బూడిద గుమ్మడి... దిష్టికే కాదు... పుష్టికీ!

వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఓ జ్యూస్‌ బండి కనిపించింది. ఎండకి గొంతు ఆర్చుకుపోతుంది... ఏ బత్తాయిరసమో తాగుదామని ఆశగా అటు నడిస్తే... ఆ బండిలో ఓ కవరు నిండుగా తెల్లని ముక్కలు కనిపించాయి.

Updated : 16 Apr 2023 11:31 IST

బూడిద గుమ్మడి... దిష్టికే కాదు... పుష్టికీ!

వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఓ జ్యూస్‌ బండి కనిపించింది. ఎండకి గొంతు ఆర్చుకుపోతుంది... ఏ బత్తాయిరసమో తాగుదామని ఆశగా అటు నడిస్తే... ఆ బండిలో ఓ కవరు నిండుగా తెల్లని ముక్కలు కనిపించాయి. బోర్డుమీద ఉన్న పట్టికలో బూడిద గుమ్మడి జ్యూస్‌ అనీ రాసి ఉంది. ‘ఇది కూడా తాగుతారా...’ అని ఆశ్చర్యంగా అడిగితే... ‘అవునండీ... ఆరోగ్యానికి చాలా మంచిదండీ... ఓ గ్లాసు ఇవ్వనాండీ...’  టూనే అందించాడా అబ్బాయి. అది ఎంతవరకూ నిజమని పోషకాహార నిపుణులనడిగితే... ఇదిగో, ఇన్ని విషయాలు చెప్పారు.

ఎవరైనా బూడిద గుమ్మడికాయతో ఏం చేస్తారు... వేసవిలో వడియాలు పట్టుకుంటారు. లేదంటే మజ్జిగ పులుసులో వేస్తారు. కొందరు హల్వా, ఆగ్రా పేఠా...వంటి స్వీట్లూ చేస్తారు. చాలామంది మాత్రం ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మం ముందు కడతారు... కానీ జ్యూస్‌లేంటీ అనిపిస్తోంది కదూ. నిజమే, రోగాలను తెచ్చిపెట్టే ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లకు కొదవ లేనట్లే, ఆరోగ్యాన్ని అందించేవీ అదేస్థాయిలో మార్కెట్లో ఉన్నాయి. అందులో భాగంగానే జ్యూస్‌ షాపుల్లో బూడిదగుమ్మడి కాయ కూడా కనిపిస్తోంది.

నిజానికి బూడిదగుమ్మడి పాదు ఇంటి పెరట్లో ఉంటుంది. కానీ కాయల్ని వడియాలు పట్టుకోవడానికి తప్ప ఇంక దేనికీ వాడరు సరికదా, దానం ఇస్తే పుణ్యం వస్తుందనుకుంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. అప్పట్లో శూద్రులు దీన్ని తింటే మరణదండన విధించేవారట. ఎందుకంటే- బూడిద గుమ్మడిలోని గుణాలు మెదడు పనితీరుని పెంచుతాయి. అంటే- దీనివల్ల తెలివితేటలు పెరుగుతాయని నాటి సంప్రదాయ వైద్యులకి తెలుసన్నమాట. కూష్మాండం అనీ పిలిచే ఈ కాయను దిష్టి పేరుతో గుమ్మం ముందు కడుతుంటారు. అలా కట్టడంవల్ల దుష్టశక్తులు రావనీ చెబుతారు. కొన్ని గిరిజన తెగల్లో దీనికి ప్రాణం ఉందని భావించి, మేకలూ కోళ్ల బలులకు బదులుగా గుమ్మడికాయలానే దీన్నీ పగులగొడతారు.

