ఆ ఊళ్ళో పుడితే చూపు పోతుంది..!

వింతైన మూఢ నమ్మకాలనూ... చిత్రమైన ఆచారాలనూ ఆచరించే గ్రామాల్ని చూశాం. భిన్నమైన జీవనశైలిని పాటించే ప్రజల గురించీ విన్నాం. అయితే పుట్టిన మనుషులూ, ఇతర జీవులూ అంధులుగా మారిపోయే విచిత్రగ్రామం ఒకటుందని తెలుసా?

Published : 05 Jun 2022 01:43 IST

ఆ ఊళ్ళో పుడితే చూపు పోతుంది..!

వింతైన మూఢ నమ్మకాలనూ... చిత్రమైన ఆచారాలనూ ఆచరించే గ్రామాల్ని చూశాం. భిన్నమైన జీవనశైలిని పాటించే ప్రజల గురించీ విన్నాం. అయితే పుట్టిన మనుషులూ, ఇతర జీవులూ అంధులుగా మారిపోయే విచిత్రగ్రామం ఒకటుందని తెలుసా? ఆ చీకటి గ్రామం గురించీ బోలెడు ఆసక్తికర విషయాలున్నాయి, అవేంటో తెలుసుకుందాం రండి...!

రెంట్‌పోతేనే కాసేపు ఉండలేము... సెల్‌ఫోన్‌లో టార్చ్‌ బటన్‌ నొక్కేలోపే విలవిల్లాడిపోతాం. ఎప్పుడెప్పుడు వెలుగులోకి వచ్చేయాలా అని ఆరాటపడుతుంటాం. అలాంటిది మెక్సికోలోని పసిఫిక్‌ మహాసముద్రం ప్రాంతంలో ఉండే టిల్టెపెక్‌ గ్రామస్థులకి చీకటికీ వెలుతురుకీ తేడా ఉండదు. జీవితాంతం అంధకారంలోనే మగ్గిపోతుంటారు. మనుషులేకాదు, ఆ ఊళ్లో పుట్టి పెరిగే ఏ జీవీ ఈ ప్రపంచాన్ని చూడలేదంటే అతిశయోక్తిగా అనిపిస్తుందేమో కానీ అది నమ్మలేని నిజం. అంతేకాదు, ఆ కారణంగా కనీస వసతులకు కూడా నోచుకోలేకపోయిన టిల్టెపెక్‌ గ్రామం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఆ గ్రామంలో జపోటెక్‌ తెగకు చెందిన సుమారు మూడు వందలమంది జీవిస్తున్నారు. పుట్టినప్పుడు వారంతా పూర్తి ఆరోగ్యం, కంటిచూపుతోనే ఉంటారు. ఆ తరవాత ఆరేడు వారాల నుంచి చూపు సన్నగిల్లుతూ ఏడెనిమిదేళ్లు వచ్చేసరికి పూర్తిగా అంధులుగా మారిపోతున్నారు. పక్షులదీ జంతువులదీ కూడా అదే పరిస్థితి.

సాగు చేసి జీవిస్తూ...

అక్షరాస్యతకూ, ఆధునిక టెక్నాలజీకీ ఆమడదూరంలో బతికే ఈ జపోటెక్‌ తెగ ప్రజలు చూపులేదని బాధపడరు. తమ జీవనాధారమైన వ్యవసాయాన్నే నమ్ముకుని గ్రామస్థులంతా కలిసి మెలిసి తృణధాన్యాలూ, బీన్స్‌, ఇతర కాయగూరలు సాగు చేస్తుంటారు. చిన్నచిన్న పూరిపాకల్లో ఉంటూ తాము పండించుకున్న దాంతోనే వారంతా కడుపునింపుకుని జీవనం సాగిస్తున్నారు. వారికి కరెంట్‌తో పనుండదు. పగటికీ రాత్రికీ తేడా తెలియని ఆ ప్రజలు రాళ్ల మీదే నిద్రిస్తుంటారు. పక్షుల కిలకిలలతోనే నిద్రలేచి కర్ర సాయంతో దినచర్య మొదలుపెడతారు. ఆ పక్షుల శబ్దాలు ఆగిపోయినప్పుడు పొలం పనులు ముగించు కుని గుడిసెల వైపు వెళుతుంటారు. వారి దుస్థితి చూసి బాధ కలిగినా... ప్రకృతితో మమేకమై జీవించే వారి జీవనశైలి చూస్తే భలే ముచ్చటేస్తుంది.

టిల్టెపెక్‌ ప్రజల్ని చూపు గురించి అడిగితే మాత్రం చిత్రమైన సమాధానం చెబుతారు. ఆ గ్రామంలో ఉండే ఓ చెట్టు శాపంతో పుట్టిందనీ, దాన్ని చూడ్డం వల్లనే తమకు చూపు పోతోందనీ వారి నమ్మకం. అయితే ఈ అంధుల గ్రామం గురించి కొన్నాళ్ల క్రితం ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో శాస్త్రవేత్తల్ని రంగంలోకి దింపి పరిశోధనలు జరిపించింది. రెండేళ్లపాటు సాగిన ఆ పరిశోధనల్లో టిల్టెపెక్‌ సమీపంలో ఉండే విషపూరితమైన నల్ల ఈగలు కుట్టడం వల్లనే వారి చూపుపోతోందని తేలింది. చుట్టూ అడవులు ఉండటంతో- ఆ ఈగల్ని నిర్మూలించడం సాధ్యం కాక ప్రభుత్వం గ్రామస్థుల్నే అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించింది. అయితే ఆ వాతావరణం వారి శరీరాలకి పడక అందరూ తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో తిరిగి టిల్టెపెక్‌కు చేరుకున్నారు. కనీసం పుట్టిన వెంటనే పిల్లల్నైనా అక్కడ నుంచి తీసుకొచ్చి వేరేప్రాంతంలో ఉంచుదామంటే తల్లులు ఒప్పుకోక పోవడంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. పైగా చూపులేకపోయినా వారంతా ఆ గ్రామంలోనే బతకడానికి సిద్ధమవడంతో నిత్యావసరాలూ, తాగు నీరూ అందిస్తోంది ప్రభుత్వం.


లీచీ ఫలం... గుండెకు బలం!

పండ్లు ఏవయినా ఆరోగ్యానికి మంచిదే. అయితే వాటిల్లో కొన్ని రకాల పండ్లే ఆకర్షణీయమైన రంగూ రూపం, తీయని రుచులతో నోరూరించడంతోపాటు గత చరిత్రనీ చాటుతుంటాయి. ఆ కోవకే చెందుతుంది లీచీ పండు. ఎరుపూ గులాబీ రంగుల్లో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే తెల్లని గుజ్జుతో ఉండే లీచీ ఇప్పుడు మన దగ్గరా పండుతోంది.

రెండువేల సంవత్సరాల క్రితం... దక్షిణ చైనా అడవుల్లో పుట్టిందో చెట్టు. ఎర్రని దాని పండ్లను తిన్న పక్షులవల్ల ఆ పండ్ల రుచి ఆ చుట్టుపక్కలంతా తెలిసింది.  చైనాను పాలించిన తంగ్‌ వంశీకుడైన క్సుయాన్‌ జాంగ్‌ తన ముద్దులభార్య యాంగ్‌కి ఇష్టమైన లీచీ పండ్లకోసం రెండువేల కి.మీ.దూరంలో ఉన్న గుయాంగ్‌డాంగ్‌కి గుర్రాలమీద సైన్యాన్ని పంపి మరీ తెప్పించేవాడట. కానీ ఇప్పుడా సమస్య లేదు. ప్రపంచవ్యాప్తంగా దీన్ని పండిస్తున్నారు. అయితే లీచీని అధికంగా పండించే దేశం నేటికీ చైనా అయితే ఆ తరవాతి స్థానం భారత్‌దే. కాకపోతే నిన్న మొన్నటివరకూ ఉత్తరాదిన అదీ బిహార్‌లోనే లీచీ పంట ఎక్కువ. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ పండుతోంది.

స్ట్రాబెర్రీల్లానే!

