నాన్న కష్టాలు చూసి... సినిమాలే వద్దనుకున్నా!

ఓ ఎడిటర్‌ వంద సినిమాల మైలురాయిని చేరుకోవడం అరుదైన విషయమే కావొచ్చు... అందుకని సినిమా టైటిల్స్‌లోనూ ‘కేఎల్‌ ప్రవీణ్‌-100వ సినిమా’ అని చెబుతారా! ‘ఈ సినిమా తెరవెనకున్న అసలు హీరో ప్రవీణే’ అని ప్రకటిస్తారా!

Updated : 30 Jan 2022 03:25 IST

నాన్న కష్టాలు చూసి... సినిమాలే వద్దనుకున్నా!

ఓ ఎడిటర్‌ వంద సినిమాల మైలురాయిని చేరుకోవడం అరుదైన విషయమే కావొచ్చు... అందుకని సినిమా టైటిల్స్‌లోనూ ‘కేఎల్‌ ప్రవీణ్‌-100వ సినిమా’ అని చెబుతారా! ‘ఈ సినిమా తెరవెనకున్న అసలు హీరో ప్రవీణే’ అని ప్రకటిస్తారా! ఈ రెండు వింతలూ సింబు హీరోగా వచ్చిన తమిళ సినిమా ‘మానాడు’లో చోటుచేసుకున్నాయి. అక్కడంత క్రేజ్‌ దక్కించుకున్న కేఎల్‌ ప్రవీణ్‌... తెలుగువాడే. టాలీవుడ్‌లోనూ ‘మహర్షి’ నుంచి ఈ ఏడాది రాబోతున్న పవన్‌కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’దాకా ఎన్నో సినిమాలని కట్‌చేశాడు. జాతీయ అవార్డూ సొంతం చేసుకున్న ఈ ఎడిటింగ్‌ స్టార్‌ ఎదిగిన క్రమమిది...

కూచిపూడి లత ప్రవీణ్‌... అన్నది నా పూర్తి పేరు. కూచిపూడి మా ఇంటి పేరుమాత్రమే కాదు... నాన్నగారి ఊరు కూడానట. కృష్ణా జిల్లాలోని ఆ ఊరి నుంచి వలసవెళ్లి  కర్ణాటకలోని వజ్రకరూరు ప్రాంతంలో మా తాతగారు స్థిరపడ్డారు. ఆ సారవంతమైన నేలలో వ్యవసాయం చేస్తూ పిల్లల్ని గొప్పగా చదివించాలనుకున్నారు. మా నాన్న రాజేంద్రప్రసాద్‌ని బళ్లారిలో ఎంబీబీఎస్‌లో చేర్చారు. కాకపోతే నాన్న డాక్టర్‌గాకన్నా యాక్టర్‌గానే మారాలనుకున్నారు. దాంతో ఇంట్లోవాళ్లకి చెప్పకుండా మద్రాసు రైలెక్కారు. అక్కడ ఎన్నెన్నో పాట్లుపడి సహాయదర్శకుడిగా కుదురుకున్నారు. అక్కడే అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా మంచి పేరున్న నందమూరి కోటేశ్వరరావు గారి కూతురామె. అమ్మానాన్నలకి మొదట మా అన్నయ్య నవీన్‌, తర్వాత నేను పుట్టాం. అమ్మ ఓసారి ఎక్కడికో ఆటోలో వెళ్లివస్తుంటే అది ప్రమాదానికి గురై... తల ఆటోలోని రాడ్‌కి ఢీకొట్టింది. కొద్దిగా తలనొప్పిగా అనిపించడంతో ఓ చిన్నక్లినిక్‌లో చూపించుకుని ఇంటికొచ్చేసింది. ఇప్పట్లా స్కానింగ్‌లు వంటివేవీ లేవుకాబట్టి... ఆమె మెదడు చిట్లి రక్తస్రావం అయిన విషయం ఎవరూ గుర్తించలేదు! దాంతో అమ్మ నిద్రలోనే కన్నుమూసింది. అప్పట్లో నాకు ఐదేళ్లని చెబుతారు... నాటి సంఘటనలేవీ గుర్తులేవు. అమ్మ అంటే ఆమె స్పర్శా, గొంతు మాత్రమే చూచాయగా మనసులో మిగిలిపోయాయి. ఆ కాసిన్ని గుర్తులే కాకుండా, అమ్మ ఎప్పుడూ మాతోనే ఉండాలనుకున్నారేమో నాన్న-మా పేర్ల ముందు లత అన్న అమ్మ పేరునీ ఇనిషియల్‌గా చేర్చారు. అలా నేను కేఎల్‌ ప్రవీణ్‌ని అయ్యాను. మా ఆలనాపాలనా కోసం పెద్దవాళ్ల పోరుపడలేక... నాన్న రెండో పెళ్ళి చేసుకున్నారు. అయితేనేం, చిన్నమ్మ మా అమ్మని మరపించింది. కంటనీరు రాకుండా కనురెప్పలా కాచుకుంది. అమ్మ పోయాక అలా ఆప్యాయతలపరంగా ఏ కొరతాలేదుకానీ... ఆర్థిక సమస్యలే మమ్మల్ని ఎక్కువగా వేధించాయి. చెప్పాలంటే, ఒకప్పుడు పూటకింత అన్నం కూడా దొరకని స్థితి మాది!