లేతగా ఉన్నప్పుడు- బూడిద గుమ్మడికాయకి నూగులాంటి వెంట్రుకలు ఉంటాయి. ముదిరేకొద్దీ అవి పోయి బూడిదను పులుముకుంటుంది. ఇదో రకమైన మైనం లాంటిది. కాయ త్వరగా పాడవకుండా కాపాడుతుందన్నమాట. సాధారణంగా బూడిద గుమ్మడి గుండ్రంగానూ అండాకృతిలోనూ ఉంటుంది. అయితే సొరకాయల్లా పొడవుగా పండేవీ ఉన్నాయి. ఆగ్నేయాసియా దేశాల్లో నున్నగా ముదురాకుపచ్చరంగులో పండే రకం కూడా ఉంది. కాయ ఏ రకానికి చెందినదైనప్పటికీ ముదిరాక కొన్ని నెలలపాటు నిల్వ ఉంటుందన్నది నిజం. గర్భిణులు
ఈ కాయతో చేసిన సూప్‌ తాగితే పాలు బాగా పడతాయి అంటారు వియత్నాంవాసులు. మనదగ్గర ఉత్తరాదిన పేఠా రూపంలో తింటే, దక్షిణాదిన మాత్రం మోర్‌కుళంబు, మజ్జిగచారు, హల్వాల రూపంలో వాడుతుంటారు. ఇప్పుడిప్పుడు దీంతో రకరకాల కూరలూ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కేరళలో దీని దిగుబడీ వాడకం రెండూ ఎక్కువే. ఇక, ఈ కాయను తురిమి, రుబ్బిన పెసర లేదా మినప్పిండిలో కలిపి వడియాలు పట్టి ఎండాక నూనెలో వేయించుకుని తినడం... చాలాచోట్ల వాడుకలో ఉంది. కేవలం కాయలే కాదు, కొన్నిచోట్ల బూడిద గుమ్మడి పాదు ఆకులూ కాడలూ లేత కొమ్మల్నీ కూరల్లో వేస్తుంటారు.

తెల్లగా ఉండే ఈ గుమ్మడికి ప్రత్యేకించి రంగూ రుచీ ఉండదు కాబట్టి ఏ పదార్థంలో వేస్తే దానికి సంబంధించిన ఫ్లేవర్‌ని పీల్చుకుంటుంది. అందుకే సలాడ్లూ స్మూతీలూ రైతాలూ జ్యూస్‌ల్లో ఇది చక్కగా ఒదిగిపోతుంది. పుదీనా, బీట్‌రూట్‌, స్ట్రాబెర్రీ, పుచ్చ... ఇలా రకరకాల జ్యూస్‌ల్లో కలిపితే వాటి రంగుల్లోనూ ఫ్లేవర్లలో కలిసిపోయి ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది.

గుమ్మడి రసంతో..!

పోషకాలు నిండుగా ఉండే బూడిద గుమ్మడి రసం ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, బరువు తగ్గడానికీ దోహదపడుతుంది.  ఇందులో 96 శాతం నీరే. పీచూ పుష్కలమే. అందుకే ఈ జ్యూస్‌ కొంచెం తాగినా పొట్ట త్వరగా నిండి, ఆకలి వేయదు. పోతే, బూడిద గుమ్మడిలో కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, జింక్‌, పొటాషియం, మెగ్నీషియం... వంటి ఖనిజాలూ ఉంటాయి. వంద గ్రా. బూడిద గుమ్మడి నుంచి 13 క్యాలరీలే లభిస్తాయి. పిండిపదార్థాలు- 3 గ్రా. ఉంటే, అందులో పీచు శాతమే 2.9 గ్రా. ప్రొటీన్‌- 0.4 గ్రా, సోడియం-111 మి.గ్రా, పొటాషియం- 359 మి.గ్రా.చొప్పున లభ్యమవుతాయి.

