ఈ ఊళ్లు చాలా స్పెషల్‌ బాసూ!

దేశం మొత్తమ్మీద ఆరు లక్షల అరవై వేలకు పైగా గ్రామాలున్నాయి. వాటిలో కొన్నిటికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇదిగో ఈ గ్రామాలు అలాంటివే.

Updated : 25 Mar 2023 17:02 IST

ఈ ఊళ్లు చాలా స్పెషల్‌ బాసూ!

దేశం మొత్తమ్మీద ఆరు లక్షల అరవై వేలకు పైగా గ్రామాలున్నాయి. వాటిలో కొన్నిటికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇదిగో ఈ గ్రామాలు అలాంటివే. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే చదివేయండి!


అందరూ సంస్కృతంలోనే...

సంస్కృతాన్ని దేవభాష అంటారు కదా. కానీ, దేశంలో దాన్ని మాట్లాడగలిగిన వాళ్లు ఎంతమంది ఉంటారు? మార్కులకోసం చదవడమో వేదమంత్రాల్లో వినడమో తప్ప తోటివాళ్లతో పూర్తిగా సంస్కృతంలోనే మాట్లాడే వాళ్లు ఎవరుంటారూ అనుకుంటాం. కానీ, అసోమ్‌లోని కరీంగంజ్‌ జిల్లా పాటియాల గ్రామాన్ని చూస్తే ఆ అభిప్రాయం తప్పని తెలుస్తుంది. ఆ ఊళ్లో ఉండేవారంతా సంస్కృతంలోనే మాట్లాడుకుంటారు. రోజువారీ వ్యవహారాలకు ఆ భాషనే వినియోగిస్తుంటారు. అలాగని వాళ్లంతా మొదటి నుంచీ సంస్కృతమే మాట్లాడే వాళ్లు కాదు. 2015లో గ్రామానికి వెళ్లిన ‘సంస్కృత్‌ భారతి’ కార్యకర్తలు సంస్కృత శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అలా వారి నుంచి నేర్చుకున్న గ్రామస్థులు... అప్పటి నుంచి సంస్కృతంలోనే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తమ పిల్లలకూ దాన్ని పక్కాగా నేర్పుతున్నారు. ఊళ్లో రోజూ పొద్దునే అయిదింటి నుంచి ఏడు గంటల వరకు యోగా శిబిరమూ నిర్వహిస్తారు. పొలం పనుల్లో తీరిక లేకపోయినా రోజూ యోగా మాత్రం మానరట గ్రామస్థులు. అన్నట్టు, వీళ్లను చూసి అక్కడికి దగ్గర్లోని అనిపుర్‌బస్తీ వాసులూ సంస్కృతం నేర్చుకుని మరీ మాట్లాడుకుంటున్నారు.


ఇండియాలో ఆఫ్రికా

హైదరాబాద్‌తోసహా మన మెట్రో నగరాల్లో అడపాదడపా ఆఫ్రికన్లు కనిపిస్తుంటారు కదా. చదువుకోవడానికి వచ్చిన కుర్రాళ్లో... ఉద్యోగాల నిమిత్తం ఇక్కడ ఉంటున్న వాళ్లో... చాలామందే ఎదురవుతుంటారు. కానీ, స్వచ్ఛమైన గుజరాతీ మాట్లాడే ఆఫ్రికన్లను చూశారా ఎప్పుడైనా? గుజరాత్‌- గిర్‌ నేషనల్‌ పార్క్‌కు సమీపంలోని జాంబూర్‌ వెళ్తే వాళ్లను చూడొచ్చు.