ఎరుపూ, గులాబీరంగుల్లో ఉండే ఈ పండ్లు స్టాబెర్రీలానే అనిపిస్తాయి. మృదువైన ఈ పండ్ల గుజ్జుని నేరుగా తినడంతోపాటు షర్బత్‌లూ జ్యూస్‌లూ ఐస్‌క్రీమ్స్‌ తయారీలో వాడతారు. లీచీల్లో ఎరుపు రంగులో ఉండే షాహీ; ఎరుపూ ఆకుపచ్చా కలగలిసిన రంగులోని బొంబై: గులాబీ రంగులో ఉండే గులాబీ, డెహ్రా రోజ్‌; పెద్ద సైజులో ఉండే లేట్‌ లార్జ్‌ రెడ్‌, హృదయాకారంలోని కైమానా... ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే లోంగన్‌, రాంబుతాన్‌ పండ్లు కూడా తెల్లని గుజ్జుతో దాదాపు లీచీ పండ్ల రుచితోనే ఉంటాయి. రాంబుతాన్‌ పండ్లకు పై భాగంలో జుట్టులా ఉంటే, లోంగన్‌ మాత్రం గోధుమ రంగులో సపోటాని తలపిస్తుంది. కానీ మూడింటికీ గుజ్జు తెల్లగా మృదువుగా ఉంటుంది. చూడ్డానికి వేర్వేరుగా ఉన్నా మూడూ తియ్యగా ఉంటాయి. పోషకాలూ ఒకటే.

ఎలా మంచిదంటే...

ఎక్కువ పీచుతో జ్యూసీగా ఉండే ఈ పండ్లలో క్యాలరీలు తక్కువ. వంద గ్రా. లీచీ పండ్లలో 75 మి.గ్రా. సి-విటమిన్‌ ఉంటుంది. బి2, పొటాషియం, కాపర్‌,... తదితర పోషకాలన్నీ సమృద్ధిగా ఉంటాయి. ద్రాక్షతో పోలిస్తే వీటిల్లో పాలీఫినాల్స్‌ శాతమూ అధికమే. అందుకే ఇది క్యాన్సర్లనీ ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్లని అడ్డుకోగలదని అంటారు. వైరస్‌ వంటి సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధుల్ని నిరోధించే గుణం ఈ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లకు ఉంది. ఇందులోని ప్రొఆంథోసైనిడిన్స్‌ హృద్రోగ నివారణకు తోడ్పడుతున్నట్లు గుర్తించారు. ఈ గింజల నుంచి తీసిన ఎక్స్‌ట్రాక్ట్‌ ఇన్సులిన్‌ నిరోధాన్ని అడ్డుకుంటుందనీ, ఓలిగోనాల్‌ అనే పాలీఫినాల్‌ మధుమేహంతో వచ్చే రక్తప్రసరణ లోపాల్ని నివారిస్తుందనీ పరిశోధనలు చెబుతున్నాయి. ఇన్‌ఫ్లమేషన్‌, ఆక్సీకరణ ఒత్తిడి, ఊబకాయం... వంటి ఎన్నో వ్యాధుల నివారణకు ఈ ఓలిగోనాల్‌ తోడ్పడుతుంది. ఇది పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వునీ అలసటనీ మంటనీ తగ్గిస్తుందట. కాలేయ కణాలు కోలుకునేందుకూ జ్ఞాపకశక్తి పెరగ డానికీ, ఒత్తిడి, ఆందోళన, బీపీ, షుగర్‌ తగ్గేందుకూ ఇవి తోడ్పడతాయి. మృదువైన లీచీపండు జీర్ణశక్తికీ మంచిదే. చర్మం ముడుతలు పడకుండానూ కాపాడుతుంది. పీచు పదార్థం ఎక్కువ కాబట్టి పొట్ట నిండినట్లుగా అయి ఆకలిని తగ్గిస్తుంది. దాంతో ఊబకాయాన్నీ తగ్గిస్తుందీ పండు. శ్వాసకోశ సమస్యలున్నవాళ్లకీ లీచీ ఉపశమనాన్ని కలిగిస్తుంది.

అయితే ఆమధ్య లీచీ తోటల్ని పెంచే ప్రాంతాల్లోని పిల్లలు ఖాళీ కడుపుతో పచ్చి లీచీ పండ్లను తినడంతో వాటిల్లోని హైపోగ్లైసిన్‌ అనే అమైనో ఆమ్లం వల్ల గ్లూకోజ్‌ శాతం పడిపోయి ఎన్‌సెఫలోపతీ వ్యాధికి గురయినట్లు గుర్తించారు. దాంతో రాత్రిపూట పిల్లలు భోజనం మానకుండా చూడటంతోపాటు పండిన వాటినే మితంగా తినేలా చేయగా కేసులు తగ్గాయి. దీన్నిబట్టి పచ్చి లీచీల్ని ఆకలితో అతిగా తినడంవల్లే అలా జరిగిందని భావిస్తున్నారు. అదలా ఉంచితే - వేల ఏళ్ల నుంచీ ఎంతో మంది ఇష్టంగా తింటోన్న ఆరోగ్యకరమైన మృదుఫలం... లీచీ...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..