నటన... ఘటన... తపన

పట్టాభికి కొంచెం ఊపిరాడనట్టుగా ఉంది. ఆయాసంగా ఉందనిపిస్తోంది. చదువుతున్న పేపరు పక్కన పడేసి గుబులుగా కుర్చీలోంచి లేచి గది కిటికీలోంచి బయటకు చూశాడు.

Updated : 04 Feb 2024 00:18 IST

 మోచర్ల అనంత పద్మనాభరావు

పట్టాభికి కొంచెం ఊపిరాడనట్టుగా ఉంది. ఆయాసంగా ఉందనిపిస్తోంది. చదువుతున్న పేపరు పక్కన పడేసి గుబులుగా కుర్చీలోంచి లేచి గది కిటికీలోంచి బయటకు చూశాడు. అతని దేహస్థితికి అనుగుణంగానే బయట కూడా గుబులుగానే ఉంది. నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా ఆకాశాన్ని ఆక్రమించేశాయి. ఏ క్షణాన్నయినా వరుణుడు విజృంభించేలా ఉన్నాడు. మెల్లగా సోఫాలో వాలి విశ్రాంతి తీసుకున్నాడు. కాసేపటికి కొంచెం సులువుగా అనిపించి గడియారంకేసి చూశాడు. ఉపాహారానికి సమయమయ్యింది. పండరి పిలుపుకోసం ఎదురు చూస్తున్నాడు. కాసేపటికి బయట చినుకుల చప్పుడు వినిపించింది. వాన మొదలయ్యింది కాబోలు అనుకున్నాడు. ఇంతలో ట్రింగ్‌... ట్రింగ్‌ మంటూ కాలింగ్‌ బెల్‌ మోగింది.

‘ఇంత పొద్దున్నే ఎవరబ్బా..? కరోనా తర్వాత తమ ఇంటికి రాకపోకలు తగ్గాయి. చుట్టాలూ చుట్టుపక్కలవాళ్ళూ కూడా రావటం తగ్గించేశారు. మరి ఇప్పుడు వచ్చిందెవరో?’ అనుకుంటూ తలుపు తీశాడు పట్టాభి.

తలుపు పూర్తిగా తెరవకుండానే తోసుకుని లోపలికొచ్చేశాడు పురుషోత్తముడు. ‘‘సారీ మావయ్యా, ఒక్క నిమిషం’’ అంటూ అలెగ్జాండర్‌తో యుద్ధం చెయ్యాలన్నంత హడావుడిగా బాత్‌రూమ్‌లోకి దూరిపోయాడు.

‘‘ఏమోయ్‌, మీవాడు మనింటిపైన దండయాత్ర చేసేశాడు’’ వంటగదిలో ఉన్న భార్యకు వినిపించేలా గట్టిగా అరిచాడు. వంటింట్లో ప్లేటుల్లో ఉప్మా పెడుతున్న పండరికి భర్త మాటలు అర్థంకాక,
‘‘దండయాత్రలూ పాదయాత్రలంటూ పాఠాలు చెప్పకుండా, కాస్త అర్థమయ్యేలా చెప్పండి. బడిపంతులు కాకపోయినా పాఠాలు మాత్రం బాగానే చెబుతారు’’ వెటకారంగా అంది.

‘‘వాడేనే నీ మేనల్లుడు శ్రీ శ్రీ పురుషోత్తముడు.’’

‘‘వాడా... ఏడీ ఎక్కడా?’’ హాల్లోకొచ్చి కలియ చూస్తూ అడిగింది. ఆపై ఆందోళనగా, ‘‘వాడసలే త్రిపాద నక్షత్రం. ఈ భాగ్యనగరంలో వాడు తిరగని వాడా, చూడని ఇల్లంటూ ఉండదు. ఈమధ్య కాశీ, గయా అంటూ తీర్థయాత్రలు చేసొచ్చి వెళ్ళిపోయిన కరోనాను వెనక్కి తెచ్చాడు. చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టయింది వాడికి. వీడిప్పుడు మనింటికి రావడమేంటండీ? మాస్కు లేకుండా తలుపెందుకు తీశారు? ముందు తగిలించుకోండి’’ అంటూ గబగబా ఆయనకొక మాస్కు ఇచ్చి, తనొకటి తగిలించుకుని, ప్లేట్లలో సర్దిన ఉప్మాని మళ్ళీ గిన్నెలో వేసి మూత పెట్టింది. ‘‘నిమిషమన్నవాడు పది నిమిషాలయ్యింది, ఆ బాత్‌రూమ్‌లోంచి బయటకు రాలేదు. ఇంతకీ వీడెందుకొచ్చినట్టో?’’ అన్నాడు పట్టాభి.