ఇందులోని ఆల్కలైన్‌ గుణం పొట్టలోని ఆమ్ల గుణాన్ని తటస్థీకరించి చల్లదనాన్ని అందిస్తుంది. జీర్ణశక్తినీ పెంచుతుంది. రోజూ ఉదయాన్నే ఓ గ్లాసు బూడిదగుమ్మడి రసం తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుందనీ, వారంలోనే స్పష్టమైన తేడా కనిపిస్తుందనీ చెబుతారు సంప్రదాయ వైద్యులు. ఎందుకంటే ఇందులోని పైరిడాక్సిన్‌ నరాలకు సాంత్వన కలిగించడం ద్వారా మెదడు పనితీరుని పెంచుతుంది. అయితే ఏ మధ్యాహ్నమో సాయంత్రమో కాకుండా పరగడుపున ఈ జ్యూస్‌ తాగితే అనేక వ్యాధులకు మందులా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఈశాన్య భారతంలోని మిజో తెగల్లో జ్వరం, విరేచనాలు, ఇతరత్రా సమస్యల నివారణకు ఈ రసాన్ని వాడతారు. జలుబూ ఆస్తమా సైనసైటిస్‌... వంటి వ్యాధులు ఉన్నవాళ్లు మాత్రం ఈ రసంలో తేనె, కాస్త మిరియాలపొడి కలుపుకుని తాగితే మేలు.

* ఈ గింజల నుంచి తీసిన ఎక్స్‌ట్రాక్ట్‌లో యాంటీ యాంజియోజెనిక్‌ లక్షణాలు ఉన్నాయనీ అందువల్ల క్సాన్సర్‌ కణాలకు రక్తాన్ని సరఫరా కాకుండా చేస్తుందనీ ఓ పరిశోధనలో తేలిందట. బూడిద గుమ్మడి రసం పైల్స్‌ సమస్యల్నీ నివారిస్తుంది.

* మాదకద్రవ్యాల అలవాటుని తగ్గించే గుణం కూడా బూడిద గుమ్మడికి ఉన్నట్లు ఎలుకల్లో చేసిన పరిశీలనలో స్పష్టమైంది.

* దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే ఇన్‌ఫ్లమేషన్‌నీ ఇది తగ్గిస్తుంది. వృద్ధాప్యానికి కారణమైన ఫ్రీరాడికల్స్‌తో పోరాడే గుణాలూ దీనికి ఉన్నాయి. అందుకే ఈ రసాన్ని క్రమం తప్పక తీసుకునేవాళ్లలో చర్మం తాజాగా ఉంటుంది.

* రక్తహీనతతో బాధపడేవాళ్లు దీన్ని తాగడంవల్ల అలసట, నీరసం లేకుండా ఉంటుంది. ఐరన్‌ లోపాన్నీ తగ్గిస్తుందీ జ్యూస్‌.

* ఇందులోని పీచు ప్రొబయోటిక్‌గా పనిచేసి మంచి బ్యాక్టీరియా సంఖ్యని పెంచుతుంది.

* బూడిద గుమ్మడిలోని గ్లైకోసైడ్స్‌, స్టెరాల్స్‌... వంటివన్నీ నిద్రలేమి, కుంగుబాటు, ఆందోళన, మూర్ఛ... ఇతరత్రా నాడీ సమస్యల్ని నివారిస్తాయి. ఆల్జీమర్స్‌ వ్యాధి నివారణకీ తోడ్పడతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కండరాల సంకోచ వ్యాకోచాల్ని క్రమబద్ధీకరిస్తాయి. మూర్ఛ రోగుల తలమీద బోలుగా చేసిన గుమ్మడికాయను టోపీగా పెట్టినా వెంటనే తగ్గుతుందని సంప్రదాయ వైద్యులు చెబుతారు.

* బూడిద గుమ్మడి రసంలోని బి3-విటమిన్‌ పొట్టలోని పాపాయి పెరుగుదలకీ తల్లి ఆరోగ్యానికీ మేలు చేస్తుంది.

