Director atlee: పెళ్ళి చేసుకుంటే హేళన చేశారు!
అట్లీ... బాలీవుడ్ కింగ్‌ఖాన్‌కి అతిపెద్ద హిట్టిచ్చాడని దేశమంతా ఇప్పుడితణ్ణి అభినందిస్తోంది. అతను తీసిన సినిమాలన్నీ బంపర్ కలెక్షన్స్ రాబట్టాయని అబ్బురపడుతోంది. కానీ... ఆన్‌లైన్‌లో అతణ్ణి ప్రస్తుతించే ప్రతి కథనం కిందా, అంతే స్థాయిలో వెక్కిరించే వాళ్ళనీ చూడొచ్చు.
అట్లీ... బాలీవుడ్ కింగ్‌ఖాన్‌కి అతిపెద్ద హిట్టిచ్చాడని దేశమంతా ఇప్పుడితణ్ణి అభినందిస్తోంది. అతను తీసిన సినిమాలన్నీ బంపర్ కలెక్షన్స్ రాబట్టాయని అబ్బురపడుతోంది. కానీ... ఆన్‌లైన్‌లో అతణ్ణి ప్రస్తుతించే ప్రతి కథనం కిందా, అంతే స్థాయిలో వెక్కిరించే వాళ్ళనీ చూడొచ్చు. ఓ రకంగా - దక్షిణాదిలో అత్యధికంగా ‘ట్రోల్స్’ని ఎదుర్కొన్న దర్శకుడు అట్లీయే అనొచ్చు. నిండా 36 ఏళ్ళు కూడా లేని ఈ కుర్రాడు... వాటిని తట్టుకుంటూ పాజిటివిటీతో ఎలా దూసుకుపోగలుగుతున్నాడు...చూద్దాం రండి...
అది ‘రోబో’ సినిమా షూటింగ్. రజనీకాంత్‌తోపాటూ ఐశ్వర్య రాయ్, మరో 300 మంది ఆర్టిస్టులున్నారు. దర్శకుడు శంకర్ ‘విలన్’ రజనీకాంత్‌కి ఓ సీన్‌ని వివరిస్తున్నారు. అలా వివరించిన సీన్‌ని- మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఎవరైనా నటించి చూపిస్తే బావుణ్ణని ఆయన భావించాడు. అప్పుడు ఆయన కంటికి కనిపించాడా కుర్రాడు - సన్నగా, పీలగా, పొట్టిగా ఉన్నాడతను. ఈ మధ్యే అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరినవాడు. శంకర్ అతణ్ణి పిలిచి- సీన్ చెప్పి రజినీకాంత్ ముందు నటించి చూపించమన్నాడు. ‘అంత పెద్ద నటుల ముందు నేనా?’ అని క్షణం ఆశ్చర్యపోయినా స్టైల్‌గా డైలాగ్స్ చెబుతూ చేసి చూపించాడా కుర్రాడు! ఆ కుర్రాడు చేసిందానికి తనదైన మెరుగులద్ది అదరగొట్టాడు రజినీకాంత్. సీన్ అద్భుతంగా పండింది. ఆ రోజు నుంచి షూటింగ్ మొత్తం రజినీకాంత్ రోబోకి ఇతనే డూప్‌గా చేశాడు! ఆ ‘డూప్’ కుర్రాడే... నేటి హిట్ చిత్రాల దర్శకుడు అట్లీ!
అట్లీ (Director atlee) వాళ్ళది మదురై... పొట్టకూటి కోసం చెన్నై వచ్చి స్థిరపడ్డారు. తండ్రి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి... దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా... పదో తరగతి, ఇంటర్‌లో మంచి మార్కులు సాధించాడు అట్లీ. అంతకన్నా, మంచి డాన్సర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆ కళతోనే సినిమాల్లోకి వెళదామనుకున్నాడు. అందుకు సహాయంగా ఉంటుందని- సత్యభామ వర్సిటీలో బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్‌లో చేరాడు. కానీ ఆ కోర్సు అతని దృష్టిని దర్శకత్వం వైపు మళ్ళించింది. కాలేజీ ప్రాజెక్టులో భాగంగా- వాళ్ళమ్మకున్న ఏకైక బంగారు గొలుసును అమ్మి మరీ ఓ షార్ట్‌ఫిల్మ్ తీశాడు. ఆ షార్ట్‌ఫిల్మ్ టైటిల్స్ కోసమే అరుణ్‌కుమార్ అన్న పేరుకి బదులు ‘అట్లీ’ అని పెట్టుకున్నాడు. ‘నిజానికి... మా పెదనాన్న నన్ను అలాగే పిలిచేవాడు. ఆయనో లాయరు. బ్రిటిష్ రాజకీయ యోధుడు క్లెమెంట్ అట్లీపైన అభిమానంతో నాకీ ముద్దుపేరు పెట్టాడట’ అంటాడు. ఏదేమైనా ఆ షార్ట్‌ఫిల్మ్ జాతీయస్థాయి పోటీల్లో నెగ్గింది. దాన్నే తన ‘బయోడేటా’గా చూపించి శంకర్ దగ్గర సహాయకుడిగా చేరిపోయాడు. ‘రోబో’ సినిమాలో అసిస్టెంట్‌గా మొదలుపెట్టినవాడు కాస్తా... విజయ్ హీరోగా చేసిన ‘స్నేహితుడు’కి అసోసియేట్‌గా మారాడు! ఆ తర్వాతే ‘రాజారాణి’ సినిమాని తెరకెక్కించాడు. ఒక్క తమిళంలోనే కాదు... తెలుగులోనూ సూపర్‌డూపర్ హిట్టయ్యిందది! ఏడాది తర్వాత అట్లీ పెళ్ళి కూడా అయ్యింది...