‘‘ఇంకేముంటుంది? మీ రక్తాన్ని పిండుకోడానికే అయ్యుంటుంది. ఇప్పటికి మూడు నాలుగుసార్లు రుచి చూపించారు. ఇక కుదరదని చెప్పెయ్యండి. ఇప్పుడు మీరో అరిగిపోయిన సబ్బుబిళ్ళ. అరవై రెండేళ్ళు మీకు. అది మర్చిపోకండి. ఇంకా టింగురంగా అంటూ తిరగక్కరలేదు. కాస్త ఇంటిపట్టు నుండి విశ్రాంతి తీసుకోండి’’ అని పండరి అంటున్నా విననట్టు నటించాడు పట్టాభి.

‘‘హమ్మయ్య, కడుపులో గడబిడ పోయింది’’ చెమటలు పట్టిన మొహాన్ని తుడుచుకుంటూ వచ్చాడు పురుషోత్తముడు.

‘‘ఏమిట్రా, మళ్ళీ రక్తానికేనా? ఈసారి మీ మావయ్య రారు. ఆయన్ను చూడు రక్తం లేనట్టు ఎలా పాలిపోయారో తెల్లగా. ఇక ఇబ్బందిపెట్టకు. అయినా, అలా వస్తావు ఇలా బాత్‌రూమ్‌లో దూరతావు. మా ఇంటికొచ్చినప్పుడే నీకు కడుపులో గడబిడ మొదలవుతుందా? ఇక్కడికొచ్చే ముందు ఏం తిని వస్తున్నావేంటి? ముందా మాస్కు పెట్టుకో’’ ఆందోళనగా మేనల్లుడితో అంది.

‘‘అదేం కాదత్తయ్యా! మావయ్యతో కొంచెం పనుంది. అదే... ఓ యాభైవేలు...’’

‘ఓహో... రక్తం పిండుకోడానికి కాదు ఏకంగా పీల్చడానికే వచ్చాడన్నమాట’ పళ్ళు పటపట లాడించింది పండరి.

‘‘ఒరేయ్‌! పురూ... అంటే అన్నానని కాదుగానీ, నీకు పెళ్ళైంది, పిల్లలున్నారు. వయస్సా నలభై దాటింది, ఇప్పటికీ స్థిరపడకపోతే ఎలా? ఎన్నాళ్ళీ ఇన్సూరెన్సులూ రియల్‌ ఎస్టేటులూ రక్తదానాలూ పరోపకారాలంటూ తిరుగుతావు? రిటైరయ్యాక మీ మావయ్యకొచ్చిన సొమ్ముపైన వచ్చే వడ్డీతో పిల్లల మీద ఆధారపడకుండా బండి లాగిస్తున్నాం. నువ్విలా వేళకానివేళ వచ్చి వేలూ లక్షలూ అడిగితే ఎలా?
కరోనాలో కూడా నువ్వు ఇంటింటికీ తిరిగావు. ఏం చేస్తాం, నీ వ్యవహారాలటువంటివి. తిరిగితే తిరిగావుగానీ, నీకు ఆ మధ్య ఒంట్లో బాలేదు. అటువంటప్పుడు ఇక్కడకెందుకు రావడం? మేమా పెద్దవాళ్ళమయిపోయాం. నీ నుంచి మాకేదైనా రోగమో రొష్టో అంటుకుంటే ఆదుకునే వారెవరు?’’ కాస్త నిష్ఠూరంగానే అంది.

‘‘అయ్యయ్యో అత్తయ్యా... ఆ డబ్బు నాకోసం కాదు. అదీ... మీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ గడువైపోతోంది. అది సమయానికి రెన్యువల్‌ చేయించకపోతే పనికిరాదు. అదీ సంగతి. నేనెప్పుడైనా మావయ్య దగ్గర డబ్బు తీసుకున్నానా? నీకు తెలీదా, నాన్న పోయిన దగ్గర్నుంచీ చూస్తున్నావుగా... నా తంటాలేవో నేనే పడుతున్నా. ఎవర్నీ చేయి చాచి పైసా కూడా అడగలేదు. ఇక రక్తదానం,
పరోపకారం అంటావా... ఆ రెండూ నాన్న ఇచ్చిన వరాలు. నాన్న లేడు కదాని వాటిని వదులుకోలేను. ఇక ఆ పాజిటివ్‌ కరోనా వ్యాధి ఈ ‘బి’ పాజిటివ్‌గాడ్ని ఏమీ చెయ్యదు. మావయ్యను కూడా
ఏం చెయ్యదు. ఎందుకంటే, ఆయన రక్తం కూడా ‘బి’ పాజిటివే కదా! అంతేకాదు, పరోపకారం చెయ్యడంలో మావయ్య తర్వాతే ఎవరైనా. ఇక రక్తం సంగతంటావా... అవసరం పడినప్పుడు ఆసుపత్రివాళ్ళే ఫోను చేస్తారు. నీకు తెలియని విషయమేమిటంటే, ఎవరైనా సరే అరవై అయిదేళ్ళు వచ్చే వరకూ రక్తదానం చెయ్యొచ్చు. అందుకని నువ్వేం గాభరా పడొద్దు’’ అని, ‘‘మావయ్యా, ఇన్సూరెన్స్‌ కంపెనీకి ఓ యాభైవేల చెక్కిచ్చి, ఈ పేపర్లపైన సంతకాలు చేసి ఇవ్వండి. మిగతాదంతా నేను చూసుకుంటా’’ అన్నాడు పట్టాభితో.

‘‘సర్లే, కబుర్లు చెప్పడంలో నీ తర్వాతే ఎవరైనా. ఆ ఇన్సూరెన్స్‌ విషయాలు తర్వాతగానీ నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకో. మీ మావయ్యలాగే నువ్వు కూడా నీరసంగా కనిపిస్తున్నావు. ఇక రక్తదానాలు తగ్గించు. కాస్త ఉప్మా తిందువుగాని రా. వేడివేడిగా ఉంది’’ అంటూ వంటింట్లోకి వెళ్ళింది పండరి.

‘సర్లే, కబుర్లు చెప్పడంలో నీ తర్వాతే ఎవరైనా. ఆ ఇన్సూరెన్స్‌ విషయాలు తర్వాతగానీ నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకో. మీ మావయ్యలాగే నువ్వు కూడా నీరసంగా కనిపిస్తున్నావు. ఇక రక్తదానాలు తగ్గించు. కాస్త ఉప్మా తిందువుగాని రా. వేడివేడిగా ఉంది’ అంటూ వంటింట్లోకి వెళ్ళింది పండరి.

‘‘నా టిఫిన్‌ అయిపోయిందత్తయ్యా. నేనింకా చాలా చోట్లకెళ్ళాలి. మళ్ళీ హాస్పిటల్‌కి కూడా వెళ్ళాలి’’ అంటూ చెక్కు తీసుకుని వెళ్ళిపోయాడు పురుషోత్తముడు.

‘‘ఎందుకే వాడిని అలా ఆడి పోసుకున్నావు? వాడెప్పుడూ నన్ను డబ్బడగనే లేదు. అది నీకు తెల్సి కూడా అంత మాటనేశావు. పాపం నొచ్చుకునుంటాడు. ఆ ఇన్సూరెన్సులూ హాస్పిటల్‌ వ్యవహారాలూ వాడు చూసుకోబట్టి, నీ మోకాలి ఆపరేషన్‌ సవ్యంగా జరిగిందా లేదా? హెల్త్‌ ఇన్సూరెన్స్‌ గడువైపోతోందన్న సంగతి నేను మర్చేపోయాను. వాడు గుర్తుపెట్టుకుని మరీ వచ్చాడు. వాడు పేరుకు తగ్గట్టు పురుషోత్తముడే. అత్యవసరాలలో ఎంతమందికి రక్తదానం చేశాడు. మీ అన్నయ్యకి ఆ మాయదారి జబ్బేదో వస్తే, ఇరవై ఏళ్ళ వాడు రక్తమివ్వడమే కాకుండా, నాకెంతో ధైర్యం చెప్పి నా చేత కూడా ఇప్పించాడు. అలా మూడు నాలుగుసార్లు నా చేత రక్తదానం చేయించి పుణ్యమొచ్చేలా చేశాడు. కరోనా రోజుల్లోనూ ఇప్పుడూనూ మన మంచి చెడ్డలు చూసిందీ చూస్తోన్నదీ వాడేగా’’ అన్నాడు పట్టాభి.

‘‘రెండేళ్ళపాటు ఆ మహమ్మారి మనుషుల్ని దూరం చేసింది. మనసుల్ని భయంలో బంధించేసింది. బతుకు భయం నా చేత అలా మాట్లాడించిందేమో..? వాడి మనసు కష్టపెట్టాను. వెర్రివెధవ చిన్నతనంలోనే తండ్రి పోయినా నలుగురున్న సంసారాన్ని గుట్టు చప్పుడు కాకుండా లాక్కొస్తున్నాడు. ఏవిటో మన ప్రమేయం లేకుండా కొన్ని అలా జరిగిపోతాయేమో. దూరం పెట్టాల్సింది వ్యాధినిగానీ మనుషుల్ని కాదని ఎప్పుడు
తెలుస్తుందో నాలాంటి వాళ్ళకు. లేవండి, ఆ ఉప్మా కాస్త నోట్లో వేసుకుందాం.

ఈపాటికి అది చల్లారిపోయి ఉంటుంది’’ పశ్చాత్తాపం ముంచుకొచ్చింది పండరికి.

*      *      *

కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు... ‘‘మా సేవా సమితి నుంచి ఫోనొచ్చిందోయ్‌. అర్జంట్‌గా ఎవరికో ‘బి’ పాజిటివ్‌ రక్తం కావాలట. నన్ను హాస్పిటల్‌కి రమ్మన్నారు. పురుషోత్తముడు అక్కడే ఉన్నాడట’’ పండరికి చెప్పాడు పట్టాభి.

‘‘మళ్ళీ రక్తదానమా? వీల్లేదు. ఈ వయసులో రక్తదానాలంటూ ఆసుపత్రుల చుట్టూ తిరగడం మంచిది కాదు. తర్వాత మీ ఇష్టం’’ చొక్కా వేసుకుని బైక్‌ తాళం పట్టుకున్న భర్తని చూసి, ‘‘నా మాటెప్పుడు విన్నారు కనుక- హాయిగా ఆటోలోనో క్యాబ్‌లోనో వెళ్ళమంటే వెళ్ళరు. ఇంకా ఆ బైక్‌ మీదే వెళ్తానంటారు. మీరొచ్చేవరకూ నా భయం నాది. వర్షం రావొచ్చేమో, తడవకుండా చూసుకోండి’’ అంది పండరి.

‘‘నువ్వన్నది నిజమేననుకో. కానీ పురుషోత్తముడికి మాటిచ్చానే. వాడో కరుణామయుడు. ఎప్పుడూ పదుగురి శ్రేయస్సు కోరుతాడు. ఇక నా గురించి అయితే ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. నువ్వనవసరంగా లేనిపోనివి ఊహించుకోకు’’ ఆమెను అనునయించి ఆసుపత్రికి బయల్దేరాడు పట్టాభి.

డాక్టర్‌తో మాట్లాడి బయటకొచ్చిన పురుషోత్తముడికి పట్టాభి ఎదురుచూస్తూ కనిపించాడు.

‘‘మావయ్యా, నేను ఇంటికి వచ్చిప్పుడల్లా అత్తయ్యకి మొహం చూపించలేక కడుపులో గడబిడ అంటూ బాత్‌రూమ్‌లో దూరి, సంబాళించుకురావటం నా వల్ల కావడంలేదు’’ గొంతులో దుఃఖపు జీర
అడ్డుపడింది పురుషోత్తముడికి.

‘‘ఏం చెయ్యమంటావురా, మీ అత్తయ్య అమాయకురాలురా. బొత్తిగా లోకజ్ఞానం లేనిది. ఎంతసేపూ నా గురించి తపన తప్ప, తన గురించి ఏమాత్రం తాపత్రయపడదు. చివరికి మా అబ్బాయిల గురించి కూడా ఆలోచించదు. వాళ్ళను చూసుకోడానికి వాళ్ళ పెళ్ళాలు ఉన్నారంటుంది.

మొత్తం తన ప్రేమనంతా నాకే ఇస్తుందిరా. ముఖానికి ఇంత పసుపు రాసుకుని పెద్ద కుంకుమ బొట్టుతో ముత్తైదువ కళ ఉట్టిపడే మీ అత్తయ్యకు నా అనారోగ్యం గురించి నా అంతట నేను ఎలా చెప్పనురా? ఏ రోజైతే ఈ విషయం మీ అత్తయ్యకు తెలుస్తుందో ఆ రోజు నేను చచ్చిపోయినట్టేరా’’ పట్టాభి గొంతు గద్గదమైంది. కాసేపటికి తేరుకుని, ‘‘ఒరే పురుషోత్తమా, నాకోసం ఎన్నో చేస్తున్నావు. నాకు మరో సహాయమూ చేస్తావా? అది నువ్వే చెయ్యగలవురా. మీ అత్తయ్యకు ఎలాగో అలా చెప్పు. మావయ్య ఓ భయంకరమైన రోగంతో బాధపడుతున్నాడనీ ఆయన రక్తంలో ఎర్రకణాలు బలహీనమై రక్త ప్రవాహం సరిగ్గా జరగదనీ రానురానూ హిమోగ్లోబిన్‌ శాతం తగ్గిపోతుందనీ శరీరానికీ మెదడుకూ కావలిసిన ఆక్సిజన్‌ అందదనీ ఆయనకు తరచుగా రక్తం ఎక్కించాల్సి వస్తుందనీ ఆ విషయం నీ దగ్గర దాచి, ఎవరికో రక్తదానం చెయ్యాలనే మిషతో మావయ్యను ఆసుపత్రికి తీసుకెళ్ళి రక్తం ఎక్కిస్తున్నాననీ కొన్నాళ్ళకు మావయ్య ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్‌ వచ్చి పల్మనరీ హైపర్‌ టెన్షన్‌ వస్తుందనీ అప్పుడు పరిస్థితి విషమించి ప్రాణం మీదకొస్తుందనీ చెప్పి పుణ్యం కట్టుకోరా’’ నీళ్ళు చిప్పిల్లిన కళ్ళతో అంటున్న పట్టాభిని చూసి మ్రాన్పడిపోయాడు పురుషోత్తముడు.

మీ అత్తయ్య అమాయకురాలురా. బొత్తిగా లోకజ్ఞానం లేనిది. ఎంతసేపూ నా గురించి తపన తప్ప, తన గురించి ఏమాత్రం తాపత్రయపడదు. చివరికి మా అబ్బాయిల గురించి కూడా ఆలోచించదు. వాళ్ళను చూసుకోడానికి వాళ్ళ పెళ్ళాలు ఉన్నారంటుంది.

తడి కళ్ళను తుడుచుకుంటూ పట్టాభి, ‘‘ఒరేయ్‌ పురుషోత్తమా, నీకూ నాకూ ఆ దేవుడు ఒకే రకం రక్తాన్నీ ఒకే దృక్పథాన్నీ ఎందుకు ఇచ్చాడంటావు? బహుశా మనమధ్య గతజన్మ బంధమేదో ఉండి ఉంటుంది. అది ఈ జన్మతో తీరిపోతుందేమోరా. ఒకవేళ నాకేదైనా అయితే మీ అత్తయ్యను నువ్వే చూడాలిరా. అంతేకాదు, మన అనాథ సేవా సమితిలోని పిల్లల కోసం పది లక్షలు బ్యాంకులో డిపాజిట్‌ చేశాను. దానికి ట్రస్టీగా కూడా నిన్నే పెట్టాను. ఈ విషయం మీ అత్తయ్యకు తెలీదు. నా తదనంతరం కూడా ఆ పిల్లలకు ఎటువంటి లోటూ రాకుండా నువ్వే చూడాలి’’ నీరసంగా అన్నాడు.

‘‘మావయ్యా, ముందు డాక్టర్‌ని కలిసి, ఆయనేం చెబుతాడో విన్న తర్వాత రక్తం ఎక్కించుకోవాలి. కనుక ఇలా మనసును బాధపెట్టే మాటలొద్దు. కొంచెం నీరసంగా కూడా ఉన్నావు. నీ ఆరోగ్యంకన్నా ఈ అక్కర్లేని అప్పగింతలు ఇప్పుడవసరమా?’’

‘‘ఒరేయ్‌, నాకిప్పుడేమయిందో ఆ తర్వాత ఏమవుతుందో నీకు తెలియదా? ఏదో కొంతమంది అభాగ్యులకు సేవ చేసే అవకాశం నాకిచ్చాడా దేవుడు. తామరాకు మీద
నీటిబొట్టు లాంటిది జీవితం. సుఖాన్నీ దుఃఖాన్నీ ఒకేలా స్వీకరించే స్థితికి చేరాలని నా తాపత్రయం. నేను చేసే కర్మలు మాత్రమే నా విధి రూపంలో అనుభవంలోకి వస్తాయి. అనారోగ్యం నా దృక్పథాన్ని మార్చలేదు. నా రక్తమే కాదు, నా దృక్పథం కూడా పాజిటివే. నేనెప్పుడూ బీ పాజిటివే. నాకు ఎక్కించే రక్తం కూడా ‘బి’ పాజిటివే. అది నాకిప్పుడు చాలా అవసరం కదూ’’ లేని ఉత్సాహాన్ని
ప్రదర్శిస్తూ అన్నాడు పట్టాభి.

పట్టాభిని డాక్టర్‌కు చూపించి రక్తం ఎక్కించడానికి ఏర్పాటు చేసి బయట కూర్చున్న పురుషోత్తం మనస్సు ఆలోచనల్లో మునిగింది. ‘మావయ్యా, నీకు రావాల్సిన జబ్బా ఇది. ఆ దేవుడు నీకూ అత్తయ్యకూ అన్యాయం చేశాడు. నీ అనారోగ్యం అత్తయ్యకు తెలీదనుకుంటున్నావు. నా దృష్టిలో నువ్వే అమాయకుడివి, అత్తయ్య కాదు. అనాథ సేవా సమితి కార్యక్రమాల వంకతో నిన్ను వైద్య పరీక్షలకు తీసుకెళ్ళినప్పుడే అత్తయ్య నన్ను నిలదీసి అంతా తెలుసుకుంది. నీకు రక్తం ఎక్కించడానికి తీసుకొచ్చినప్పుడల్లా అత్తయ్య నీ వెన్నంటే వస్తుందని నీకు తెలీదు మావయ్యా. ఒకరికి తెలిసినది, మరొకరికి తెలియదని మీరిద్దరూ మభ్యపెట్టుకుని ప్రవర్తిస్తుంటే మధ్యలో నేను నలిగిపోతున్నాను’ కళ్ళు మూసుకుని మనసు ఘోషను వింటున్న పురుషోత్తముడి ఎదుట ఎవరో నిల్చున్నట్టు తోచి కళ్ళు విప్పాడు... ఎదురుగా అత్తయ్య.

‘‘పురుషోత్తమా! దూరం నుంచి నువ్వూ మీ మావయ్యా మాట్లాడుకున్నది వినిపించకపోయినా, కనిపించిందిరా. ఆ హావభావాలలో ఆయన ఔచిత్యమూ ఔదార్యమూ నాకు కనిపించాయిరా. మా పెళ్ళైన
దగ్గర్నుంచీ చూస్తున్నారా... ఆ మంచి మనసుని. నేను వీసమంతెత్తు బాధపడినా ఆయన భరించలేరు. నాకే కష్టమూ కలగకూడదనే తాపత్రయంతో తన అనారోగ్యాన్ని కూడా నా దగ్గర దాచేశారు. అది మాత్రం నన్ను చాలా బాధపెడుతోందిరా. నేను ఆయనలో సగమేగా! మరి నా దగ్గర దాపరికమెందుకు? ఆయన అనారోగ్యంతో బాధపడొచ్చుగానీ, నేను మాత్రం ఏమీ తెలియని దానిలా నటిస్తూ నాలో నేను బాధపడాలా... ఇది భావ్యమేనా? భార్యాభర్తల మధ్య వియోగం ఎంత బాధాకరమో ఆయనకు కాస్త చెప్పకూడదట్రా. ప్చ్‌, పోనీలే... ఆయనకేది అనిపిస్తే అదే చేసి తృప్తిపడనీ. నువ్వు మాత్రం ఆయన చేసే పనుల్లో పూర్తి సహకారాన్ని అందించు. ఆయన ఆనందమే నాక్కావలసింది. ఆయనేం చెయ్యదల్చుకున్నా, నేను అడ్డు చెబుతున్నట్టు నటిస్తా. సరేనా... ఆయన జాగ్రత్త’’ వడివడిగా వెళ్ళిపోయింది పండరి.

‘నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన...’ ఎక్కడ్నుంచో పాట వినిపిస్తోంది. ఈశ్వరుడి తలపుకు తలవంచని మనోనిబ్బరాన్ని తనువంతా నింపుకున్న ఆ స్త్రీమూర్తి తపనకు చేతులు జోడించాడు పురుషోత్తముడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు