Published : 26 Jun 2022 00:16 IST

వ్యక్తావ్యక్తం

- ఉమా మహేష్‌ ఆచాళ్ళ

పోయిన అత్తగారి కోసం కోడలి ఏడుపులా వర్షం ఆగాగి కురుస్తోంది.

‘‘ఆనందూ, పదకొండవుతోంది. రేపు పరీక్ష హాల్లో నిద్రొస్తే కష్టం. తెల్లవారుజామున లేపుతాను. ఇక పడుకో’’ అని హరికేన్‌ లాంతరు వత్తి తగ్గించి, కింద చాప మీద బొంత పరుచుకుంది లక్ష్మి. ఆనంద్‌ పుస్తకం పక్కన పెట్టి అమ్మ పక్కనే వేసుకున్న మడతమంచం మీద వాలాడు.

‘‘ఇంత కష్టపడి చదువుతున్నావు, పెద్దయ్యాక ఏమవుతావురా?’’ అడిగింది చూరులోంచి ఆకాశం వైపు చూస్తూ. అలా చూసినప్పుడు ఆకాశం అప్పడాల్లా, వెండి మేఘాలు ఒత్తుల్లా కనిపిస్తే అది ఆమెలోని భావుకతారాహిత్యం కాదు. బతుకు తెరువుకి రోజూ పన్నెండు గంటలు అవే చెయ్యటం వల్ల వద్దన్నా గుర్తొచ్చే అధిక పని ప్రభావం.

‘‘ఏమవుతానో చెప్పలేను కానీ, ఏంచెయ్యాలనుకుంటున్నానో చెప్పగలనమ్మా.’’

‘‘ఏంటో అది’’ ఉత్సాహంగా కొడుకువైపు తిరిగి అడిగింది లక్ష్మి.

‘‘నీ పుట్టినరోజు గ్రాండ్‌గా చెయ్యటం, ప్రైస్‌ ట్యాగ్‌ చూడకుండా నీకు నచ్చిన చీర కొనటం, ఒక్కసారైనా నిన్ను విమానం ఎక్కించటం.’’

ఆ మాటలు వింటుంటే వాడు మూడు నెలల పసిగుడ్డుగా ఉన్నప్పుడు ఆక్సిడెంట్‌లో పోయిన భర్త గుర్తొచ్చాడామెకి. అతను కూడా అంతే ప్రేమగా మాట్లాడేవాడు. వర్షించే కళ్ళు కొడుకు పరీక్షలకి అడ్డం కాకూడదని అటు తిరిగింది లక్ష్మి.

ఆ క్షణం వాళ్ళిద్దరికీ తెలియదు... ఒకసారి కొడుకు పెళ్ళయ్యాక ఇలాంటి చిన్నచిన్న విషయాలపై కూడా నిర్ణయాధికారం థర్డ్‌ పార్టీ చేతుల్లోనే ఉంటుందని.

* * * * *

‘‘నాన్నా బంగారం, నువ్వు పంపిన కుర్తీ అందిందిరా. నా సైజు, నాకిష్టమైన కలర్‌ నీకెలా తెలిశాయి నాన్నా. ఇక్కడా ఉన్నారు కొంతమంది, ఎందుకూ, అన్నీ చేయించుకుంటారు కానీ, కనీసం ‘హ్యాపీ బర్త్‌డే’ అని చెప్పటానికి కూడా నోరు రాదు వాళ్ళకి. టైముకి తిను నాన్నా. పొడులూ పచ్చళ్ళూ ఏవైనా కావాలంటే చెప్పు కొరియర్‌ చేస్తాను. ఓకే బంగారం, ఉంటాను. జాగ్రత్త’’ అంటూ తన పుట్టిన రోజుకి కొడుకు పంపించిన కుర్తీ చూసుకుని మురిసిపోతూ గాల్లో తేలిపోతోంది కస్తూరి.

బాల్కనీలో పేపర్‌ చదువుతున్న ఆనందరావు నిర్లిప్తంగా నవ్వుకున్నాడు.

* * * * *

‘‘బావా, ఇడ్లీకి చట్నీ మేండేటరీ. అదే చట్నీ ఉప్మాకి ఆప్షనల్‌. అలాగే కొడుక్కి తల్లి రెస్పాన్సిబిలిటీ అయితే కోడలికి ఆబ్లిగేటరీ. ఇది ప్రతి ఇంట్లోనూ ఉండేదే. సర్దుకుపోవాలి తప్ప దీన్నేదో జాతీయ సమస్యలా చూడకు’’ అన్నాడు ఆఫీస్‌ క్యాంటీన్‌లో టీ తాగుతూ సుబ్రహ్మణ్యం.

‘‘అదేంట్రా అలా అంటావు. నాకు మూడు నెలల వయసప్పుడు మా నాన్న పోతే, నానా కష్టాలూ పడి ఒంటరిగా నన్ను పెంచింది మా అమ్మ. అలాంటిది ఆమె ఇప్పటికీ ఒంటరిగానే ఉంటోంది. ఉద్యోగం వచ్చిన నెలలోనే మళ్ళీ ముహూర్తాలు లేవని, కస్తూరి వాళ్ళ పేరెంట్స్‌ కంగారుపెడితే నా పెళ్ళి చేసింది. అదే నెల వేరు కాపురం. ఆ రకంగా కనీసం మొదటి నెల జీతం కూడా అమ్మ చేతికి ఇవ్వలేకపోయాను. ఆవిడ కూడా ఈ రోజుకీ ఏమీ ఆశించింది లేదు. అలా అని పూర్తిగా వదిలేయలేనుగా. మా అమ్మని బాగా చూసుకోవటం తప్ప నాకు పెద్ద పెద్ద కోరికలేం లేవు’’ అన్నాడు ఆనందరావు బాధగా.

‘‘ఆవిడ పెద్దావిడ. ఎక్కడో అక్కడ బానే ఉన్నారు కదా. నీ కుటుంబం, పిల్లలూ ముఖ్యం కదా’’ అన్నాడు సుబ్బు.

‘‘అదేం వాదనరా. కస్తూరి కూడా అంతే. ఇదంతా ఓ ప్రవాహమట. మన పేరెంట్స్‌ మనకోసం కష్టపడితే, మనం మన పిల్లల కోసం కష్టపడాలి తప్ప మళ్ళీ వెనక్కి చూడకూడదట. మొక్కలకి నీరు అవసరం కానీ చెట్టుకి అవసరం లేదట.

ఈమధ్య వరుసగా వేపచెట్లన్నీ ఎండిపోతూ ఉంటే వాటికి కొద్దిగా నీరుపోస్తే మళ్ళీ చిగురిస్తున్నాయని ఓ పెద్దాయన చెప్పటం పేపర్లో నువ్వూ చదివే ఉంటావుగా. ఇప్పుడు చెప్పరా చెట్టుకి నీరు పొయ్యటం అనవసరమా. అవి అడక్కపోయినా, పైకి చెప్పకపోయినా, ఓ చెంబెడు నీరు పోస్తే వాటికీ ఆయుష్షు పెరుగుతుందిగా. అయినా బానే ఉండటం అంటే బతికుండటం కాదు కదరా. మాతో, మాలో ఒక వ్యక్తిగా ఉండాలిగా. ఈ వయసులో ఆమె ఒంటరిగా ఊళ్ళో ఉండటం ఒక్కగానొక్క కొడుకుగా నాకు గిల్టీగా ఉంటోంది. నీకో విషయం తెలుసా... ఓ రకంగా ఇది జాతీయ సమస్యే’’ అన్నాడు ఆనంద్‌ కొంచెం ఆవేశంగా.

‘‘అదెలా?’’