సినిమాలు మాత్రం వద్దనుకున్నా!

నాన్న సినిమాల్లో సహాయ దర్శకుడిగాకంటే ముందుకెళ్లలేకపోయారు. మూణ్నెళ్లు సినిమాలుంటే... తొమ్మిదినెలలు నాన్న చేతిలో చిల్లిగవ్వ ఉండేదికాదు. ‘సాయంత్రానికి బియ్యం లేవండీ..!’ అని చిన్నమ్మ అంటుంటే... నాన్న కళ్లనీళ్ళతో నిస్సహాయంగా చూస్తుండిపోయిన సందర్భాలెన్నో ఉన్నాయి. అవి తెలుగు సినిమా రంగం మద్రాసుని వీడి హైదరాబాద్‌లో స్థిరపడుతున్న రోజులు. అప్పట్లో పెద్ద నిర్మాత ఒకరు నాన్న హైదరాబాద్‌ వస్తే అన్నీ తాను చూసుకుంటానని హామీ ఇచ్చి మా కుటుంబాన్ని ఇక్కడికి షిఫ్ట్‌ చేయించారు. నాన్న నన్ను ఇక్కడో కాన్వెంట్‌ స్కూల్లో ఏడో తరగతిలో చేర్చారు. మూణ్ణెళ్లపాటు బాగానే గడిచిందికానీ... ఆ తర్వాత ఆ నిర్మాత పట్టించుకోవడం మానేశాడు. దాంతో మా పరిస్థితి కుడితిలోపడ్డ ఎలుకలా మారింది. అటు ఇంటి అద్దె, ఇటు మా ఫీజులూ కట్టలేక నాన్న అష్టకష్టాలు పడ్డాడు. అప్పుడో సంఘటన జరిగింది. నేను చదువుతున్న కాన్వెంట్‌లో ప్రతి సోమవారం అందరూ తెల్లచొక్కా వేసుకుని రావాలన్న రూలుండేది. నా దగ్గర అది లేదు... కొత్తది కొనడానికీ డబ్బులేదు. దాంతో, నాన్నది ఓ పాత వైట్‌ షర్ట్‌ ఉంటే వేసుకున్నాను. ‘టక్‌’ చేస్తే అది కరెక్ట్‌గానే సెట్‌ అయిందికానీ... కాలర్‌ మాత్రం పెద్దగా కొట్టొచ్చినట్టు కనిపించసాగింది. ఆ రోజు స్కూల్‌ అసెంబ్లీ. ప్రేయర్‌ మొదలవుతుండగానే మా ప్రిన్స్‌పాల్‌ నా కాలర్‌ని చూశారు. ఏదో ఫ్యాషన్‌ కోసం పోకిరితనంగా అంత పెద్ద కాలర్‌ పెట్టుకున్నానని అనుకున్నారు. ‘నీకెందుకోయ్‌ ఫ్యాషన్‌!’ అంటూ అసెంబ్లీలో అందరి ముందు చిత్తుగా కొట్టారు. ఈ షర్ట్‌ నాన్నదని చెప్పలేక ఏడుస్తూనే ఉండిపోయాను. ఆ సంఘటన ఓ చేదుగుర్తులా మనసులో ఉండిపోయింది. ‘నాన్నలా సినిమాల్లోకి వెళితే ఇలా ఉండిపోవాల్సిందే. కాబట్టి... మనం బాగా చదువుకుని గొప్ప ఉద్యోగం సాధించాలి!’ అన్న నిర్ణయానికి అదే బీజం వేసింది.

కూలీనాలీ చేశా...

హైదరాబాద్‌లో ఉపాధి దొరక్క మా కుటుంబం మళ్లీ చెన్నై వచ్చేసింది. అప్పటికే నేను ఎనిమిదో తరగతిలోకి రావడంతో బడికెళుతూ రోజూ చిన్నాచితకా పనులు చేయడం ప్రారంభించాను. బట్టల దుకాణాలూ, టైలరింగ్‌ షాపులూ, స్క్రీన్‌ ప్రింటింగ్‌ అంగళ్లలో పనిచేస్తుండేవాణ్ణి. అలా పనులు చేస్తూనే పదో తరగతిలో 82 శాతం మార్కులు సాధించాను. ఇంటర్‌ ఫస్టియర్‌లో ఉండగా-అలా నా జీతంతో ఇంటికో ఫ్రిజ్‌ కొనిపెడితే... ‘ప్రయోజకుడయ్యాడు’ అన్నట్టు అమ్మానాన్న కళ్లలో కనిపించిన తడిని ఇప్పటికీ మరచిపోలేను. ఇంటర్‌ తర్వాత బీఎస్సీ బయోకెమిస్ట్రీ చేయాలని కలలుకంటుండేవాణ్ణి కానీ... ఆ కోర్సు చేయడానికి నా మార్కులు సరిపోలేదు. ఏడాది తర్వాత ఇంప్రూవ్‌మెంట్‌ రాసి... మళ్లీ చేరదామనుకున్నాను. ఈలోపు ఓ డబ్బింగ్‌ స్టూడియోలో సౌండ్‌ ఇంజినీర్‌కి అసిస్టెంట్‌గా వెళ్లాను. అప్పటికే నాన్న చెన్నై ఈటీవీలో ఆర్టిస్టు కోఆర్డినేటర్‌గా చేరారు. ఏడాది తర్వాత నాకూ అక్కడ టెక్నికల్‌ అసిస్టెంట్‌గా అవకాశం వచ్చింది. ఇప్పటి నా ఎదుగుదలకి అక్కడే గట్టి పునాది పడింది...

‘అన్వేషిత’తో...!

ముందుగా ఆరునెలల శిక్షణ తర్వాత... నాకు ‘వీడియో ఎడిటింగే’ సరిపోతుందని నిర్ణయించుకున్నాను. ఏడాది తిరగకుండానే సీరియల్స్‌ని కట్‌ చేయడం నేర్చుకున్నాను. అలా చేసిన ‘అన్వేషిత’ సీరియల్‌కి మంచి పేరొచ్చింది. నాలుగేళ్ల తర్వాత చెన్నైలో ఈటీవీ న్యూస్‌ విభాగాన్ని ప్రారంభిస్తూ నన్ను పంపించారు. అప్పుడే మనదేశంలో అవిడ్‌ అన్న ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ పరిచయమైంది. అప్పట్లో అందరూ లీనియర్‌(మాన్యువల్‌) ఎడిటింగ్‌ చేస్తుంటే... ఇది కంప్యూటర్‌ సాయంతో మరింత కళాత్మకంగా చేసేందుకు సాయపడేది. ఇక భవిష్యత్తు దానిదేనని నాకు అర్థమైపోయింది. దాన్ని నేర్చుకోవడం కోసమే... ‘అవిడ్‌ కంపెనీ’లో చేరాను. అప్పట్లో ప్రముఖ దర్శకుడు బాలుమహేంద్రగారు ప్రఖ్యాత రచయితల కథల్ని సీరియల్‌గా తీస్తుంటే... అందులో పనిచేసే అవకాశం నాకు దక్కింది. కెరీర్‌ పరంగా ఈటీవీ నాకు తొలి గురువైతే ఆయన రెండో గురువయ్యారు! ఎడిటింగ్‌లో సృజనాత్మకతని చొప్పించడం ఎలాగో ఆయనే నేర్పారు. ఆ తర్వాత ‘రైట్‌ యాంగిల్‌’ అన్న సంస్థలో ఉద్యోగం వచ్చి సింగపూర్‌కి వెళ్లిపోయాను. డిస్కవరీ ఛానెల్‌, బీబీసీ వరల్డ్‌, నేషనల్‌ జియోగ్రఫీ వంటి ఇంగ్లిషు ఛానెళ్లకి పోస్ట్‌ప్రొడక్షన్‌ పనుల్ని చేసిపెట్టే సంస్థ అది. ప్రపంచస్థాయి టీవీ ఛానెళ్లకి ఎడిటింగ్‌ చేయడం నా పని నాణ్యతని పెంచింది. అప్పటిదాకా నా క్వాలిఫికేషన్‌ ఇంటరే కాబట్టి... ఇంగ్లిషు మాట్లాడాలంటే మొదట్లో కష్టంగా ఉండేది. అందుకని రోజూ ఆఫీసుకి బస్సులో వెళ్తున్నప్పుడు ఓ ఇంగ్లిషుపత్రిక తీసుకుని చదువుతూ నాకు అర్థంకాని పదాలన్నీ టిక్‌చేస్తూ వాటికి అర్థాలు వెతికేవాణ్ణి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతో నిర్భయంగా మాట్లాడటం నేర్చుకున్నాను. ఆ నిర్భీతి నన్ను మరో అడుగు ముందుకేయించింది. నాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కాంటాక్ట్స్‌తో... ఉద్యోగానికి రాజీనామా చేసి ఫ్రీలాన్స్‌ ఎడిటర్‌గా మారాను. దాంతో పనికోసం వెచ్చించే సమయం తగ్గి సంపాదన పెరిగింది! ఆ తర్వాతే మా కుటుంబం స్థిరపడింది. అక్కడి నుంచి మరో పదేహేనేళ్లలో మా తమ్ముడు కేఎల్‌ శ్రవీణ్‌ని డాక్టర్‌ని చేయగలిగాము. నేనెలాగూ చదువుకోలేదు కాబట్టి బాగా చదువుకున్న... స్పెయిన్‌లో పీహెచ్‌డీ చేసిన వైజాగ్‌ అమ్మాయి ప్రవీణని పెళ్ళి చేసుకున్నాను. మా పాప రియాకి ఇప్పుడు పదకొండేళ్లు. ఈ మైలురాళ్ల నడుమనే నా జీవితం అనుకోకుండా సినిమా వైపు మలుపు తీసుకుంది...

జాతీయ అవార్డుకి...!

ఈటీవీ కోసం ‘పాడుతా తీయగా’  కార్యక్రమానికి పనిచేస్తున్నప్పుడే ఎస్పీబీ చరణ్‌గారితో పరిచయమేర్పడింది. ఆయనోసారి ఇళయరాజాగారి తమ్ముడు అమర్‌గారబ్బాయి వెంకట్‌ప్రభుతో సింగపూర్‌కి వచ్చారు. వాళ్లు సింగపూర్‌ తమిళ ఛానెల్‌ కోసం అక్కడో పాటని చిత్రీకరించారు. చరణన్న ఆ పాటని నన్ను ఎడిట్‌ చేయమని చెబితే... ‘మీకు అస్సలు పాటలు తీయడమే చేతకాలేదు’ అని కసిరి మళ్లీ రీషూట్‌ చేయించాను. నాలోని ఆ నిర్మొహమాటం, క్రియేటివిటీలు వాళ్లకి నచ్చి నాకు దగ్గరి స్నేహితులైపోయారు. వెళ్తూ వెళ్తూ చరణ్‌ నిర్మాతగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో వస్తున్న సినిమాకి ఎడిటర్‌గా ఉండమన్నారు. అప్పటికి నాకు స్థిరమైన ఆదాయం ఉండటంతో... చిన్నప్పటి నుంచీ సినిమాలపైనున్న భయంపోయింది. ఓ మూడునెలలు ఇండియా వచ్చినట్టూ ఉంటుందని ‘చెన్నై-600028’ అన్న వాళ్ల సినిమాకి ఒప్పుకున్నాను. అది గల్లీక్రికెట్‌పైన ఆధారపడ్డ సినిమా కావడంతో నా ఎడిటింగ్‌లో ఎంతో శ్రమించాల్సి వచ్చింది. అందుకు తగ్గట్టే ప్రశంసలూ వచ్చాయి. మళ్లీ వెంకట్‌ప్రభు సినిమా ‘సరోజ’కి తమిళనాడు ప్రభుత్వం అవార్డు వచ్చింది. ఆ తర్వాత చేసిన ‘అరణ్యకాండం’ అన్న సినిమాకి ఏకంగా జాతీయ అవార్డూ అందుకున్నాను! అప్పుడే నేనూ సినిమాల్లో రాణించగలనన్న నమ్మకం వచ్చింది. అలా ఇండియాకి తిరిగొచ్చేశాను. రెండుమూడేళ్ల లోనే సంవత్సరానికి పదిహేను సినిమాలు చేసేంతగా బిజీ అయిపోయాను. రజినీకాంత్‌ ‘కబాలి’ ఆ ప్రయాణంలో మరపురాని మైలురాయి. నా మొదటి సినిమాయే కాదు... వందో సినిమా ‘మానాడు’కీ వెంకట్‌ప్రభు దర్శకుడు. ఈ సినిమాలో హీరో సింబు కనిపించే ఓ కీలకమైన సన్నివేశాన్ని... సినిమాలో పాతికసార్లు మళ్లీమళ్లీ చూపించాల్సి ఉంటుంది. అన్నిసార్లు చూపినా ప్రేక్షకులకి బోర్‌కొట్టకుండా ఆ సన్నివేశాల్ని కట్‌చేయడం నాకు కత్తిమీద సాముగా మారింది. అయినా సరే ప్రేక్షకుల్ని కుర్చీలకి కట్టిపడేయడంతో దేశవ్యాప్తంగా మంచి ప్రశంసలు వస్తున్నాయి.

తెలుగులో...

సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో కోదండరామిరెడ్డిగారబ్బాయి వైభవ్‌ హీరోగా తెలుగులో ‘కాస్కో’ చిత్రానికి పనిచేసినా... ఆ తర్వాత ఇటువైపు పెద్దగా దృష్టిపెట్టలేదు. 2013లో కార్తీ నటించిన ‘మద్రాస్‌’ అన్న తమిళ సినిమాకి చేశాను. ఆ సినిమా నన్ను బాగా కదిలించడంతో హైదరాబాద్‌లో ఉన్న మిత్రులూ చూడాలనిపించి ఇక్కడో షో ఏర్పాటుచేశాను. ఆ షోకి దర్శకుడు వంశీ పైడిపల్లి వచ్చారట. ఆయన ఆ తరువాత కాంటాక్ట్‌ అయి నాగార్జున-కార్తీ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఊపిరి’ సినిమాకి పనిచేయమంటే చేశాను. ఆ తర్వాత ‘మహర్షి’ సినిమాకి రమ్మంటే ముందు ‘రషెస్‌’ చూపించమని అడిగాను. ఆ రషెస్‌లో మహేశ్‌బాబు చిన్నప్పుడు అప్పులవాళ్లు వచ్చి బాధపెట్టే సన్నివేశం నన్ను బాగా కదిలించింది... ఒకప్పటి మా జీవితం గుర్తొచ్చి కన్నీళ్లొచ్చేశాయి. మరో మాటలేకుండా మహర్షికి ఒప్పుకున్నాను. వంశీపైడిపల్లి విజయ్‌తో చేస్తున్న పాన్‌ ఇండియా సినిమాకీ చేస్తున్నాను. ఓ స్థాయికి ఎదిగామనుకున్నాక... నాకు వీలున్నంతలో కొత్త దర్శకులకి సాయపడాలని భావిస్తుంటాను. తమిళంలోనైతే నేనే నిర్మాతలకీ సిఫార్సు చేస్తుంటాను. ఆ అలవాటుతోనే ‘ఆర్‌ఎక్స్‌ 100’, రవితేజ ‘రామారావు ఆన్‌డ్యూటీ’ సినిమాలకి పనిచేశాను. ఇక, క్రిష్‌... తెలుగులో నా అభిమాన దర్శకుడు. ఎప్పటి నుంచో ఆయనతో పనిచేసే అవకాశం ఉంటే చెప్పమని ఓ రచయితకి చెబుతూ వచ్చాను. అలా పవన్‌కల్యాణ్‌ హీరోగా వస్తున్న ‘హరిహర వీరమల్లు’ కుదిరింది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..