* మూత్రపిండాల పనితీరుని పెంచే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా బూడిద గుమ్మడిలో పుష్కలమే. రక్తంలో గ్లూకోజూ లిపిడ్ల శాతాన్ని నియంత్రించడంద్వారా మధుమేహులకీ మేలుచేస్తుంది. ఇందులోని రిబోఫ్లేవిన్‌ ఒత్తిడిని కలిగించే హార్మోన్లను క్రమబద్ధీకరిస్తుంది. థైరాయిడ్‌ పనితీరుకీ తోడ్పడుతుంది.

* మ్యూకస్‌ స్రావాన్ని నియంత్రించడం ద్వారా ఊపిరితిత్తుల్నీ ఆరోగ్యంగా ఉంచుతుంది. గుమ్మడి గుజ్జుని పంచదారతో కలిపి తింటే శ్వాసకోశ వ్యాధులన్నీ తగ్గుతాయట. కాలేయ సమస్యల్నీ నివారిస్తుందీ బూడిదగుమ్మడి రసం.

* బూడిదగుమ్మడిలోని యాంటీ మైక్రోబియల్‌ గుణాలు హానికర బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. తద్వారా పెప్టిక్‌ అల్సర్ల నివారణకు తోడ్పడతాయి. గుమ్మడి గింజలతో చేసిన పానీయాన్ని తాగినా మేలే... వడదెబ్బ తగలదట.

* ఈ గింజల పొడిని కొబ్బరినూనెలో మరిగించి రాసుకుంటే తలనొప్పి, చుండ్రు సమస్య, బట్టతల ఉన్నవాళ్లకి ఫలితం ఉంటుంది. దీన్ని మెత్తని గుజ్జులా చేసి తలకి పెట్టుకుంటే చుండ్రు సమస్య తగ్గడంతోబాటు పొడి జుట్టుని మృదువుగా మారుస్తుంది.
ఇదండీ సంగతి... కాబట్టి పెరట్లో కాచిన బూడిదగుమ్మడిని ఏంచేయాలా అని ఆలోచిస్తూ కూర్చోకుండా నచ్చిన రుచుల్లో వండుకునో జ్యూస్‌ చేసుకునో తినండి... తాగండి..!

 

 


ఆగ్రా పేఠా!

ఆగ్రా పేరు చెప్పగానే తాజ్‌మహల్‌కన్నా ముందుగా పేఠానే గుర్తొస్తుంది మిఠాయి ప్రియులకి. తియ్యగా క్రిస్పీగా ఉండే ఆ పేఠాని బూడిదగుమ్మడికాయతోనే చేస్తారన్నది మాత్రం చాలామందికి తెలీకపోవచ్చు. బూడిద గుమ్మడికాయను ముక్కల్లా కోసి వాటిని కాల్షియం హైడ్రాక్సైడ్‌(సున్నపుతేట) ద్రావణంలో ఏడెనిమిది గంటల పాటు నానబెట్టి, ఆపై మరిగిస్తారు. దాంతో సున్నపుతేట అంతా పోతుంది. తర్వాత ముక్కల్ని పంచదార ద్రావణంలో నానబెట్టి తీస్తారు. చూడ్డానికి పటికబెల్లం మాదిరిగా ఉండి తినడానికి ఎంతో రుచిగా ఉంటుందీ పేఠా. ఇందులో ఆరెంజ్‌, వెనీలా, స్ట్రాబెర్రీ, కేసర్‌, రోజ్‌వాటర్‌, ద్రాక్ష... వంటి పండ్ల రసాలూ లేదా ఎసెన్స్‌లూ జోడించి చేసేవీ ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా ‘ప్యూరెస్ట్‌ డిజెర్ట్‌’గా దీన్ని పేర్కొంటారు. కామెర్ల రోగులకి పేఠా మంచి ఆహారం. పైగా నూనె, నెయ్యి వాడని ఈ స్వీటుని తింటే మంచి నిద్ర పడుతుందనీ జ్ఞాపకశక్తితోపాటు జుట్టూ పెరుగుతుందనీ అంటారు.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..