తెలుగింటి అల్లుడే...
కృష్ణప్రియది (Krishna Priya) చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం. అక్కడ విజయ్‌టీవీ సీరియల్స్‌లో హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. అట్లీతోపాటే తనూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ పరిచయమై మంచి స్నేహితులయ్యారు. ఐదేళ్ళ తర్వాత- ‘ఓ రోజు నాకు ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు అని చెప్పింది... మా ఫ్రెండ్స్ అందరిముందు. ‘అయితే నా జాతకం కూడా ఇస్తాను... చూడండి’ అన్నాను నేను క్యాజువల్‌గా. అదేదో జోక్‌లా అందరూ నవ్వేశారప్పుడు. ఇంటికెళ్ళాక కృష్ణప్రియ ‘ఎందుకలా అన్నావ్?’ అంటూ ఫోన్ చేసింది. నా మనసులో ఉన్నదే చెప్పానన్నాను. ఓ నిమిషం మౌనం తర్వాత వాళ్ళింట్లో మాట్లాడతానంది. తను ఏం మాట్లాడిందో తెలియదు... మా పెళ్ళి నిశ్చయమైంది’ అని గుర్తుచేసుకుంటాడు అట్లీ. ఇంతలో విజయ్‌తో తెరి (తెలుగులో పోలీసోడు) సినిమా కూడా ఖరారైంది. విజయ్ అంటే పడని కొందరు అతనితోపాటూ... అట్లీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అతని పెళ్ళి ఫొటోలు బయటకు రావడం ఆలస్యం ‘కాకి ముక్కుకి దొండపండు’ అనడమే కాదు... వాళ్ళ కులాంతర వివాహాన్నీ ఎగతాళి చేయసాగారు. ఇదేదో ఆన్‌లైన్‌లో ఒకరో ఇద్దరో అనడం కాదు... ట్విట్టర్‌లో ప్రత్యేకంగా ‘ట్యాగ్’లు ఏర్పాటుచేసుకుని మరీ వెంటపడేవారు. ‘తెరి’ కలెక్షన్‌ల వర్షం కురిపించినా... ఆ తర్వాత విజయ్‌తోనే వరసగా తీసిన మెర్సల్(అదిరింది), బిగిల్(విజిల్) చరిత్రాత్మక విజయాలు నమోదు చేసినా ఈ వెక్కిరింపులు ఆగలేదు. ప్రస్తుతం ‘జవాన్’ దాకా అవి కొనసాగుతూనే ఉన్నాయి!
పోరాటమే నాకు తెలిసింది...
తన రెండో సినిమా నుంచే ట్రోల్స్‌ని ఎదుర్కొంటున్న అట్లీ వాటిన్నింటినీ ఒక్క నవ్వుతో కొట్టిపారేస్తుంటాడు. ‘నాలాంటి సామాన్యుడు- అదీ నల్లటివాడు ఉన్నత స్థానానికి ఎదిగితే ఇలాంటివి రావడం మామూలే. అవి పట్టించుకోకుండా నా పని చేసుకుంటూ పోవడం, ఆ క్రమంలో విజయాల కోసం పోరాడటం మాత్రమే నేను చేయగలిగింది. అంటాడు అట్లీ...అదే నవ్వుతో!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Air India: విమానంలో నీటి లీకేజీ.. క్యాబిన్ పైకప్పునుంచి ధార!
-
Ashish Reddy: దిల్ రాజు ఇంట వేడుక.. హీరో ఆశిష్ నిశ్చితార్థం
-
Vikasraj: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ప్రత్యేక సెలవు: వికాస్‌రాజ్
-
Visakhaptnam: విశాఖ ఫిషింగ్ హార్బర్లో మరో అగ్ని ప్రమాదం
-
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ
-
COP28: చేతల్లో చేసి చూపెట్టాం.. ‘వాతావరణ చర్యల’పై ప్రధాని మోదీ