ఇండియాలోని మినీ ఆఫ్రికన్‌ గ్రామమది. కొన్ని శతాబ్దాల క్రితం ఆగ్నేయ ఆఫ్రికా నుంచి మనదేశానికి వచ్చిన బంటూ తెగవాసుల వారసులు వాళ్లు. అప్పట్లో వీళ్ల పూర్వికులు బానిసలుగానూ, నావికులుగానూ ఇక్కడికి చేరుకున్నారు. అరబ్‌ వ్యాపారులు వాళ్లలో కొందరిని భారతీయ నవాబులకు అప్పగించారు. మరికొందరిని పోర్చుగీసువాళ్లు తీసుకొచ్చారు. సిద్ధీలుగా అందరూ పిలిచే ఆ ఆఫ్రికన్లు... ఇన్నేళ్లలో తమ మాతృభాషను మర్చిపోయారు. గుజరాతీనే మాట్లాడుతూ స్థానిక ఆచార వ్యవహారాలను అలవాటు చేసుకున్నారు. జాంబూర్‌ సిద్ధీల్లో ఎక్కువ మంది వ్యవసాయం చేస్తుంటారు. పర్యటకుల కోసం సిద్ధీ గిరిజన నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఆదాయం పొందుతూ ఉంటారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మొదటిసారి ఇటీవలే ఆ ఊళ్లో పోలింగ్‌ కేంద్రం పెట్టారు. 3400లకు పైగా అక్కడ ఓటర్లు ఉంటే... వాళ్లలో 90శాతం సిద్ధీలే. తమ ఊరికి పోలింగ్‌ కేంద్రం రాకకు ఆనందిస్తూ వాళ్లందరూ తమవైన పిండివంటలూ, నృత్యాలతో పెద్ద పండగ చేసుకున్నారు.


‘కండలు తిరిగిన’ పల్లె!

దేశ రాజధాని దిల్లీ శివార్లలోని ఆ గ్రామానికి వెళ్తే... కండలు తిరిగిన దేహాలతో కుస్తీ పట్లు పట్టే మల్లయోధులెందరో కనిపిస్తారు. దానిపేరు... అసోలా-ఫతేపూర్‌ బేరి. నైట్‌క్లబ్బుల్లో, బార్లలో, ఇతర ప్రాంతాల్లో పనిచేసే బౌన్సర్లలో అత్యధికులు ఆ గ్రామస్థులే. ఉదయం, సాయంత్రం సంప్రదాయ పద్ధతుల్లో కఠిన వ్యాయామం చేస్తుంటారు అక్కడి కుర్రాళ్లు. కుస్తీ నేర్చుకుంటూ ఆ పోటీల్లో పాల్గొంటుంటారు. ఇరవై ఏళ్ల క్రితం ఆ గ్రామానికి చెందిన విజయ్‌ తన్వార్‌ కూడా అలాగే కష్టపడ్డాడు. కానీ, ఒలింపిక్స్‌లో పాల్గొనే ఇండియన్‌ రెజ్లింగ్‌ టీమ్‌లో స్థానం సంపాదించుకోలేకపోయాడు. దాంతో ఉద్యోగం కోసం వెతుకుతూ బౌన్సర్‌గా చేరాడు. అతని తరవాత ఆ ఊరి యువకులు చాలామంది అదే దారిని అనుసరించారు. ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లకు చాలాదూరంగా ఉంటూ పౌష్టికాహారం తీసుకుంటూ, అందుకు తగిన వ్యాయామాలతో తమ శరీరాన్ని బలిష్ఠంగా తయారు చేసుకుంటారు. అంతేకాదు, ఆ గ్రామస్థుల పూర్వికులు అప్పట్లో యుద్ధయోధులట. దిల్లీపైకి దండెత్తిన శత్రుశిబిరాలను మొదట ఎదుర్కొనే వారిలో వీళ్లూ ఉండేవారట. అలా వారసత్వంగా వచ్చిన మల్లయుద్ధ నైపుణ్యాన్ని పదునుపెట్టుకుంటూ... దాంతోనే ఉపాధి పొందుతున్నారు. ఈ మధ్య తమన్నా బౌన్సర్‌గా నటించిన  ‘బబ్లీ బౌన్సర్‌’లో ఆమెను అసోలా-ఫతేపూర్‌ బేరి గ్రామస్థురాలిగానే చూపించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..