రాజమండ్రి చాక్లెట్‌కు ప్రపంచస్థాయి అవార్డు..!

సినిమాలకి ఆస్కార్‌, గోల్డెన్‌ గ్లోబ్‌ వంటి అంతర్జాతీయ అవార్డులున్నట్టే... చాక్లెట్‌లకీ ఓ అవార్డుంది. ఇంగ్లండులోని అకాడమీ ఆఫ్‌ చాక్లెట్స్‌ సంస్థ అందించే ఆ పురస్కారం కోసం ప్రపంచంలోని కంపెనీలన్నీ తమ కొత్త కొత్త చాక్లెట్‌లతో పోటీపడుతుంటాయి.

Updated : 25 Dec 2022 16:34 IST

రాజమండ్రి చాక్లెట్‌కు ప్రపంచస్థాయి అవార్డు..!

సినిమాలకి ఆస్కార్‌, గోల్డెన్‌ గ్లోబ్‌ వంటి అంతర్జాతీయ అవార్డులున్నట్టే... చాక్లెట్‌లకీ ఓ అవార్డుంది. ఇంగ్లండులోని అకాడమీ ఆఫ్‌ చాక్లెట్స్‌ సంస్థ అందించే ఆ పురస్కారం కోసం ప్రపంచంలోని కంపెనీలన్నీ తమ కొత్త కొత్త చాక్లెట్‌లతో పోటీపడుతుంటాయి. ఈ ఏడాది ఆ పోటీలో రాజమహేంద్రవరానికి చెందిన ‘బాన్‌ ఫిక్షన్‌’ సంస్థ తయారుచేసిన రెండు చాక్లెట్‌ రకాలకి కాంస్య పతకాలొచ్చాయి! తెలుగు రాష్ట్రాల నుంచి ఓ సంస్థ ఈ అవార్డు పొందడం ఒక్కటే కాదు... అసలు ఆ స్థాయికి తగ్గ ‘ట్రీ టు బార్‌’ చాక్లెట్‌లని చేయడమూ ఇదే తొలిసారి

గోదావరి గలగలలు... తెలుగు రాష్ట్రాలని అన్నపూర్ణగా మార్చడమే కాదు ఈ నేలని ఎన్నోరకాల వాణిజ్య పంటలకీ కేంద్రంగా మార్చాయి. అలా ఇక్కడ గత నలభై ఏళ్ళుగా చాక్లెట్‌ తయారీకి కావాల్సిన ‘కోకో’ పంటనీ వేస్తున్నారు. వాటిని దళారుల ద్వారా విదేశీ కంపెనీలు కొంటుంటాయి. రాజమహేంద్రవరం శివారులో చిన్నప్పటి నుంచీ కోకో తోటల్ని చూస్తూ ఎదిగిన అఖిల్‌ చంద్రశేఖర్‌ని... పెద్దయ్యాక ఓ ప్రశ్న తొలచడం ప్రారంభమైంది... ‘ఇక్కడ పండిన పంటతో ఎక్కడో ఉన్న కంపెనీలు చాక్లెట్‌ తయారుచేస్తుండగా... ఇక్కడి వాళ్ళం మనమెందుకు ఓ కంపెనీ పెట్టకూడదు?’ అన్న సందేహం అది. అఖిల్‌ వాళ్ళ నాన్న డాక్టర్‌ గ్రంథి అరవింద్‌... రాజమహేంద్రవరంలో ఆర్థో సర్జన్‌. వారం మొత్తం రోగులతో బిజీగా ఉన్నా... ఆదివారం మాత్రం వ్యవసాయం చేసేవారాయన. ఇందుకోసమే రాజమహేంద్రవరం కాంచన నగర్‌ దగ్గర పండ్లతోటల్ని పెంచసాగారు. సాగుపైన ఆ మమకారాన్ని ఆయన అఖిల్‌లోనూ అంటుగట్టారు. అందుకే, ఇంజినీరింగ్‌ చదివిన అఖిల్‌... వ్యవసాయాన్ని ఓ భారీ పరిశ్రమలా చేపట్టాలనుకున్నాడు. 2016లో ఇదే ప్రాంతానికి చెందిన ప్రతినతో పెళ్ళయ్యాక ఇద్దరూ కలిసి చాక్లెట్‌ సాగుపైన దృష్టి సారించారు. ఆ పంటతో... ‘ట్రీ టు బార్‌’ చాక్లెట్‌ రకాలని తయారుచేసే కంపెనీ పెట్టాలనుకున్నారు. చెన్నైలో నిర్వహించే శిక్షణకి వెళ్ళడం మొదలుపెట్టారు. ‘ఇందుకోసం అంత దూరం పోవాలా?’ అనుకునేవాళ్ళు అసలు ‘ట్రీ టు బార్‌’ చాక్లెట్స్‌ ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలి...

ఆ రుచి మనకే ప్రత్యేకం!

అమెరికా, యూరప్‌లలో 2000 సంవత్సరం తర్వాత మొదలైన ట్రెండ్‌ ఇది. పెద్ద సంస్థల స్థానే చిన్నవి వచ్చి... ‘ఎక్స్‌క్లూజివ్‌ డార్క్‌ చాక్లెట్‌’లని తయారుచేయడం మొదలుపెట్టాయి. వీటిలో రెండు తరహా కంపెనీలున్నాయి. రైతులు పండించి ప్రాసెస్‌ చేసిన గింజల్ని కొని వాటితో చాక్లెట్‌ తయారుచేసే సంస్థలు మొదటి రకానివి. వీటిని ‘బీన్స్‌ టు బార్‌’ కంపెనీలు అంటారు. మనదేశంలో 2010 నుంచీ ఈ తరహా సంస్థలున్నాయి. వాటిలో కొన్ని గోదావరి జిల్లాల నుంచి ప్రాసెస్‌ చేసిన గింజల్ని కొంటూ వస్తున్నాయి. అలాకాకుండా, చాక్లెట్‌ మొక్క నాటడం, కోతకొచ్చినవాటిని కోసి పులియబెట్టడం(ఫెర్మెంటేషన్‌), ఎండబెట్టడం (డ్రైయింగ్‌), చాక్లెట్‌ చేయడం... ఇలా ప్రతి దశనీ తమ కనుసన్నల్లోనే చేసే సంస్థలు రెండోరకానివి. వీటిని ‘ట్రీ(ఫార్మ్‌) టు బార్‌’ కంపెనీలంటారు. ఇవి ఏదైనా ఒక్క ప్రాంతంలోనే కోకోని పండించి వాటితో మాత్రమే చాక్లెట్‌ని తయారుచేస్తాయి. అలా, ఆ చాక్లెట్‌లో ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన రుచిని తెస్తాయి. ఇలాంటి సంస్థలు మనదేశంలో నాలుగే ఉన్నాయి. అందులో మూడు కేరళ, కర్ణాటక ప్రాంతాల చాక్లెట్‌ రుచిని చూపిస్తుంటే... నాలుగోది గోదావరి నేలకే పరిమితమైన రుచితో అలరిస్తోంది. అదే ‘బాన్‌ ఫిక్షన్‌’ సంస్థ.  

అంత ఈజీ కాలేదు...

ఈ చాక్లెట్‌ల తయారీకి కోటిన్నర రూపాయలు పెట్టుబడి పెట్టి మూడేళ్లు శ్రమించారు అఖిల్‌ దంపతులు. కరోనా లాక్‌డౌన్‌ టైమ్‌లో వాళ్ళు కోరుకున్న యంత్రాలు రాకపోవడంతో... గింజలపైన పొట్టుతీసే వినోవర్‌, గ్రైండర్‌లలాంటివి సొంతంగా తయారుచేసుకున్నారు. విదేశాల్లో తయారయ్యే డార్క్‌ చాక్లెట్‌లా... కొత్త పద్ధతులతో ఏమాత్రం చేదు తగలకుండా జాగ్రత్తపడ్డారు. ఇందుకోసం మూడేళ్ళపాటు 300సార్లు ప్రయోగాలు చేసి చివరికి 14 ఫ్లేవర్ల చాక్లెట్‌లు అమ్మడం మొదలుపెట్టారు. అలా అవి ఆ నోటా ఈ నోటా పడి... ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ట్రీ టు బార్‌ చాక్లెట్‌లలో వీటికంటూ ప్రత్యేక రుచి ఉందన్న ప్రశంసని అందుకున్నాయి. ఆ ‘గోదావరి’ ప్రత్యేక రుచే అకాడమీ ఆఫ్‌ చాక్లెట్స్‌ నుంచి వీరికి రెండు కాంస్య పతకాలు అందించింది! ‘బాన్‌ ఫిక్షన్‌’ వెబ్‌సైట్‌ ద్వారా ఈ చాక్లెట్‌లను దేశవిదేశాల్లో విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరు నగరాల్లోని సూపర్‌మార్కెట్‌లలోనూ ఇవి దొరుకుతున్నాయి. ఈ చాక్లెట్‌ల కోసం- గోదావరి ఇరుతీరాల్లోనూ వందెకరాల్లో కోకోని పండిస్తున్నారు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..