‘‘మగాడు ఇరవైల్లో చదువూ ఉద్యోగవేటలో ఉంటాడు. ముప్ఫైల్లో కెరీర్‌, పిల్లలూ; నలభైల్లో ఇల్లూ, ఈఎంఐలూ. సొసైటీకి తిరిగి ఏమైనా చెయ్యాలంటే అది ఏభైల్లోనే సాధ్యం. అదే టైమ్‌లో తల్లిదండ్రులు కూడా డెబ్భైలు దాటతారు కాబట్టి కొడుకు అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి వయసులో ఇంట్లో మనశ్శాంతి లేకపోతే తిరిగివ్వటం మాట అటుంచి పరగడుపునే ల్యాబ్‌ల చుట్టూ తిరగాల్సొస్తుంది.’’

‘‘నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావురా.’’

‘‘లేదురా. అక్కడ మా అమ్మా, ఇక్కడ కస్తూరీ బానే ఉండి ఉండొచ్చు. కానీ నన్ను మాత్రం నిత్యం వేధిస్తున్న సమస్య ఇది. కస్తూరి నీ కజిన్‌ కాబట్టీ, నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండ్‌ కాబట్టీ చెబుతున్నా. పెళ్ళికి విఘ్నేశ్వరుడి బియ్యం కూడా అంత ముందుగా కట్టరేమో. తన బర్త్‌డే వస్తే ఆర్నెల్లు ముందునుంచీ హడావుడి మొదలవుతుంది. మేచింగ్‌తో సహా చీర మూడు నెలల ముందే రెడీ చేసుకోవటం, ఆ రోజు ఎవర్ని పిలవాలీ, ఎవర్ని పిలవకూడదూ, రిటర్న్‌ గిఫ్ట్‌ ఏమి కొనాలి, పోయినేడు ఎవరు ఏమిచ్చారు, వాటి విలువెంత... ఇలా ఎక్సర్‌సైజు నడుస్తుంది.

ఇలా మీ చెల్లి ఎంతసేపూ ‘నేనూ, నా బర్త్‌డే, నా పిల్లలూ, నా ఇల్లూ’ అంటూ సెల్ఫ్‌ సెంట్రిక్‌గా ఉంటోంది. అదేం తప్పని అనటం లేదు. కానీ మా అమ్మ విషయం వచ్చేటప్పటికి దేనికీ ఒప్పుకోదు. ‘మన దగ్గరే ఉంచుకుందాం’ అంటే, ‘మీకేం మీరు క్యాంపులంటూ ఊర్లమ్మట తిరుగుతారు. నేను చాకిరీ చెయ్యలేను’ అంటుంది. పండక్కో పుట్టినరోజుకో ఓ చీర కొనాలంటే ఇంత అని ఆ ధర దాటకూడదు. కనీసం ఎల్‌టీసీలోనైనా అమ్మని ఒక్కసారి విమానం ఎక్కిస్తాను అంటే ‘నేను రాను, కావాలంటే మీరు వెళ్ళండి’ అంటుంది. తనకి ఇష్టం ఉండదని తెలిసి అమ్మే ‘నేను రాలేనురా’ అంటుంది. అమ్మ పుట్టినరోజు ఒక్కటైనా సర్‌ప్రైజ్‌గా జరుపుదాం అంటే, ‘నేనంటే చిన్నదాన్ని. పెద్దావిడ ఆవిడకెందుకు ఇలాంటివి’ అంటుంది. బంగారం మా అమ్మ పేరులోనే కానీ ఒంటిమీద చూసింది లేదు. ఇంతవరకూ మా అమ్మకి ఒక్క గ్రాము బంగారం కొన్నది లేదు. అదేమంటే ‘ఆవిడకెందుకూ ఈ వయసులో’ అంటుంది’’ అన్నాడు ఆనంద్‌- మంచినీళ్ళు కొద్దిగా తాగి గ్లాసు టేబుల్‌పై పెడుతూ.

‘‘బావా, నువ్వు చెప్పింది నాకు అర్థమవుతోంది. చిన్నప్పుడు ఎక్కువగా మా బాబాయ్‌ వాళ్ళింట్లోనే ఉండేవాడిని. కస్తూరి గురించి నాకు బాగా తెలుసు. కస్తూరి పుట్టినప్పుడు ఏడవలేదు. డాక్టర్లు తలకిందులుగా తిప్పి గిల్లినా సరే ఏడవలేదు. కంగారుపడ్డారు. ఓ పది నిమిషాల తర్వాత నర్స్‌ జేబులో పక్క రూమ్‌ వాళ్ళిచ్చిన చాకొలేట్‌ బాక్స్‌ తాలూకు గిఫ్ట్‌ రేపర్‌ కస్తూరి చేతికి తగిలితే అప్పుడు నవ్వింది. అందరూ హాయిగా ఊపిరి తీసుకున్నారు. లేకలేక పుట్టిన పిల్ల కావటంతో మొదటి బర్త్‌డే చాలా గ్రాండ్‌గా చేశారు. అంతమంది ఒక్కసారిగా కొట్టిన చప్పట్లు ఆమె మనసులో బలంగా నాటుకుపోయాయి. ఆ తర్వాత ప్రతి పుట్టినరోజూ అంతే గ్రాండ్‌గా జరిగింది. వాళ్ళింట్లో కస్తూరి వీఐపీ అయ్యింది. అలా పుట్టినరోజు ఆమెకి ఓ అబ్సెషన్‌’’ అంటూ ఉండగా,

‘‘సుబ్బూ, ఇక్కడ సమస్య కస్తూరి పుట్టినరోజు జరుపుకోవటం గురించి కాదు. తన గురించి తాను అంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు, మా అమ్మ గురించి- కనీసం నా గురించి- కొంచెమైనా అలోచించాలి కదా. సరే వదిలేయ్‌, నువ్వు మాత్రం ఏం చేస్తావు. నా తిప్పలేవో నేను పడతాను’’ అంటూ లేచి తన సీట్‌లోకి వెళ్ళిపోయాడు ఆనందరావు. చేసేదేంలేక సుబ్రహ్మణ్యం కూడా తన సెక్షన్‌కి వెళ్ళిపోయాడు.

* * * * *

కస్తూరి దిగులుగా కూర్చుంది. ఆరోజు తన పుట్టినరోజు. పోయినేడు భర్త పోవటంతో చేసుకోలేదు. ఓ ఏడు పోతే మూడేళ్లు పోతుందంటారు- ఇదేనేమో. ‘బర్త్‌డే బ్లూస్‌’తో ఆమెకి దుఃఖం తన్నుకొస్తోంది. భర్త ఫొటోకేసి చూసింది. నవ్వుతున్నాడు. బాగా అయ్యిందనేమో. పిల్లలిద్దరూ ఫోన్లు చెయ్యలేదు. గిఫ్టులేవీ పంపలేదు. పోతూ పోతూ ఆయనగానీ పిల్లల్లో దూరాడా అనే అనుమానం భయంగా మారి కోపంగా ముగిసింది. ఒక్క క్షణం ఆ ఫొటో తీసేసి అటక మీద దాచేద్దామనిపించింది. టైమ్‌ చూసింది. సాయంత్రం నాలుగు. పోనీ కొడుకులకి తానే ఏదో వంకతో ఫోన్‌ చేసి విషెస్‌ చెప్పించుకుందామా అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ తెల్లవారుజామో అవుతుంది. లేపితే విసుక్కుంటారు.

అంతలో బెల్లు మోగితే పనిమనిషి అయ్యుంటుందని నిరాశగా వెళ్ళి తెలుపు తీసింది. ఎదురుగా సుబ్రహ్మణ్యం.

‘‘రా అన్నయ్యా, చాలా రోజులైంది నిన్ను చూసి’’ అంటూ తప్పుకుని లోపలికి ఆహ్వానించింది.

సుబ్బు చేతిలో బట్టల కవర్‌ చూడగానే చిన్న ఆశ- ఏదైనా గిఫ్ట్‌ తెచ్చాడేమోనని. అయినా చిన్న అనుమానం. ఒకట్రెండుసార్లు వాడు ఏదో సర్ది చెప్పబోతే తను వారించి మాట్లాడటం మానేసింది.

అతను వస్తూనే ‘‘నీకు పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా’’ అంటూ కవర్‌లోంచి చీర తీసి ఇచ్చాడు. అది చూడగానే ఆమె చిన్నపిల్లలా సంతోషపడింది.

‘‘థాంక్స్‌ అన్నయ్యా. ఈరోజు ఇక్కడే భోంచేసి వెళ్ళాలి’’ అంది.

‘‘పిల్లలు ఫోన్‌ చేశారా కస్తూరీ?’’ అడిగాడు సుబ్బు.

‘‘లేదన్నయ్యా, ప్రతీ ఏడూ, నా పుట్టినరోజుకి ఇద్దరూ ఏదో ఒక గిఫ్ట్‌ పంపిస్తూనే ఉండేవారు. పొరుగూరులో చదువుతున్నప్పుడూ ఉద్యోగం చేస్తున్నప్పుడూ ఆఖరికి అమెరికా వెళ్ళాక కూడా. ఇదిగో మీ బావ పోయి పిల్లల మీద వాలాడో ఏమిటో వాళ్ళు కూడా నన్ను పట్టించుకోవటం మానేశారు’’ అంది కళ్ళు తుడుచుకుంటూ.

‘‘బావ పోయాక వాళ్ళమీద వాలటం కాదమ్మా, ఉన్నప్పుడే వాలాడు, ఇప్పుడు వాలడానికి లేకుండా పోయాడు’’ అన్నాడు సుబ్బు.

అర్థం కానట్టు చూసింది కస్తూరి.

‘‘నీ కొడుకులిద్దరూ ప్రతీ ఏటా క్రమంతప్పకుండా నీకు బర్త్‌డే విషెస్‌ చెప్పటం, గిఫ్ట్‌ పంపటం వెనుక మీ ఆయన కష్టం నాకు తెలుసమ్మా’’ అన్నాడతను బాధగా. ‘‘అంటే’’ అనుమానంగా అడిగింది కస్తూరి.

‘‘వాడే గిఫ్ట్‌లు కొని పిల్లలకిచ్చి నీకివ్వమని చెప్పేవాడు. వాళ్ళ హడావుడిలో వాళ్ళుండి ఒక్కోసారి విసుక్కునేవాళ్ళు. ‘ఏంటి డాడీ ఇదంతా. నువ్వే ఇవ్వొచ్చుగా’ అనేవాళ్ళు. దానికి వాడు, ‘నేనిస్తే అది బాధ్యతరా. మీరిస్తే ప్రేమ. మీ అమ్మకి నేనివ్వటంకంటే మీరిస్తేనే ఎక్కువ సంతోషం’ అనేవాడమ్మా. వాడు ఇదంతా చేసింది నువ్వు మారాలని కాదు. ఓ తల్లికి జరిగిన లోటు మరో తల్లికి జరక్కూడదని. నీ కొడుకులు వ్యక్తపరిచినదంతా ప్రేమా కాదు, వాడు వ్యక్తపరచనంత మాత్రాన ప్రేమ లేదనీ కాదు. అనారోగ్యంలో కూడా పిల్లలతో ‘మీ అమ్మ వట్టి బోళా మనిషి. జాగ్రత్తగా చూసుకోండిరా’ అని చెప్పేవాడు. తను పోతే పిల్లలు పట్టించుకోరేమో అని ప్రతీ ఏడూ నీ పుట్టినరోజుకి గిఫ్ట్‌ అందజేయమని నాకు పురమాయించాడు.

నువ్వు మాత్రం ఎప్పుడూ వాడి గురించి ఆలోచించలేదు. వాడు కూడా నీ కోసమే బతకాలి అన్నట్టు ఉండేదానివి. నువ్వే గొప్ప, అందరూ నిన్ను గుర్తించాలి, నిన్నే పొగడాలి. సైకాలజీలో దీన్నేమంటారో తెలుసా... ‘నార్సిస్టిక్‌ పర్సనాలిటీ డిజార్డర్‌.’ ఇదొక సమస్య, దీనివల్ల ఇతరులు బాధపడతారు అన్న విషయం కూడా నీకు తెలీదు. చెప్పడానికి ట్రై చేస్తే వినవు. దీనివల్ల నువ్వు అదనంగా సాధించింది ఏమీ లేదు. నువ్వు అతని తల్లికి గోరంత చెయ్యనివ్వకపోయినా నిన్ను నెత్తిన పెట్టుకునే చూసుకున్నాడు. నీకు మాత్రం సౌమ్యంగా ఉండే వాడన్నా, కొడుకు ఇబ్బందిపడకూడదని నోరెత్తని ఆవిడన్నా ఎప్పుడూ లోకువే. ఇవేవీ నీకు చెప్పొద్దన్నాడు వాడు. కానీ ఇప్పుడు కూడా నువ్వు వాడిమీద నిందలు వేస్తుంటే ఉండబట్టలేక చెప్పానమ్మా. ఉంటాను తల్లీ’’ అంటూ భోజనానికి ఉండమన్నా వినకుండా టీ మాత్రం తాగి వెళ్ళిపోయాడు సుబ్బు.

* * * * *

అతను వెళ్ళాక కస్తూరి సోఫాలో కూలబడి భర్త ఫొటోకేసి చూసింది. ఆనందరావు నవ్వుతున్నాడు. అతని నవ్వు తెల్లగా ఉంది. అయితే అది పౌర్ణమి చంద్రుడు వెదజల్లిన వెన్నెలలా లేదు. నిలువెత్తు దుఃఖాన్ని పూడ్చి పెట్టిన పాలరాతి ఫలకంలా ఉంది. బతికున్నప్పుడు చాలాసార్లు లోలోపల ఏడ్చే ఉంటాడు. అతని తల్లికి చీర కొనాలంటే తను గీసి గీసి డబ్బులు ఇచ్చినప్పుడు ఏడ్చే ఉంటాడు. నాల్రోజులు ఉందా మని కొడుకింటికొచ్చిన అత్తగారు ఉదయాన్నే ఎదురుపడినందుకు తను విసుక్కుంటే, తన వెనుకే ఉండిపోయి ఏమీ అనలేక అతను ఏడ్చే ఉంటాడు. తల్లికి జత గాజులు చేయిస్తానంటే ఎక్కడ ఆవిడ తదనంతరం దగ్గర చుట్టాల్లో ఆడపిల్లలకి ఇచ్చేస్తుందో అని తను పేచీ పెట్టి మరీ ఆపినప్పుడు అతను ఏడ్చే ఉంటాడు. మొక్కజొన్నపొత్తుని కుంపట్లో కాల్చినట్టు తను అతన్ని కాల్చుకు తింటుంటే ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా ఏడ్చే ఉంటాడు.

కస్తూరికి గుండెల్లోంచి దుఃఖం తన్నుకొచ్చింది. పొగిలి పొగిలి ఏడ్చింది. మనసులోని చీకటిని ఆసాంతం కడిగేసేలా ఏడ్చింది. ఓ నిర్ణయానికొచ్చాక ఆ రాత్రి ఆమె ప్రశాంతంగా పడుకుంది.

* * * * *

గత కొద్దిరోజులుగా పోస్తున్న నీరు పుణ్యమా అని ఇంటిముందు ఎండిపోయిన వేపచెట్టు మళ్ళీ చిగుర్లు పెట్టింది.

‘‘ఎందుకమ్మా నాకీ వయసులో ఈ పుట్టినరోజు హడావిడి, ఇంతింత ఖరీదు పెట్టి చీరలు, పైగా విమానంలో కాశీ ప్రయాణం ప్రోగ్రామ్‌ ఒకటి పెట్టావు. ఇంత ఖర్చు దేనికిప్పుడు’’ మొహమాటంగా అడిగింది లక్ష్మి.

కస్తూరి నవ్వి, ముడతలు పడ్డ అత్తగారి చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఆ స్పర్శలో కొడుకుని తడుముకుంది లక్ష్మి.

ఫోటోలో ఆనందరావు నవ్వుతున్నాడు. ఆ నవ్వు కిటికీలోంచి పడే వెన్నెలలా చల్లగా ఉంది.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని