చుట్టూ ఉన్న వస్తువులతోనే సులువైన పరిష్కారం).. చిన్న దేశాలకు స్ఫూర్తి’ అని ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని