నిలబెట్టుకుందాం... రండి

‘‘ఊరికే మాట విసురుతుంది. పడతావా?!’’ ‘‘మొగుళ్ళు విసరడం లేదా ఊరికే మాటలూ... ఆఫీసులో మన తప్పేమీ లేకుండానే బాసు నాజూగ్గా గడ్డి పెడుతుంటే పిజ్జాలూ, బర్గర్ల కంటే ఆనందంగా తింటున్నాం కదా.’’

Published : 13 Nov 2022 00:24 IST

నిలబెట్టుకుందాం... రండి

- లక్ష్మీ గాయత్రి

‘‘ఊరికే మాట విసురుతుంది. పడతావా?!’’

‘‘మొగుళ్ళు విసరడం లేదా ఊరికే మాటలూ... ఆఫీసులో మన తప్పేమీ లేకుండానే బాసు నాజూగ్గా గడ్డి పెడుతుంటే పిజ్జాలూ, బర్గర్ల కంటే ఆనందంగా తింటున్నాం కదా.’’

‘‘నోటితో చెప్పడం సులువే. తీరా మాటపడ్డ తర్వాత అది బాణంలా గుచ్చుకుందంటారు మీ ఆడవాళ్లే. తక్షణం పోట్లాటకి దిగుతారు. నాకు బాగా తెలుసు. అందుకే నాకా నరకం వద్దంటున్నాను. ఏం పాపం చేశానో నోటిదురుసు మనిషికి ఒక్కగానొక్క కొడుకునయ్యాను. సొంత మేనమామే వాళ్ళక్క నోటివాటానికి జడిసి, పిల్లనివ్వను పొమ్మన్నాడు. నేను కూడా పెళ్ళీ వద్దు... పెటాకులూ వద్దు... జీవితం ప్రశాంతంగా గడిచిపోతే అంతే చాలనుకున్నాను. ఏ ముహూర్తాన కనిపించావో నాకు... ప్రాణానికి సుఖం లేకుండా పోయింది. పెళ్ళి చేసుకోలేను... మానలేను’’ రెండు చేతులతోనూ తల పట్టుకున్నాడు నిశాంత్‌.

అనునయంగా నిశాంత్‌ చేతుల్ని తన చేతిలోకి తీసుకుంది జాహ్నవి. ‘‘నిశూ, నాకు అమ్మా నాన్నా లేరు. పెదనాన్న ఇంట్లో పెరిగాను. అమ్మ పని చెప్పిందనీ, నాన్న సినిమాకి డబ్బులివ్వలేదనీ అలకలతో సాగినది కాదు నా బాల్యం. పెద్దమ్మా, అక్కా, అన్నా... ఏదో ఒక కారణం చెప్పి తిడుతూ ఉంటే ఆ తిట్ల మధ్య పెరిగి పెద్దయ్యాను.

మొదట్లో ఆ తిట్లన్నీ నన్ను కూడా బాధపెట్టేవి. కోపం వచ్చేది. ఏడ్చేదాన్ని. అక్కడి నుంచి పారిపోవాలని కూడా ప్రయత్నించాను. అయితే ఆ ప్రతికూల పరిస్ధితుల్లో సైతం ప్రశాంతంగా బతకడం నేర్పింది మా నాయనమ్మ. అనుబంధాల్ని నిలబెట్టుకుంటూ, అనురాగాన్ని గెలుచుకునే మంత్రాన్ని ఉపదేశించింది. అదంతా ఇప్పుడు చెప్పలేను గానీ నన్ను నమ్ము. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నేను నిన్ను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. నాకు నువ్వు కావాలి. నీతో కలిసి ఎదిగే భవిష్యత్తు కావాలి. ప్లీజ్‌, నన్ను పెళ్ళి చేసుకో!’’

*    *    *

పూలరథంలా అలంకరించబడి ఉన్న కారు, నెమ్మదిగా వచ్చి ఆ భవనం ముందు ఆగింది.

ఎవరో వచ్చి తలుపు తీశారు.

‘‘దిగండి... దిగండి! మళ్ళీ వర్జ్యం వచ్చేస్తుంది’’ ఒక స్వరం మేఘంలా గర్జించింది.

నవవధువు కోమలహస్తాన్ని అపురూపంగా తన చేత్తో పెనవేసి పట్టుకుని, రంగుల కలలు కంటున్న పెళ్ళి కొడుకు నిశాంత్‌, ఆ స్వరం వింటూనే ఉలిక్కిపడ్డాడు. అప్రయత్నంగానే అతడి చెయ్యి వధువు చేతిని వదిలేసింది. అయితే వధువు మాత్రం తన భర్త చేతిని వదలలేదు. సున్నితంగానే అయినా మరింత దృఢంగా అతడి చేతిని పెనవేసి పట్టుకుని, కాటుక దిద్దిన తన విశాలనేత్రాల్ని కొద్దిగా పైకెత్తి అతడి వైపు చూసి, గులాబీ రంగు ముద్దగన్నేరు రేకులు విచ్చుకుంటున్నట్టు పల్చగా పెదవులు కదుపుతూ చిరునవ్వు నవ్వింది! ఆ నవ్వు అతడిలో జీవం పోసింది.

ఇద్దరూ కారు దిగి, సింహద్వారం దాటి, హాల్లోకొచ్చారు. చెయ్యీ చెయ్యీ కలుపుకుని జంటగానే నడుస్తూ వెళ్ళి సోఫాలో కూర్చున్నారు.

కూర్చున్న తర్వాత కూడా వధువు భర్త చేతిని గట్టిగా పట్టుకునే ఉండటాన్ని ప్రత్యేకంగా గమనించింది  అత్తగారు... ఐదు నిమిషాల క్రితం ‘దిగండి... దిగండి’ అంటూ గర్జించిన ఇల్లాలు... మహాలక్ష్మి!!

సోఫాలో సర్దుకుని కూర్చోబోతున్న కొడుకు దగ్గరకొచ్చిందామె. ‘‘నాన్నా నిశూ, రాత్రంతా నిద్దర్లేదు. బాగా అలిసిపోయావు. నువ్వు వెళ్ళి నీ రూమ్‌లో రెస్ట్‌ తీసుకో’’ అంటూ కోడలి వైపు తిరిగి, నవ్వుతూనే, స్పష్టమైన వ్యంగ్యధోరణిలో, ‘‘వాణ్ణి తాపీగా కొంగుకి ముడేసుకుందువు గాన్లేమ్మా... ఇప్పటికి వదులు. బిడ్డ కాస్త చేరబడతాడు’’ అంది.

చుట్టూ ఉన్న వాళ్ళంతా కాస్తలో కాస్త ఆశ్చర్యపోయారు ఆమె ధోరణికి.

ఒకావిడ చొరవగా ముందుకొస్తూ, ‘‘వెళతాళ్ళే... ముందు ఇద్దర్నీ కలిసి కాస్త కాఫీ తాగనీ’’ అంది.

మహాలక్ష్మి నవ్వుతూనే, ‘‘ఇదేమన్నా సినిమాటమ్మా... కాఫీ దగ్గర్నించీ కళ్ళప్పగించి చూసుకోడానికీ..?! పుస్తె ముడేయించుకుని వచ్చింది... అదెక్కడికి పోతుంది, వాడెక్కడికి పోతాడు?!’’ అంటూ మళ్లీ కొడుకు వైపు తిరిగి, ‘‘వీళ్ళ మాటలకేంగానీ నువ్వు వెళ్ళరా’’ అంది గట్టిగా.

నిశాంత్‌ వెంటనే జాహ్నవి వైపు తిరిగి, ‘అప్పుడే మొదలైంది చూశావా?’ అన్నట్టు కళ్ళెగరేశాడు.

ఈ లోపున చుట్టూ ఉన్న వారిలో ఎవరో, ‘‘పెళ్ళి కూతురికి అక్కర్లేదా రెస్టూ’’ అంటూ సాగదీశారు.

మహాలక్ష్మి చివ్వున అటు తిరిగింది... ‘‘మొగుడూ పెళ్ళాం కలిసి బైటికెళ్ళొస్తే, ఇంటికి రాగానే మొగుడు సోఫాలోనో మంచం మీదో చేరబడతాడు. పెళ్ళాం వంటింట్లోకి వెళ్ళి టీయో, టిఫినో రెడీ చేసి పట్టుకొస్తుంది. ఆడదానికీ మొగాడికీ సాపత్యమేవిటే?! కొత్త కోడలికి ఇల్లు చూపించాలా... స్నానం చేసొచ్చాక దీపం పెట్టించాలా... అవేమీ చెయ్యకపోతే మళ్ళీ మీరే నన్ను ఆడిపోసుకుంటారు.’’

మరింక ఎవ్వరూ నోరు విప్పలేదు. తమలో తాము మాట్లాడుకోవడం ప్రారంభించారు.

ఆ సందట్లో జాహ్నవి, తగ్గు స్వరంతో, ‘‘నిశూ, ఇప్పుడు నువ్వు నీ గదికి వెళ్ళినంత మాత్రాన మనం విడిపోయినట్టేమీ కాదు. వెళ్ళు... వెళ్ళి హాయిగా పడుకో’’ అంది.

ఆ మాటలు అంటూనే భర్త చేతిని వదిలేసి సోఫాలోంచి లేచి నిలబడింది.

తననే గమనిస్తున్న అత్తగారి వైపు చూస్తూ, చిరునవ్వుతో మృదువుగా, ‘‘అత్తయ్యా, నేను కాఫీ తాగి స్నానం చెయ్యనా... ముందే స్నానం చేసి రానా’’ అంటూ అడిగింది.

తను అంత కటువుగా మాట్లాడినా కాస్తయినా కోపం, చిరాకూ లేకుండా ఉన్న కొత్త కోడలి ప్రశాంత ధోరణికి మహాలక్ష్మి ఆశ్చర్యపోయింది. చప్పున ఏం జవాబు చెప్పాలో ఆమెకు తోచలేదు.

తల్లి మాటలకు తడుముకోవడాన్ని తొలిసారిగా చూస్తున్న నిశాంత్‌కి ఏదో భరోసాగా అనిపించింది. భార్యని ఒకసారి తృప్తిగా చూసుకుని, నిశ్చింతగా తన గది వైపు నడిచాడు.

*    *    *

మహాలక్ష్మికి కోడలి వ్యవహారం ఏమిటో బొత్తిగా అంతు పట్టడం లేదు. ఎక్కడా ఏ చిన్న మాటకీ అవకాశం ఇవ్వదు. తెల్లారి తను నిద్ర లేచేసరికే ఆ పిల్ల లేచి యోగా చేస్తూ ఉంటుంది. లేదా అప్పటికే యోగా ముగించుకుని స్నానం కూడా చేసేస్తుంది. పెళ్ళయిన నాలుగో రోజునే దశాబ్దాలనాటి పాత కోడలిలా వంటింట్లోకొచ్చి, చొరవగా పనందుకుంది. ఎవరికి ఏం కావాలో అడిగి మరీ చేసి పెడుతోంది. ఎలా కుదిర్చిందో- ఓ పాతికేళ్ళదాన్ని ‘హెల్పర్‌’గా తీసుకొచ్చింది. దాని సహాయంతో టిఫినూ వంటా క్షణాల మీద ముగిస్తుంది. సాయంత్రం ఆ హెల్పరే తనకీ తన భర్తకీ టీ పెట్టి ఇచ్చి, పుల్కాలూ, కూరా చేసి హాట్‌బాక్స్‌లో పెట్టి టేబుల్‌ మీద సర్దేసి వెళ్ళిపోతుంది.

ఓ రోజు ఆ హెల్పర్‌ని పిలిచి, ‘‘పద్మా, ఇవాళ్టి నుంచి రోజూ నువ్వు వెళ్ళిపోబోయే ముందు అత్తయ్య అరికాళ్ళకి ఈ ఆయింటుమెంటు రాయి’’ అంటూ చెప్పి, ‘‘అత్తయ్యా, మీ పాదాలు బాగా పగిలిపోయి ఉన్నాయి. మీకు షుగర్‌ ఉంది కదా... పాదాల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ఆయింటుమెంటు రోజుకి రెండుసార్లు రాయించుకోండి’’ అంది.

తనకి నోటమాట రాలేదుగానీ మనసులో చాలా ఆనందంగా అనిపించింది. పగిలిన పాదాల బాధ తనకే ఎరుక. ఎవరినో ఇంటికి పిలిపించి పాదాలకి పెడిక్యూర్‌ కూడా చేయించింది. ఇప్పుడు తన పాదాలు పువ్వుల్లా మెత్తగా ఉన్నాయి. నడుస్తూంటే బాధే లేదు.

ఇన్ని చేస్తున్నా తను ఏదో ఒక పుల్లవిరుపు మాట అంటూనే ఉంది. కానీ ఆ పిల్ల కించిత్తు కోపం తెచ్చుకోదు. మాటకి మాట అనదు. మొహంలో ప్రశాంతతా, చిరునవ్వూ చెక్కు చెదరవు. మరోవైపు నుంచి కొడుకు చూపులూ మొగుడి చూపులూ తనని సూదుల్లా పొడుస్తాయి. ఎర్రగా వాతలు పెడతాయి. దాంతో మరిక మాట్లాడటానికి నోరు సహకరించక తనే మౌనం వహిస్తోంది.

మరోసారి... ఒక ఆదివారం జాహ్నవి పుట్టింటికి వెళ్ళబోతుండగా, ‘‘ఏవమ్మోయ్‌, ఇక్కడి విషయాలన్నీ నీ పుట్టింటికి మోసేవు గనక... మాకు గుట్టుగా బతకడం అలవాటు’’ అంది.

ఆ మాటకి కొడుకూ మొగుడూ ఎర్రగా చూశారు గానీ, జాహ్నవి మాత్రం నవ్వింది. నవ్వుతూనే ‘‘నాకు ఎప్పటి విషయాలు అప్పుడే మర్చిపోయి ప్రశాంతంగా బతకడం అలవాటత్తయ్యా. పుట్టింట్లో చెప్పడానికి నా బుర్రలో ఏమీ ఉండవు. అలా చెప్పే ఆసక్తీ లేదు’’ అంది.

తనకి చెప్పుతో కొట్టినట్టు అనిపించింది.

ఈ అమ్మాయికి కోపం రాదా?! తను ఎన్ని మాటలన్నా చిన్నతనంగా ఫీలవదా?! సిగ్గూ లజ్జా పౌరుషం అభిమానం లేవా?! తనతో ఢీ అంటే ఢీ అని జట్టీ ఆడదా?! ఎంతసేపూ తనొక్కతే మద్దెల వాయిస్తోంది.

ఆ పిల్లకి తల్లీ తండ్రీ లేరన్నది ఒక్కటే లోటు. చూడచక్కని పిల్ల. తన కొడుకుతో సమానంగా చదువుకుంది... సంపాదిస్తోంది. తన కొడుక్కి ఆ పిల్లంటే ఎంత ప్రేమో ఇట్టే తెలుస్తుంది. ఈ పళంగా వేరు కుంపటి పెడదాం రమ్మని ఆ పిల్ల పిలిస్తే తన కొడుకు ఎగురుతూ వెళ్ళడం ఖాయం.

మహాలక్ష్మి ఆలోచనలు పరిపరివిధాల పోతున్నాయి. అయితే ఆమె గ్రహించని సంగతేమంటే అప్పటికే ఆమె నోటివాటుతనం సగానికి సగం తగ్గిపోయింది. ఆ విషయం మహాలక్ష్మికి తప్ప మిగతా ముగ్గురికీ స్పష్టంగా తెలుస్తోంది.

మరో నాలుగు రోజులు పోయాక, ఒక ఆదివారం పొద్దున్నే, ‘‘ఏం మాట్లాడుతున్నావే నువ్వూ.... జాగ్రత్త! నోటికొచ్చినట్టు పేలదలచుకుంటే తక్షణం ఫో’’ అంటూ కోడలి గొంతు గట్టిగా, కోపంగా వినబడేసరికి, పరిగెత్తింది మహాలక్ష్మి.

పెరట్లో మొక్కల దగ్గర తల వంచుకుని బిత్తర చూపులు చూస్తూ నిలబడి ఉంది పనిమనిషి. పక్కనే కోపంగా జాహ్నవి.

ముందు కోడలి మొహంలో కోపాన్ని తనివితీరా చూసింది మహాలక్ష్మి. తర్వాత అడిగింది ఏమైందని.

‘‘మొక్కల మధ్యలో సరిగ్గా తుడవటం లేదత్తయ్యా! ఎండుటాకులూ అవీ కుప్పలా పేరుకుంటున్నాయి. దాని వల్ల మొక్కలకి నీళ్ళు సరిగ్గా వెళ్ళడం లేదు. ఆ మాటే చెప్పి, ‘శుభ్రంగా తుడు’ అన్నాను. ‘నాకు తెలుసు ఎలా తుడవాలో, నువ్వెళ్ళమ్మా’ అని కసురుతోంది. జీతానికి చేసే మనిషి దానికే ఇంతుంటే మరి నాకెంతుండాలి?!’’

మహాలక్ష్మి నిశ్శబ్దంగా వెనక్కి వచ్చేసింది. పనిమనిషికి జాహ్నవిని కసరగలిగే ధైర్యం ఎలా వచ్చిందో ఆవిడకి తేలిగ్గానే అర్థం అయింది. పనిమనిషి ఎదురుగానే ఎన్నోసార్లు తను జాహ్నవిని చులకన చేస్తూ మాట్లాడింది. జాహ్నవి ఏనాడూ ఎదురు తిరగలేదు. దాంతో పాపం పనిమనిషి దృష్టిలో కూడా చులకన అయిపోయిందన్నమాట. అయితే పనిమనిషి కాస్త కసిరేసరికే దాన్ని చీల్చి చెండాడిన మనిషి, తను ఎన్ని మాటలు అంటున్నా ఎందుకు ఊరుకుంటోంది?! అత్తగారన్న గౌరవమా లేక మా అమ్మకి ఎదురు చెప్పడానికి వీల్లేదన్నాడా నిశాంతు? కారణం ఏదైనాగానీ అసలు ఆ పిల్లకి అంత సహనం ఎలా వస్తోంది?!

ఆదివారం కాబట్టి తీరికగా ఉన్న కోడల్ని వదలదలచుకోలేదు మహాలక్ష్మి. సంకోచించకుండా తన మనసులో మాట అడిగేసింది.

అత్తగారి సందేహం విని జాహ్నవి వెన్నెలలా చల్లగా నవ్వింది. ‘‘మీరు చెబుతున్న ఆ సహనమూ ఓర్పూ ప్రశాంతతా... నాలో ఇంతలా పాతుకున్నాయంటే, అందుకు పూర్తి కారణం మా నాయనమ్మేనత్తయ్యా! వెయ్యి జన్మలకీ నేను ఆవిడ రుణం తీర్చుకోలేను’’ అంటూ ఇలా చెప్పడం ప్రారంభించింది.

‘‘అమ్మా నాన్నకి నేనొక్కదాన్నే. వాళ్ళు యాక్సిడెంట్‌లో పోయేనాటికి నేను పదేళ్ళదాన్ని. మా పెదనాన్నా, నానమ్మా మాట్లాడుకుని నన్ను పెదనాన్న ఇంటికి తీసుకుపోయారు. మా నాన్న డబ్బున్నవాడే. పైగా యాక్సిడెంట్‌ కారణంగా ఇన్సూరెన్స్‌ డబ్బు వచ్చింది. అయితే ఆ లక్షలన్నీ నా చదువుకీ పెళ్ళికీ అని దాచేసి, పెదనాన్నే నన్ను పోషించడం
పెద్దమ్మకి ఇష్టం లేకపోయింది. ఆవిడా, అన్నా, అక్కా ముగ్గురూ నన్ను ఏదో ఒకటి అంటూనే ఉండేవారు. క్షణం కూచోనిచ్చేవారు కాదు. రాను రాను నాకు ఆ మాటలు భరించరానివయ్యాయి. ఒకోసారి కోపం తెచ్చుకుని జట్టీ ఆడేదాన్ని. ఒకోసారి తిండి మానేసి ఏడుస్తూ పడుకునేదాన్ని. ఒకసారి తెగించి ఓ రాత్రి వేళ పారిపోబోతూ పట్టుబడ్డాను. ఆ పరిస్థితుల్లో నానమ్మ నాకు ధైర్యం నూరిపొయ్యడం కోసం జీవితపాఠాలు చెప్పడం ప్రారంభించింది.

‘జానూ, జీవితంలో మనల్ని చాలామంది చాలా రకాల కారణాలతో మాటలు అంటారు. తిడతారు, కసురుతారు. నువ్వు వాళ్ళ మాటలకి కోపం తెచ్చుకోవడం,
ఏడవడం లాంటి పనులు చేస్తే నిన్ను మాటలతో బాధపెట్టాలనుకునే వారి ఆశయం నెరవేరినట్టే. అంటే, వాళ్ళే గెలిచారన్నమాట. వాళ్ళని ఓడించాలంటే నువ్వు ప్రశాంతత అనే ఆయుధ ప్రయోగాన్ని బాగా అభ్యసించాలి. వాళ్ళు తిడుతూంటే నువ్వసలు ఎందుకు పట్టించుకోవాలి? నువ్వు ఏ తప్పూ చెయ్యలేదు. వాళ్ళని బాధపెట్టలేదు. అంచేత ‘నిన్ను తిడుతున్నవాళ్ళు మూర్ఖులు’ అనుకుని ఏదీ పట్టించుకోకుండా చిరునవ్వు నవ్వుతూ ఉన్నావనుకో... నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవతలివాళ్ళే వెర్రెక్కిపోతారు. బ్రిటిషు వారిని జయించడానికి గాంధీ మహాత్ముడు ప్రయోగించిన ఆయుధం ఇదే... అహింస! అరుపులూ కేకలూ మొత్తుకోడాలూ ఏడవడాలూ సాధించలేని దాన్ని ప్రశాంతత సాధిస్తుంది. నువ్వు నీ జీవితాంతం ఈ మాట గుర్తుపెట్టుకో. రేపు పెద్దయ్యాక ఆఫీసులో పైవాడో, అత్తగారో, మొగుడో... ఎవరైనా ఏదైనా అనవచ్చు. వాళ్ళు అన్నదాంట్లో నీ తప్పు ఉంటే నిన్ను నువ్వు సరిదిద్దుకో. నీ తప్పు లేకుండా వాళ్ళు మాటలు విసిరితే, ‘నిన్ను బాధపెట్టాలన్నదే వాళ్ళ కోరిక’ అన్న మాట. ఆ కోరికగానీ నెరవేరిందా... నువ్వు ఎందుకూ పనికిరాకుండా పోతావు. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా, కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండటాన్ని అలవాటు చేసుకున్నావా... జీవితంలో పైపైకి ఎదుగుతావు. నీ చుట్టూ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అవతలివాళ్ళు కూడా నెమ్మదిగా మారతారు. నీపట్ల అభిమానం పెంచుకుంటారు. అంతేకాదమ్మా, అయినవాళ్ళతో సంబంధ బాంధవ్యాలు నిలబడతాయి. మాటపట్టింపులతో సంబంధాలు తెంపుకుని ఒంటరి బతుకు బతకడంలో సుఖమేముంది? ఇప్పుడు చాలామంది అలా అయినవాళ్ళతో తెగతెంపులు చేసుకునే బతుకుతున్నారు. కానీ డాక్టర్లూ శాస్త్రవేత్తలూ కూడా అది మంచిది కాదనే చెబుతున్నారు. అంచేత నీ వరకూ నువ్వు నీకున్న బంధుత్వాల్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నించు. భగవంతుణ్ణి మనసా వాచా నమ్ముకుని, నీ మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకో!’

... ఇదీ మా నానమ్మ నాకు చేసిన ఉపదేశం. అది నాకు అన్ని విధాలా మంచే చేసింది. మా పెదనాన్నతో బాటు పెద్దమ్మ, అక్క, అన్న అందరూ ఇప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటారు. పోతే, నా భవిష్యత్తు అంతా మీతోనే అల్లుకుని ఉంది. నా భర్తకి తల్లీ తండ్రీ... నా పిల్లలకి నానమ్మా, తాతయ్యా... చిరకాలం ఉండాలన్నది నా కోరిక. మన బాంధవ్యం ఎప్పటికీ పటిష్టంగా ఉండాలి. అంచేత మీరనే ఏ మాటా నన్ను బాధించదు. నేను ప్రశాంతంగా ఉంటూ, మన అనుబంధాన్ని కూడా పచ్చగా ఉంచేందుకే నేను సర్వవిధాలా ప్రయత్నిస్తాను. పెళ్ళికి ముందు నిశాంత్‌కి నేను చెప్పింది కూడా ఇదే!!’’ అంటూ ముగించింది.

జాహ్నవి మాటలు వింటూ తన అస్తిత్వాన్నే మర్చిపోయిన మహాలక్ష్మి నెమ్మదిగా తెప్పరిల్లింది. అయితే ఆమెకే తెలియకుండా ఆమె కళ్ళనుంచి జాలువారుతున్న బాష్పాలు మాత్రం ఆగలేదు.

అలాగే లేచి నిలబడ్డ మహాలక్ష్మి, రెండడుగులు ముందుకు వేసి, కోడలి చేతులు రెండూ పట్టుకుంటూ, ‘‘తల్లీ, మీ నానమ్మ నీకు చేసిన ఉపదేశం నాలాంటి వారి కళ్ళు తెరిపించే గీతోపదేశమే. కడుపున పుట్టిన పిల్లలతో అయినా సరే, సంబంధ బాంధవ్యాలు బావుండాలంటే నోరు అదుపులో పెట్టుకోవాలి. అందరూ నీలా మనసును అదుపు చేసుకుని అవతలివాళ్ళ తిట్లు పట్టించుకోకుండా ఉండరు గదా... అగ్ని నిరోధకం ఉంటే మంట దహించకుండా ఉంటుంది. లేని పక్షంలో మిగిలేది పిడికెడు బుగ్గే. బంధుత్వాలు బుగ్గయిపోకుండా ఉండాలంటే నోటి మాటలతో మంటలు ఎగజిమ్మకూడదు. నిశూని నేను కన్నాను గానీ, వాడితో నా బంధాన్ని పటిష్టం చేస్తున్నది నువ్వే’’ అంటూ కోడల్ని లేవదీసి గుండెకు హత్తుకుంది.

అప్పటికే వాళ్ళ పక్కన చేరి అంతా విన్న నిశాంత్‌ సంతోషం పట్టలేక ఒక్క ఉదుటున ముందుకు వెళ్ళి అత్తాకోడళ్ళిద్దరి చుట్టూ చేతులు బిగించాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..