మా అమ్మే మహారాణి

‘‘ఏమిట్రా మీరంటున్నది?’’ ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది సుజాత. ‘‘తప్పేముందమ్మా, నువ్వు కాస్త ఆలోచించు. శృతి పెళ్ళి అయ్యేవరకు ఓపికపడితే చాలు. ఆ తర్వాత ఆయన దారిన ఆయన వెళ్తారు’’ ప్రణవ్‌ తల్లికి సర్ది చెపుతూ చాలా నెమ్మదైన స్వరంతో లాలనగా అన్నాడు.

Published : 24 Apr 2022 00:33 IST

మా అమ్మే మహారాణి

- రేణుక జలదంకి

‘‘ఏమిట్రా మీరంటున్నది?’’
ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది సుజాత.
‘‘తప్పేముందమ్మా, నువ్వు కాస్త ఆలోచించు. శృతి పెళ్ళి అయ్యేవరకు ఓపికపడితే చాలు. ఆ తర్వాత ఆయన దారిన ఆయన వెళ్తారు’’ ప్రణవ్‌ తల్లికి సర్ది చెపుతూ చాలా నెమ్మదైన స్వరంతో లాలనగా అన్నాడు.
‘‘పెళ్ళిలో పదిమందిలో ఇలాంటి విషయాలు చర్చకు రావడం మంచిది కాదమ్మా. రాజేష్‌ అమ్మగారు ఈ విషయమే అడిగారట. తండ్రి ఉండగా కన్యాదానం ఎవరో
చేయడమేంటని?’’ శృతి తల్లిని అర్థంచేసుకోమన్నట్లుగా అంది.
సుజాత మ్రాన్పడిపోయినట్లు కొడుకునీ కూతురినీ మార్చి మార్చి చూడసాగింది.
‘‘ఇప్పుడు నా పెళ్ళికి దయాకర్‌ బాబాయ్‌ వాళ్ళనో, శకుంతల పెద్దమ్మ వాళ్ళనో పీటల మీద కూర్చుని కన్యాదానం చేయమని అడగాలి. వాళ్ళుమాత్రం ఎన్నిసార్లు మనల్ని అవమానించలేదు చెప్పు? అవన్నీ మనసులో పెట్టుకోకుండా మన అవసరం కోసం ఇప్పుడు అభిమానం చంపుకుని అడగడానికి సిద్ధపడ్డాం. అదేదో నాన్ననే పిలుద్దాం... పదిమందిలో మనకు కూడా గౌరవంగా ఉంటుంది’’ మెల్లని స్వరంతో చెప్తున్నప్పటికీ శృతి స్వరంలో ఓ తీర్మానం చేస్తున్న ధ్వని అయితే సుజాత చెవులను తాకింది.
‘‘నన్ను ఆలోచించుకోనివ్వండి!’’ దగ్గరగా ఉన్న కుర్చీ వైపు నడిచి, భారంగా కుర్చీలో కూలబడింది.
శృతి అన్న వైపు చూసింది. ప్రణవ్‌ చెల్లిని ఏమీ మాట్లాడవద్దన్నట్లుగా మౌనంగా కళ్ళతోనే వారించి, గదిలోంచి బయటకు నడిచాడు. శృతి వెనకే నడిచింది.
కొడుకునీ కూతురినీ వెనుక నుండి చూస్తున్న సుజాత కళ్ళు తన ప్రమేయం లేకుండానే ఇరవై మూడేళ్ళు వెనక్కి గతంలోకి తొంగి చూశాయి.

 

*               *               *

‘‘గవర్నమెంట్‌ జాబ్‌ వదిలేస్తారా?’’ ఏడు నెలల ప్రణవ్‌కు పాలు పడుతూ, భర్త మాటలకు విస్తుపోయినట్లు చూసింది సుజాత.
‘‘అవును. ఎన్నాళ్ళు చేసినా ఎదుగూ బొదుగూ లేని జీవితం. దీనిలోనే ఉంటే ఖర్చులకు కూడా వెతుక్కోవలసి వస్తుంది. అందుకే రిజైన్‌ చేస్తున్నాను’’ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు రాజారావు.
‘‘ఖర్చులు తగ్గించుకుంటే సరి. ఆదాయానికి తగ్గట్లు ఖర్చులు ఉండాలి కానీ...’’ సుజాత తనలో తనే గొణుగుతున్నట్లుగా అంది.
‘‘ఆఁ... ఆ సంగతి నాకు తెలియదులే. పిల్లాడికి పాలూ, ఇంట్లో ఖర్చులూ తగ్గించు చూద్దాం!’’ రాజారావు అంతెత్తున ఎగిరాడు.
‘‘ఇంట్లో ఖర్చులు ఎప్పుడూ ఉన్నవే. పనిమనిషి లేకుండానే చేసుకుంటున్నాను. పసివాడి పాల ఖర్చు ఎక్కువ అనిపిస్తోందా మీకు? ఆదివారం ఫ్రెండ్స్‌తో పార్టీలూ తిరుగుళ్ళూ లేకపోతే ఎంతో తగ్గించినట్లే’’ ఎప్పుడూ అంతకు మించి పెద్దగా మాట్లాడటం అలవాటు లేదేమో, సుజాత స్వరం సన్నగా పలికింది.
‘‘నువ్వు అమ్మగారింటి దగ్గర నుంచి తెచ్చిన మణిమాణిక్యాలు ఏమీ నేను జల్సా చేయడం లేదు. అసలు నీకు ఇవన్నీ
అనవసరం. సంపాదించి తెచ్చేవాడికి తెలుస్తుంది ఆ బాధలేంటో’’ పెద్దగా అరిచాడు.
‘‘అనవసరం అనే కదా... విషయం ఎవరో చెప్పేదాకా నాకు తెలియనివ్వలేదు’’ సుజాత నోటిలోనే సణిగింది. ఆమె స్వరం అంతకు మించి ఎప్పుడూ పెరగదు. తరతరాలుగా స్త్రీలు ఈ స్వరంలోనే మాట్లాడాలని
తీర్మానించినట్లుగా ఆమె ఎప్పుడూ అదే స్వరంతో మాట్లాడుతుంది.
‘‘అయితే ఏమంటావు ఇప్పుడు? సరే, నేను ఇంట్లో కూర్చుంటాను. వెళ్ళి సంపాదించుకుని రా... తెలుస్తుంది’’ అంతెత్తున ఎగురుతున్న భర్తను చూసి,
‘దానికి పై చదువులు ఎందుకే, పెళ్ళి చేసి పంపిస్తే మొగుడు సంపాదించి పెడతాడు’ తన తల్లితో అంటున్న తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆమె మౌనంగా ఉండిపోయింది. ఇంతకు ముందు ఎన్ని వ్యాపారాలు చేసినా ఉద్యోగం వదలి పెట్టకుండా చేశాడు. ఆశతో ఏదో ఒక వ్యాపారం
చేయాలని దిగడం, అందులో చేతులు కాలిన తర్వాత వెనక్కి రావడం అతనికి మామూలే. ఎన్నోసార్లు నచ్చచెప్పాలని చూసినా వినేవాడు కాదు. కానీ, ఇప్పుడు ఏకంగా ఉద్యోగానికి రిజైన్‌ చేయాలని చూడటం సుజాతకు
నచ్చలేదు కానీ, చేయగలిగింది ఏమీ లేక ఊరుకుంది.
రాజారావు ఉద్యోగానికి రిజైన్‌ చేసి, సుజాత నగలన్నీ అమ్మేసి, స్నేహితుడితో రొయ్యల మేత వ్యాపారంలో భాగస్తుడుగా చేరాడు. బాబుకు పదవనెల వచ్చేసరికి సుజాతకు రెండవ బిడ్డ కడుపున పడింది. బాబుతో, వేవిళ్ళతో సతమతమవుతూ ఉందే కానీ, తల్లి పిలిచినా పుట్టింటికి వెళ్ళలేదు. తను ఇంట్లో లేకపోతే భర్త ఆ కాస్త ఇంటిపట్టున ఉండటం కూడా పోతుందనీ, కష్టమైనా ఎలాగోలా
చేసుకుంటాననీ, తొమ్మిదవ నెలలో కాన్పుకి వస్తాననీ తల్లికి నచ్చచెప్పి పంపించింది.
‘‘బాబుకి పాలపొడి అయిపోయిందండీ!’’ చికెన్‌ పకోడీ తెచ్చుకుని బ్రాందీలో
నంజుకుంటూ తింటున్న భర్తను అడిగింది.
‘‘సంవత్సరం పిల్లవాడికి అన్నం పెట్టవచ్చు కదా... పాలు ఎందుకు? అమ్మకు ఫోను చేస్తే కూడా అదే అంది’’ అన్నాడు.
‘‘పని చేసుకోలేకపోతున్నాను. రేపు అమ్మ వస్తానంది. నేను మా ఊరు వెళ్తాను’’.
‘‘అక్కడికి వెళ్ళి కూర్చుని తింటే ఆపరేషన్‌ చేసి బిడ్డను తీయవలసి వస్తుందట.
కనే వరకూ పనులు చేసుకుంటూ ఉంటే సులభంగా కాన్పు అవుతుందని అమ్మ చెప్పింది. తొమ్మిదో నెల వచ్చిన తర్వాత వెళ్ళవచ్చులే’’ గట్టిగా అనేసి, అంతకుమించి మాట్లాడవలసినది ఏమీ లేనట్లుగా తన పనిలో తాను మునిగిపోయాడు.

*               *               *

సుజాతకు తొమ్మిది నెలలు నిండుతాయనగా పుట్టింటికి వెళ్ళింది. శృతి పుట్టిన తర్వాత పది రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకుని, స్నేహితురాలి ఇంటికి వెళ్ళి జాకెట్లు కుట్టడం నేర్చుకోసాగింది.
ఓ నెల రోజులు కూడా గడవకుండానే తల్లితో కలిసి వచ్చిన రాజారావు, సుజాతని తీసుకువచ్చి దిగపెట్టమని అత్తగారికి చెప్పి వెళ్ళిపోయాడు.
తల్లితో కలిసి పిల్లలను తీసుకుని ఇంటికి వచ్చిన సుజాతకు ఇల్లు కొత్తగా కనిపించింది. వంటింట్లో వస్తువులు స్థానాలు మారి ఉన్నాయి. తనకు తెలిసినంత వరకు
రాజారావుకు టీ పెట్టుకోవడం కూడా
చేతకాదు. అన్నీ బయట హోటల్‌కు వెళ్ళి తాగవలసిందే, తినవలసిందే.
తల్లిని-పిల్లల్ని చూసుకోమని, ఇల్లు కాస్త సర్దుకోసాగింది.
బెడ్‌ సర్దుతున్నప్పుడు దిండు కింద
కనిపించిన చిన్న గాజు ముక్క, దువ్వెనలో చిక్కుకున్న వెంట్రుకలూ సందేహం కలిగించినా తను లేనప్పుడు ఎవరైనా బంధువులు వచ్చారేమో అనుకుంది.
భార్యాపిల్లలు వచ్చారని తెలిసినా
పొద్దుపోయి ఇంటికి చేరుకున్న రాజారావుతో, భోజనం చేసి నిద్రపోయే ముందు తన
సందేహాన్ని చిన్నగా వ్యక్తం చేసింది.
‘‘నేను లేనప్పుడు అత్తయ్య కానీ, ఎవరైనా బంధువులు కానీ వచ్చారా?’’
రాజారావు ఉలిక్కిపడటం సుజాత దృష్టిని దాటిపోలేదు.
‘‘ఎవరూ రాలేదే?’’ ముక్తసరిగా అంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు.
సుజాతకు ఇంకేం మాట్లాడాలో
అర్థం కాలేదు.
తల్లి పది రోజులుండి వెళ్ళిపోయింది. రాజారావు కోసం వచ్చిపోయే మనుషుల్ని చూసిన తర్వాత సుజాతకు ఆ పది రోజులకే ఓ విషయం అర్ధమైంది. ఏం చేశాడో కానీ, భర్త బాగా అప్పులపాలయ్యాడు.
పిల్లలను చూసుకోవడంలో నిమగ్నమై కొన్ని విషయాలు ఆలోచించడానికి కూడా సమయం లేనట్లుగా ఉన్న సుజాతకు
ఓ రోజు పక్కింటి ఆవిడ ‘చెప్పాలా వద్దా’ అని చెప్పిన విషయాలు మరింత బాధ
కలిగించాయి.
‘మనసులో ఉంచుకో సుజాతా. జాగ్రత్తపడతావని చెప్తున్నా. నువ్వు లేనప్పుడు
మీ ఆయన ఓ ఆవిడను ఇంటికి తీసుకుని వచ్చాడు. పెద్దమ్మ కూతురని చెప్పాడు. నాలుగు రోజులకు- మాకు వారి వాలకం తేడాగా అనిపించి, మా ఇళ్ళ మధ్య ఇలాంటి పనులు చేస్తే మర్యాదగా ఉండదని
హెచ్చరించాం. నువ్వు వచ్చే నాలుగు రోజుల ముందే ఆమె వెళ్ళిపోయింది. తగాదా
పెట్టుకోకు. కానీ జాగ్రత్త పడు!’
సుజాత పిల్లలకు అన్నం పెట్టి పాపకు పాలిచ్చి నిద్ర పుచ్చిందే కానీ, స్థిమితంగా ఉండలేకపోయింది. ఏదో మనసును కలచి వేస్తున్నట్లుగా బాధా, కోపమూ, తన మీద తనకే జాలీ కలగాపులగమై ఆమెను ఆకలికీ నిద్రకూ దూరం చేశాయి. భర్తను అడిగితే ఎంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తాడో తెలుసు. కానీ, అడగాలి. ఏమని అడగాలి? ఆలోచిస్తోంది. అనాలనుకున్న మాటలు వల్లె వేసుకుంటోంది. ఎందుకు భయపడాలి? తప్పు చేసిన వారు భయపడాలి, తనకేం భయం?
కానీ ఆమెకు అలా అతన్ని నిలదీసే అవకాశమే ఇవ్వలేదు అతను. పక్కింటి రుక్మిణి పరుగు పరుగున ఆందోళనగా వచ్చి చెవిలో వేసిన మాట ఆమె గుండెను బద్దలు చేసింది.
‘‘మీ ఆయనా, పక్క వీధిలో టిఫిన్‌ సెంటర్‌ ఆవిడా ఇద్దరూ కలసి ఎక్కడికో
వెళ్ళిపోయారట. ఇద్దరూ కలసి అప్పులు
చేశారని చెప్పుకుంటున్నారు’’.
భర్తలో ఎన్ని అవలక్షణాలు ఉన్నా ఇంత పని చేస్తాడని మాత్రం ఊహించలేదు.
ఆదమరచి అమాయకంగా నిద్రపోతున్న పసిపిల్లల వైపు చూసింది. ‘రేపు..?’ ఈ మాట తలచుకుంటేనే కాళ్ళు గజగజ వణకసాగాయి. కళ్ళ వెంబడి నీళ్ళు కారిపోతుంటే నిర్వికారంగా, నిస్తేజంగా చూస్తున్న సుజాతను చూసి రుక్మిణి చలించిపోయింది. ధైర్యం చెప్పి, సుజాత తల్లిదండ్రులకు ఫోను చేసి పిలిపించి, ఆమెను వారికి అప్పగించి వెళ్ళిపోయింది.
ఇంటి కాగితాలు తనఖా పెట్టించుకుని అప్పు ఇచ్చినవారు సుజాత పరిస్థితి చూసి జాలిపడి ఇల్లు ఖాళీ చేయడానికి ఓ నెల రోజులు గడువు ఇచ్చి వెళ్ళిపోయారు.
అప్పులవాళ్ళు నానాతిట్లు తిట్టి తిట్టి
అలసిపోయి, చుట్టుపక్కలవారు సర్దిచెప్పడంతో వెళ్ళిపోయారు.
అత్తగారికీ ఆడపడుచుకూ కబురు పెట్టినా పట్టించుకోకపోవడంతో, పది రోజుల్లోనే
ఇల్లు ఖాళీ చేసి సుజాత ఇద్దరు పిల్లలతో పుట్టింటికి చేరింది.
తల్లిదండ్రులకు సుజాత జీవితం
ప్రశ్నార్థకంగా మారింది. అత్తెసరు చదువుతో ఏం చేసి ఇద్దరు పిల్లలను పోషించగలదు? తాము ఉన్నంత వరకూ తమకు వచ్చే
పెన్షన్‌తో ఎలాగోలా నెట్టుకురాగలరు. తమ తదనంతరం సుజాత పరిస్థితేంటి? రిటైర్‌ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో సుజాతకు బంగారం పెట్టి వీలైనంత ఘనంగా పెళ్ళి చేశారు. అల్లుడు ప్రభుత్వ ఉద్యోగస్తుడు. కూతురి జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్నారు. అల్లుడు కూతురిని బాధపెడుతున్నా, తప్పదు కదా... అని తప్ప ఆలోచించని సగటు మనుషులు వారు. ఇప్పుడు ఉన్న పళాన ఇంత కష్టం..!
కన్న హృదయాలు సుజాత గురించి
ఆలోచిస్తుంటే... సుజాత తల్లి హృదయం పిల్లల గురించి ఆలోచించసాగింది.
ఏం చేయాలి, ఏం చేయాలి,
ఏం చేయాలి..?
విచిత్రంగా ఆమె మనసు తనను వదలి వెళ్ళిన భర్త గురించి ఒక్క క్షణం కూడా
ఆలోచించడం లేదు. పిల్లల పోషణ, వారి చదువుల కోసం ఏం చేయాలి..? ఇదే
ఆలోచన. పుట్టి పెరిగిన ఈ ఇరవై అయిదు ఏళ్ళలో తనను తాను పోషించుకోవడానికి అవసరమైన విద్యే తను నేర్చుకోలేదా? తన పదవ తరగతి చదువు తనకు ఉద్యోగాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఇంకేమీ చేయలేదా?
‘‘ఏమైనా మన సుజాత చేసిన పచ్చళ్ళ ముందు బిర్యానీలు కూడా దిగదుడుపే!’’ తండ్రి భోజనం చేస్తూ మెచ్చుకుంటుంటే సుజాతకు చటుక్కున ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవుగా తల్లిదండ్రులతో
తన ఆలోచన చెప్పింది.
‘‘నువ్వు కష్టపడతావా తల్లీ? నేను ఉన్నంతవరకు నీకూ నీ పిల్లలకూ ఏ కష్టం రానివ్వను’’ తండ్రి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.
‘‘ఆడపిల్ల గడప దాటకూడదు, కష్టం
చేయకూడదు. కాలానుగుణంగా తండ్రీ భర్తా కొడుకూ పోషణలోనే ఉండాలని నియమం ఉందా నాన్నా? అలాంటి నియమాలే కదా నన్ను ఈ రోజు ఈ స్థితిలో నిలబెట్టాయి. ఇప్పటికైనా నన్ను నా కాళ్ళమీద బతకనివ్వండి’’ సుజాత కచ్చితంగా చెప్పింది.
బజారు నుండి అవసరమైన సరుకులు తెప్పించింది. మొదట కొద్ది మోతాదులో పచ్చళ్ళు పెట్టి చిన్న చిన్న శాంపిల్‌ ప్యాకెట్లు చేసి షాపులలో ఇచ్చి వచ్చింది.
‘‘వద్దమ్మా, ఉన్న పచ్చళ్ళే అమ్ముడుకాక చస్తున్నాం’’ షాపు యజమాని విసుగ్గా అన్న మాటలకు, చిరునవ్వుతో-
‘‘ఎప్పుడైనా అవసరం అయితే చెప్పండి’’ అని ఫోన్‌ నంబర్‌ ఇచ్చేది.
క్రమేణా చిన్నచిన్న ఆర్డర్లు రాసాగాయి. పచ్చళ్ళతోపాటు భోజనాలు వండి
ఉద్యోగస్తులకు క్యారియర్లు ప్యాక్‌ చేసి
పంపించడం ప్రారంభించింది. నాణ్యమైన
సరుకులతో జాగ్రత్తగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకునేది.
రాముడితోపాటు రావణాసురులూ సుమిత్రతోపాటు శూర్పణఖలూ పుట్టిన నేల ఇది. అలాంటివారు ఎదురైనా చాలా మర్యాదగా సమాధానం ఇచ్చేది.
ఆ ఓర్పు రావడానికి కారణమైన భర్తకు మనసులోనే ఓ నమస్కారం పెట్టేది.
క్యాటరింగ్‌ నుండి పెద్ద హోటల్‌ పెట్టే స్థాయికి ఎదిగింది. పనిచేసే వారినీ
నమ్మకస్తులనూ పెట్టుకుంది అనేకంటే ఆమె మంచితనంవల్ల వారే నమ్మకస్తులుగా అయ్యారు అనడం సమంజసమేమో.
దూరమైన బంధువులు దగ్గరయ్యారు.
పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. తల్లిదండ్రులు కాలగర్భంలో కలిసిపోయారు. రాజారావు ‘ఆమె’తో కలసి ఎక్కడ ఉంటున్నాడో తెలిసినా సుజాత పట్టించుకోలేదు. ఎవరైనా
చెప్పేందుకు ప్రయత్నం చేసినా ‘అతని’
ప్రస్తావన వద్దని నిష్కర్షగా చెప్పేది.
ప్రణవ్‌, శృతి ఇద్దరూ చదువులో తెలివిగలవారే! చదువులు పూర్తి కావడంతోనే ఉద్యోగంలో చేరారు. శృతి తన ఆఫీసులో పని చేసే కొలీగ్‌ రాజేష్‌ ప్రపోజ్‌ చేశాడని చెప్పడంతో, వారితో మాట్లాడింది. వియ్యంకుల వారితో రాజారావు విషయం కూడా చెప్పింది. పెళ్ళికి ముహుర్తాలు కూడా పెట్టుకున్నారు. పూజారి ‘కన్యాదానం ఎవరు చేస్తున్నారు?’ అని అడగడంతో వచ్చిన సమస్య ఇది.
ప్రణవ్‌, శృతి తమ తండ్రిని తీసుకువచ్చి కన్యాదానం చేయిస్తే, శృతి అత్తగారి తరపు బంధువులలో ఎలాంటి చిన్నతనం ఉండదు కదా- అని ఆలోచిస్తున్నారు.

*               *               *

సుజాత ఇంటిలో శృతికి కాబోయే అత్తమామలూ, సుజాత మేనమామ కొడుకు దయాకర్‌ దంపతులూ, పెద్దమ్మ కూతురు శకుంతల దంపతులూ ఆశీనులై ఉన్నారు.
‘‘ఇదంతా అమ్మకు మతి ఉండే చేస్తుందా అన్నయ్యా? ఏదైనా, మాట్లాడుకుని మనమే తేల్చుకోవాలి కానీ, వీళ్ళందరినీ ఎందుకు పిలిచినట్టు?’’ శృతి వంటింట్లో కాఫీ కప్పులలో పోస్తూ బాధపడింది.
‘‘చూద్దాం, అసలు వారిని ఎందుకు పిలిచిందో?’’ ప్రణవ్‌ సాలోచనగా అన్నాడు.

 

*               *               *

‘‘నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిన విషయం మీ అందరికీ తెలుసు. ఇన్నాళ్ళుగా ఆ మనిషి సహకారం లేకుండానే నేను నా పిల్లలను పోషించాను, చదివించాను. ఎప్పుడూ కూడా అతని అవసరం నాకు వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు ఇన్నాళ్ళకు, ఇన్నేళ్ళకు
కన్యాదానం పేరుతో అతని అవసరం నాకు ఉందని చెప్తున్న నా పిల్లల అమాయకత్వానికి నాకు నవ్వు వస్తోంది. కాస్త బాధగా కూడా ఉంది. అందుకే మీతోనే మాట్లాడాలని పిలిపించాను. నడక కూడా సరిగా రాని పసికందుల్నీ, అమాయకంగా తనను నమ్మి పుట్టింటివారు ఇచ్చిన ఆస్తినీ బంగారాన్నీ ఆయన చేతిలో పెట్టిన నన్నూ, నిలవనీడ కూడా లేకుండా చేసి పోయిన అతనికి తండ్రి హోదాలో కన్యాదానం చేసే అర్హత ఉందంటారా?’’

‘‘అదికాదు సుజాతా, భార్యాభర్తలిద్దరూ పీటల మీద కూర్చుని కన్యాదానం చేయడం మన సంప్రదాయం’’ దయాకర్‌ చెప్పబోయాడు.
‘‘ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పిల్లల్ని పెంచి పోషించడం సంప్రదాయం కాదా? తన బాధ్యతను తను సక్రమంగా నిర్వహించని వ్యక్తికి ఈ హోదా ఇవ్వడం అవసరమా? సంప్రదాయం కోసం మనసు చంపుకుని అతని పక్కన కూర్చుని కన్యాదానం చేయాలా?’’
‘‘నువ్వు ఇంత బాధపడతావని
అనుకోలేదమ్మా. దయాకర్‌ బాబాయో,
శకుంతల పెద్దమ్మో చేస్తారు. వదిలెయ్‌’’ ప్రణవ్‌ అడ్డువచ్చాడు.
‘‘అంటే..? నాకు కన్యాదానం చేసే
అర్హత లేదా? అర్హత లేని ఆ వ్యక్తి పక్కన
కూర్చుంటేనే ఆ అర్హత వస్తుందా?’’
అందరివైపూ సూటిగా చూసింది.
‘‘నువ్వు ఒక్కదానివే పీటల మీద
కూర్చుని కన్యాదానం చేస్తావా?’’ శకుంతల
నివ్వెరపోయింది.
‘‘అవును’’ సుజాత ముఖంలో నిశ్చయం కనిపించింది.
‘‘నేను ఒక్కదాన్నే పిల్లల్ని పోషించినప్పుడు లేని అభ్యంతరం... నేను ఒక్కదాన్నే కన్యాదానం చేయడానికి ఎందుకు? తల్లీ, తండ్రీ అవసరమైన ప్రతి కార్యంలో నేను ఒక్కదాన్నే చేస్తాను. మీరు మీ అభిప్రాయం చెప్పండి. అలా వీలుకాని పక్షంలో పిల్లలు ఎటూ
ఇష్టపడ్డారు కాబట్టి రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేద్దాం, ఆలోచించుకుని చెప్పండి’’ మర్యాదగానే అయినప్పటికీ కచ్చితంగా చెప్పింది.
యాభై ఏళ్ళ తల్లినీ, ఆమె మాటలలోని సత్యాన్నీ నిశితంగా అప్పుడే గమనిస్తున్నట్లుగా చూస్తోంది శృతి.
తను ఇలా ఎందుకు ఆలోచించలేకపోయింది? ‘ఎవరో ఏదో అనుకుంటారనో, అత్తగారి తరఫువారు ఏమైనా అనుకుంటారేమో, కాబోయే భర్త చులకన చేస్తాడేమో’ అని ఎందుకు అనుకుంది? పదవ తరగతి చదివిన తల్లికి ఉన్న జ్ఞానం తనకు లేకపోయిందా?
ఆమె దృష్టి గోడ మీద ఓ పద్ధతి ప్రకారం తగిలించబడి ఉన్న ఫొటోలపై పడింది.
తను పెద్ద మనిషి అయినప్పుడు అక్షింతలు వేస్తున్న తల్లి... స్కూల్‌ ఫస్ట్‌ వచ్చినందుకు తనతోపాటు బహుమతి అందుకుంటున్న తల్లి... తను గ్రాడ్యుయేషన్‌ పట్టా తీసుకుంటున్నప్పుడు పక్కనే నిలుచుని గర్వంగా చూస్తున్న తల్లి... అంతటా తానై ఉన్న తల్లి. రేపు పెళ్ళిలో కూడా అంతా తానే అయి ఉంటుంది. అది ఇష్టమైతేనే ముందుకు వస్తారు పెళ్ళివారు, లేకపోతే లేదు. ఎవరు అవునన్నా కాదన్నా- మా అమ్మే మహారాణి... శృతి మనసులో గట్టి నిశ్చయం.
అప్పటి వరకూ మబ్బులచాటున దాక్కున్న సూర్యుడు బయటకు రావడంతో వెలుగు రేఖలు జగమంతా పరచుకున్నాయి. అజ్ఞానం అనే అంధకారంలో నుంచి అప్పుడే బయటకు వస్తున్నందువల్లేమో శృతి కళ్ళలో ఆ వెలుగు రేఖలు పడి ఓ మెరుపు మెరిసింది. ఆ మెరుపుతోపాటు ఆమె కళ్ళలో సన్నగా నీటి జీర!
కూతురి కళ్ళలో ఆ మెరుపును స్పష్టంగా చూసిన సుజాత కళ్ళలో తన కష్టం ఫలించిన చెమరింపు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..