Updated : 05 Dec 2022 12:59 IST

సరైనోడు ఇంకా దొరకలేదు!

‘యూ ఆర్‌ మై ఎమ్మెల్యే...’  అంటూ అల్లు అర్జున్‌ వెంట పడిన అందాల తార కేథరిన్‌ థ్రెసా. ఈ ఏడాది ‘బింబిసార’, ‘మాచర్ల నియోజకవర్గం’తో వరుస విజయాలు అందుకుని ‘వాల్తేరు వీరయ్య’లో సందడి చేయడానికి సిద్ధమైన కేథరిన్‌ గురించి ఆసక్తికర విషయాలు తన మాటల్లోనే...


తెలుగులో...

‘చమ్మక్‌ చల్లో’ తెలుగులో మొదటి సినిమా. ‘ఇద్దరమ్మాయిలతో’ మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాదు, అల్లు అర్జున్‌ సినిమాలు ‘రుద్రమదేవి’, ‘సరైనోడు’లోనూ మంచి పాత్రలే వచ్చాయి. అందుకే బన్నీ నా లక్కీ హీరో.


ఖాళీగా ఉంటే...

ఇంగ్లిష్‌ సీరియల్స్‌ చూస్తా. ఆన్‌లైన్‌లో వార్తలు చదువుతా. కరెంట్‌ ఎఫైర్స్‌ తెలుసుకోవడం ఆసక్తి. పాటలంటే పిచ్చి. కారు ఎక్కానంటే పాటలు పెట్టుకోవాల్సిందే.  

ఇష్టం...

తాపేశ్వరం మడత కాజా, మైసూర్‌పాక్‌ నాకు బాగా నచ్చుతాయి. ఈ స్వీట్లు కనిపిస్తే తినకుండా ఉండలేను. అమ్మ దగ్గరకు వెళితే పాస్తా, బిర్యానీ చేయించుకుని తింటా.


నేపథ్యం...

దుబాయ్‌లో పుట్టి పెరిగిన నాకు అమ్మానాన్నలు పియానో, భరతనాట్యం, ఐస్‌స్కేటింగ్‌ నేర్పించారు. వాటితోపాటు చదువుల్లోనూ ముందుండేదాన్ని. పర్యావరణానికి సంబంధించి కృషి చేసే ఓ ఎన్జీఓలో వలంటీరుగానూ పని చేసేదాన్ని. (catherine tresa) అందుకే స్కూల్లో నాకు ఆల్‌ రౌండర్‌ అనే పేరుంది.

చదువు...

చిన్నప్పట్నుంచీ కెమిస్ట్రీ చాలా ఇష్టం. బయోటెక్నాలజీలో పీహెచ్‌డీ చేయాలనుకున్నా. కానీ, ప్లస్‌ టూ అయ్యాక బెంగళూరులోని ఓ కాలేజీలో చేరా. అక్కడ సరదాగా మోడలింగ్‌ చేయడం మొదలుపెట్టా. మోడల్‌గా నన్ను చూసిన దర్శకులు కన్నడ సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. ఆ తరవాత తెలుగు, తమిళం, మాతృభాష మలయాళంలోనూ ఛాన్స్‌లొచ్చాయి.


కాబోయేవాడు...

నాలాగా పుస్తకాలు చదవాలి. నా హైట్‌ ఉండాలి. ఫిట్‌గా ఉండి, ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలి. సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉండాలి. నాలాగా ఫుడ్‌ని ఇష్టపడాలి. అవన్నీ ఉన్నవాడే నాకు సరైనవాడు. ఇంకా అలాంటివాడు దొరకలేదు.

నచ్చిన నటులు...

లియోనార్డో డికాప్రియో, రాబర్ట్‌ డౌనీ జూనియర్‌లకి వీరాభిమానిని. వీళ్లకంటే నాకు బిల్‌క్లింటన్‌ చాలా ఇష్టం. మూడునాలుగేళ్లు ఉన్నప్పుడు నేను అన్నం తినకుండా అమ్మను బాగా సతాయించేదాన్నట. బిల్‌క్లింటన్‌ని టీవీలో చూపిస్తే తినేదాన్నట. అసలు నాకు ఆయన ఎందుకు ఇష్టమో ఇప్పటికీ అర్థం కాదు.


బాధ...

ఎనిమిదేళ్ల క్రితం మా తమ్ముడు ఒత్తిడితో కాలేజీ హాస్టల్‌లో ఉరి వేసుకుని చనిపోయాడు. అమ్మానాన్నల కంటే తనతోనే బాండింగ్‌ ఎక్కువ. తను లేడనే విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా. ఆ లోటు ఎప్పటికీ తీరదు.


భయపడ్డా...

‘సరైనోడు’లో ఎమ్మెల్యేగా నటించడానికి చాలా భయమేసింది. కథ బాగుంది కానీ, ఎస్‌ చెప్పాలో నో చెప్పాలో అర్థం కాలేదు. దర్శకుడు ‘ఒత్తిడి లేకుండా నీ స్టైల్‌లో నువ్వు నటించు’ అని చెప్పడంతో ఒప్పేసుకున్నా. నేను నటించిన సినిమాల్లో నాకు నచ్చిన పాత్ర అదే.


నేర్చుకున్నా...

భాష తెలిసినప్పుడే ఎమోషన్‌ బాగా పండుతుందనేది నా అభిప్రాయం. (catherine tresa) అందుకే కష్టమైనా సరే ట్రైనర్‌ని పెట్టుకుని మరీ తెలుగు నేర్చుకున్నా. నేను నటించిన ప్రతి సినిమాకీ డబ్బింగ్‌ చెప్పాలని ప్రయత్నించేదాన్ని. ‘గౌతమ్‌ నంద’లోని పాత్రకు వాయిస్‌ సెట్‌ కావడంతో ఆ సినిమాలో నా గొంతు వినిపించా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..