రండి రండి చూద్దాం.. యాదాద్రి వైభవం!

యాదగిరి గుట్ట... పురాతన గుహాలయంగా భక్తులకు సుపరిచితమైన ఈ ఆలయం ఇప్పుడు అత్యంత ఆధునిక హంగులన్నీ సమకూర్చుకుని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంది.

Updated : 23 Mar 2022 16:49 IST

రండి రండి చూద్దాం.. యాదాద్రి వైభవం!

యాదగిరి గుట్ట... పురాతన గుహాలయంగా భక్తులకు సుపరిచితమైన ఈ ఆలయం ఇప్పుడు అత్యంత ఆధునిక హంగులన్నీ సమకూర్చుకుని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంది. ఈ ఆలయ పునర్నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం తలకెత్తుకోవడం ఒక విశేషమైతే పాత, కొత్తల మేలు కలయికగా దాన్ని తీర్చిదిద్దడం మరో విశేషం. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కలల ప్రాజెక్టుగా పేరొంది, పన్నెండు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2015లో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమైంది యాదాద్రి పునర్నిర్మాణం. ఆరేళ్లపాటు బాలాలయం పేరుతో భక్తుల దర్శనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మరీ ఈ ఆలయాన్ని విస్తరించారు. కృష్ణశిల సేకరణ నుంచి గోపుర స్వర్ణతాపడం వరకూ పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. కొండమీద నాలుగెకరాల్లో విశాలంగా రూపుదిద్దుకున్న ఆలయ ప్రాంగణం, కొండ చుట్టూ సకల సౌకర్యాలతో వెలసిన ఆలయ నగరం... త్వరలో భక్తులకు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో యాదాద్రి విశేషాల సమాహారం మీకోసం..

యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా నిలపాలన్నది కేసీఆర్‌ కల... అంటున్నారు అందరూ. నిజానికి తన కల కన్నా కూడా భక్తుల అవసరాల్ని చూశారాయన. అందుకే శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దాలనుకున్నారు. ‘నాకు ఊహ తెలిశాక 1969లో మొదటిసారి తిరుమల వెళ్లాను. అప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ధర్మసత్రంలోనే బస చేసిన గుర్తు. ఈ యాభై ఏళ్లలో తిరుమల ఎంత మారిందో అందరికీ తెలుసు. పెరుగుతున్న భక్తుల అవసరాలకు తగినట్లుగా సకల వసతుల్నీ సమకూర్చుకుని గొప్ప క్షేత్రంగా విలసిల్లుతోంది. తిరుమల లాంటి వైష్ణవ క్షేత్రమే యాదాద్రి కూడా. దీన్నీ అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకున్నాను...’ అనే కేసీఆర్‌ ఊహ ఇప్పుడు నిజమైంది. ఒకప్పటి గుహాలయం నేడు లక్ష మంది భక్తులు వచ్చినా స్వాగతించే బ్రహ్మాండమైన ఆలయంగా రూపుదాల్చింది. రండి... పునర్నిర్మించిన ఆలయశోభను తిలకిస్తూ లక్ష్మీ నరసింహుని దర్శనం చేసుకుందాం..!

పురానికి గోపురమే అలంకారమంటారు పెద్దలు. ఏ ఊళ్లోనైనా ఆకాశాన్నంటే ఆలయ శిఖరమే చుక్కానిలా భక్తుల్ని దైవ సన్నిధికి మళ్లిస్తుంది. ఒకప్పుడు ఈ యాదగిరిగుట్ట ఆలయం కూడా చాలా దూరం నుంచీ కన్పించేది. తర్వాత్తర్వాత ఇతర నిర్మాణాలు అడ్డమొచ్చి కనిపించకుండా అయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ఆలయ విస్తరణలో భాగంగా నలుదిక్కులా పంచతల, సప్తతల గోపురాలతో ఆలయాన్ని విశాలంగా పునర్నిర్మించడంతో ఇప్పుడు అల్లంత దూరం నుంచే లక్ష్మీనరసింహుడు కొలువైన ఈ యాదగిరి గుట్టనీ దానిపైన కనిపించే ఆలయ శిఖరాన్నీ చూడగానే భక్తులు అలౌకిక ఆనందానికి లోనవుతారు.

హైదరాబాదుకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరిగుట్టకి భక్తుల తాకిడి చాలా ఎక్కువ. ఏ కష్టమొచ్చినా భక్త సులభుడిగా పేరొందిన లక్ష్మీనరసింహుడిని వేడుకోవడం, శక్తికొలదీ మొక్కుకోవడం, ఆ మొక్కులు చెల్లించుకోవడానికి పిల్లల్నీ పెద్దల్నీ వెంటబెట్టుకుని ఆలయానికి రావడం తెలంగాణ ప్రజలకే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలకూ అలవాటే. ఒకప్పుడు అలా వచ్చిన వారు హైదరాబాదులో బసచేసి అక్కడినుంచి ప్రత్యేకంగా యాదాద్రి సందర్శనకు వెళ్లివచ్చేవారు. కొద్ది రోజులపాటు ఉండి ప్రదక్షిణల మొక్కు చెల్లించుకోవాలంటే ఇబ్బంది పడేవారు. ఇప్పుడా అవసరం లేదు. నేరుగా యాదాద్రి వచ్చి ఆలయ సమీపంలోనే బస చేయవచ్చు. సాధారణ పౌరులనుంచి దేశాధినేతల వరకూ ఎవరు వచ్చినా వారి స్థాయికి తగిన ఆతిథ్యమిచ్చే వసతి గృహాలు ఉన్నాయి. హాయిగా విశ్రాంతి తీసుకుని ప్రశాంతంగా దైవదర్శనం చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాలను కూడా సందర్శించుకోవచ్చు.

నాలుగంతస్తుల క్యూ కాంప్లెక్స్‌

యాదాద్రిని చేరుకోగానే పెద్దగా వైకుంఠద్వారం భక్తుల్ని స్వాగతిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిన భక్తులైనా, ఏ వాహనంలో వచ్చినా... గుట్ట కిందికి రాగానే వాహనాన్ని పార్కింగ్‌ ప్రదేశంలో నిలిపి క్యూకాంప్లెక్స్‌లోకి చేరుకోవాలి. దేవాలయం ఉన్న గుట్టను ఆనుకుని ఉత్తరం వైపున నాలుగు అంతస్తుల్లో నిర్మించిన విశాలమైన క్యూకాంప్లెక్స్‌ ఇది. మొత్తం 10వేల మంది వరకూ వేచి ఉండేందుకు వీలుగా ఈ భవనంలో నాలుగు పెద్ద పెద్ద హాల్స్‌ ఉన్నాయి. స్త్రీలూ పిల్లలూ వృద్ధులూ విశ్రాంతిగా కూర్చునే వీలుంది. రద్దీగా ఉన్నప్పుడు ఎక్కువ సమయం వేచివుండాల్సి వస్తే స్నాక్స్‌, మంచినీళ్లు లాంటివి దేవస్థానం సిబ్బంది ఇక్కడ ఉచితంగా అందిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందించే సదుపాయం కూడా ఉంది. ఈ కాంప్లెక్స్‌లో ఒక్కో అంతస్తూ ఎక్కుతూ చివరికి వెళ్లేటప్పటికి కొండమీదకు చేరుకుంటాం. ఇలా మెట్లు ఎక్కలేనివారి కోసం ఎస్కలేటర్‌ సౌకర్యం ఉంది. ఇది కాకుండా ప్రముఖులూ విశిష్ట అతిథులూ గుట్ట మీదికి చేరుకోవడానికి వారి బస దగ్గర్నుంచే ప్రత్యేక ప్రవేశ మార్గముంది. ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తుల కోసం యాదాద్రి దేవస్థానం అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్యాటరీ వాహనాలు ఉన్నాయి. వారు ఆ వాహనాల్లో నేరుగా గుట్ట మీదికి చేరుకోవచ్చు. గుట్ట మీద వాతావరణాన్ని కాలుష్యరహితంగా, ప్రశాంతంగా ఉంచే ఉద్దేశంతో చేసిన ఏర్పాటిది.

సుందరం... సువిశాలం

యాదాద్రి పైకి చేరుకున్న భక్తులకు ఆలయమూ స్వామివారి దర్శనమూ తప్ప మరో విషయమేదీ మనసులోకి రాని విధంగా ఉంటుంది అక్కడి వాతావరణం. పాత ఆలయాన్ని చూసిన భక్తులు నేటి ఆలయాన్ని చూసి విస్తుపోకమానరు. చిన్నగా ఉన్న గుట్టమీద ఆనాటి ఆలయం అంతా కలిసి అర ఎకరంలోనే ఉండేది. ఇప్పుడు చుట్టూ రిటైనింగ్‌ వాల్‌ కట్టి గుట్ట ఉపరితలాన్ని పూర్తిగా ఉపయోగానికి అనువుగా మలచుకోవడంతో వైశాల్యం బాగా పెరిగింది. నాలుగు ఎకరాల్లో ఆలయ ప్రాంగణాన్ని విశాలంగా తీర్చిదిద్దడానికీ స్వామివారి రథయాత్రకు వీలుగా చుట్టూ ఖాళీ స్థలం ఏర్పాటుకూ వీలయింది. ఈ చివరినుంచి ఆ చివరివరకూ ఉన్నట్లు కన్పించే ప్రాకారాల మీద కొలువుదీరిన శిల్పాల అందాలనూ అష్టభుజ మండపాలనూ ఎత్తైన గోపురాలనూ చూస్తుంటే రెప్పవేయడం మరిచిపోతాం.

ఆ అందాల్ని అలా కళ్లలో నింపుకుంటూ బంగారు రంగులో ధగధగా మెరిసే బ్రాస్‌ క్యూబాక్స్‌ గుండా ప్రయాణిస్తూ బ్రహ్మోత్సవ ప్రాంగణానికి చేరుకుంటాం. క్యూలైన్లను కూడా ఆలయ అందాలకు దీటుగా ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దడాన్ని యాదాద్రిలోనే చూస్తాం. కొండమీద చెట్లేమీ లేవు. అయినా ఎండ వేడిమి తగలకుండా చల్లగా ఉండేలా అల్యూమినియం, ఇత్తడీ కలిపి ఈ క్యూబాక్స్‌ను డిజైన్‌ చేశారు. జైనుల వాస్తునిర్మాణశైలిలో శంఖుచక్రాల డిజైన్లు కనిపించేలా నిర్మించిన ఈ క్యూలైన్‌ నుంచి బ్రహ్మోత్సవ ప్రాంగణం మీదుగా నేరుగా ముఖమండపంలోకి అడుగుపెడతాం. ప్రధానాలయానికి ముందు ఉన్న ఈ చిన్న మండపాన్ని రాజసం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు వాస్తుశిల్పులు. దీని గోడలపైనా స్తంభాలపైనా మాత్రమే కాదు, ఆఖరికి పై కప్పునీ వదలకుండా 32 రూపాల్లో నరసింహస్వామి చిత్రాలనూ ప్రహ్లాద చరిత్రను తెలిపే దృశ్యాలనూ చిత్రించారు. వాటిని చూసుకుంటూ తూర్పు రాజగోపురం గుండా ఆలయం లోపలికి ప్రవేశిస్తాం. రాజగోపురానికి రెండు పక్కలా నిలువెత్తు ఐరావతాలూ జయవిజయుల విగ్రహాలూ మనకి స్వాగతం చెబుతుంటాయి.

రాతి గుహ... రాజప్రాసాదం

ఆలయంలోనికి ప్రవేశించి కుడివైపుకు తిరిగి కొంచెం ముందుకు వెళ్తే త్రితల రాజగోపురం ఉంటుంది. గర్భగుడికి ప్రవేశమార్గం ఇది. దానిలోనుంచి లోపలికి వెళ్తే అక్కడ కొన్ని మెట్లు కిందికి దిగాల్సివస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది... యాదగిరీశుడు స్వయంభువుగా వెలసింది రాతి గుహ అని. ఆ గుహని ఏమాత్రం కదల్చకుండా చుట్టూ ఆలయాన్ని నిర్మించే క్రమంలో ఈ హెచ్చుతగ్గులు వచ్చాయి. అందుకే అక్కడ కొన్ని మెట్లు దిగేసరికి క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామి తొలిదర్శనం అవుతుంది. ఆయన్ని చూసుకుని మళ్లీ కొన్ని మెట్లు కిందికి దిగి అష్టభుజి ప్రాకార మండపంలో గండభేరుండస్వామి దర్శనం చేసుకుని అక్కడినుంచి మహామండపంలోనికి ప్రవేశిస్తాం. అక్కడినుంచి ఎడమవైపుకి తిరిగితే స్వర్ణకాంతులతో మెరిసిపోయే గర్భగుడి మహాద్వారం కనిపిస్తుంది. సరిగ్గా ఆ ద్వారానికి పైన- ఎత్తైన ఆ గోడ ఈ చివరి నుంచి ఆ చివరి వరకూ ప్రహ్లాద చరిత్రని కళ్లకు కట్టే చిత్రాలు మైమరిపింపచేస్తాయి. వాటిని చూసుకుంటూ క్యూలో ముందుకు నడిచి స్వయంభువుగా గుహలో వెలసిన మూలవర్లను దర్శించుకోవాలి. ఈ గర్భాలయంలో జ్వాలా నరసింహుడిగా వేదనరసింహుడిగా లక్ష్మీనరసింహుడిగా స్వామి మూడు రూపాల్లో దర్శనమిస్తారు. దర్శనానంతరం బయటకు వచ్చి ఎడమవైపుకు తిరిగితే అదంతా... మహా ముఖమండపం. విశాలంగా ఉన్న ఆ మహామండపాన్ని చూస్తే ఏ రాజప్రాసాదంలోకో అడుగుపెట్టిన అనుభూతికి లోనై ఎవరైనా ఒక్క క్షణం తబ్బిబ్బు పడడం ఖాయం.

సాధారణంగా ఏ ఆలయంలోనైనా ఒక తరహా వాస్తునిర్మాణాలూ శిల్ప కళా కన్పిస్తాయి. ఇక్కడ మాత్రం విభిన్న రీతుల్లో రూపుదిద్దుకున్న నిర్మాణాలు భక్తుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. 34 అడుగుల ఎత్తున రెండంతస్తులుగా ఉన్న ఈ మండపంలో పై అంతస్తులో కాకతీయ శైలి స్తంభాలూ, కింది అంతస్తులో 12 మంది ఆళ్వారుల విగ్రహాలూ ఉంటాయి. తమ పాశురాలతో వైష్ణవ సంప్రదాయాన్ని దక్షిణాదిన వ్యాపింపజేసిన 12 మంది ఆళ్వారుల విగ్రహాలు అటు ఆరు, ఇటు ఆరు చొప్పున నిటారుగా నిలబడి కనిపిస్తాయి. ఆళ్వారుల విగ్రహాలను విడివిడిగా కూర్చున్న రూపంలో వేర్వేరు దేవాలయాల్లో చూడొచ్చు కానీ ఇలా ఒకేచోట అందరినీ చూడడం మరెక్కడా సాధ్యం కాదు.

స్వామివారి దర్శనం తర్వాత అక్కడే వరసగా ఉన్న ఉపాలయాల్లో లక్ష్మీదేవినీ ఆళ్వార్లనీ దర్శించుకోవచ్చు. ఆ వరసలోనే స్వామివారి శయనమండపం ఉంటుంది. అందులో స్వామివారికోసం బంగరు ఊయల ఉంది. సరిగ్గా గర్భాలయానికి అభిముఖంగా రామానుజుల మందిరమూ ధ్వజస్తంభమూ బలిపీఠమూ ఉంటాయి. స్వర్ణతాపడం చేసిన ధ్వజస్తంభమూ ద్వారాలకు దీటుగా రాతి విగ్రహాలు స్వర్ణకాంతులీనడాన్నీ ఇక్కడ చూడవచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన లైటింగ్‌ వ్యవస్థ విగ్రహాలకు ఆ తేజస్సునిస్తోంది. అయితే ఆ లైట్లకు సంబంధించినవి కానీ ఎయిర్‌ కండిషనింగ్‌కి సంబంధించినవి కానీ ఎక్కడా ఎలాంటి కరెంటు వైర్లూ మనకి కన్పించవు. ఆధునిక సాంకేతికతని ఉపయోగించుకుని వందేళ్లనాటి దేవాలయంలా కన్పించేలా యాదాద్రిని తీర్చిదిద్దారు వాస్తుశిల్పులు. మహా ముఖమండపాన్ని పూర్తిగా దర్శించుకున్నాక ఉత్తరం దిశగా ఉన్న మెట్ల మీదుగా మళ్లీ పైకి వెళ్తాం. అక్కడ పడమటి రాజగోపురం ద్వారా బయటకు రెండో మాడవీధిలోకి చేరుకుంటాం. స్వామివారి నిత్యకల్యాణ మంటపం, అద్దాల మంటపం, రామానుజకూటమి(స్వామివారి ప్రసాదాలు తయారుచేసే వంటశాల) తదితరాలన్నీ ఇక్కడ ఉంటాయి. రామానుజకూటమిలో తయారైన ప్రసాదాలు నేరుగా లిఫ్టులో స్వామివారి సన్నిధికి వెళ్లిపోయే ఏర్పాటు ఉంది. మాడవీధిలో తిరిగి చూశాక పశ్చిమాన ఉన్న ఏడంతస్తుల రాజగోపురం ద్వారా ఆలయం వెలుపలకు వచ్చేస్తాం. ఈ గోపురానికి ఎదురుగా బయట వేంచేపు మండపం ఉంటుంది. అందులో స్వామివారి అలంకార సేవ ఉత్సవం జరుగుతుంది. భక్తులకు నిత్యం దర్శనమిచ్చేందుకు స్వామివారు అక్కడ వేంచేసి ఉంటారు.

శివాలయమూ కోనేరూ...

రెండు మాడవీధులూ చుట్టి ఆలయం బయటకు వచ్చేశాక ప్రసాదాల వితరణ విభాగం కనిపిస్తుంది. ఒక పక్కగా స్వామివారి కోనేరు, మరో పక్కగా రథమంటపమూ ఉంటాయి. ప్రసాదం తీసుకున్నాక మెట్ల మీదుగా కొంచెం కిందికి దిగితే పునర్నిర్మించిన శివాలయం ఉంటుంది. వైష్ణవాలయం నుంచి శివాలయంలోకి ప్రవేశించిన తక్షణం ఆ మార్పు స్పష్టంగా తెలిసేలా చేస్తుంది త్రిశూలాల డిజైనుతో తీర్చిదిద్దిన ప్రాకారం. ఆ ఆలయంలో శివదర్శనానంతరం అక్కడి ఆహ్లాదకరమైన పరిసరాల మధ్య కాసేపు గడిపి తిరిగి గుట్ట కిందికి వచ్చేయొచ్చు. దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చేసరికి చీకటి పడినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బంగరు రంగు దీపాలతో సరికొత్త అందాలను సంతరించుకుని మెరిసిపోయే ఆలయ ప్రాంగణాన్ని మనసారా వీక్షించేందుకు మరో అవకాశం అది. అంత పెద్ద ఆలయమూ బంగారు రంగులో ధగద్ధగాయమానంగా వెలిగిపోతుంటే... భక్తి పారవశ్యంతో చూస్తూ ఉండడం మినహా అసలు అక్కడినుంచి వెళ్లిపోవాలన్న ఆలోచనే రాదేమో. వెళ్లక తప్పదు కాబట్టి... మళ్లీ వద్దామన్న ఆశ ఒకటి మదిలో మెదులుతూనే ఉంటుంది కాబట్టి... కొండమీద కొలువైన దేవుడిని గుండెనిండా నింపుకుని తిరుగుప్రయాణమవుతాం.


ఆహ్లాదకరం... గిరి ప్రదక్షిణం!

ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ. ఆ తర్వాతే దైవదర్శనం చేసుకుంటాం. ప్రదక్షిణ... అన్న పదంలో ఒక్కో అక్షరానికీ ఒక్కో అర్థం చెబుతారు పెద్దలు. ‘ప్ర’ అంటే సకల పాపాల నిర్మూలన అనీ, ‘ద’ అంటే సకలైశ్వర్య ప్రదానమనీ, ‘క్షి’కి అర్థం పునర్జన్మల నాశనమనీ, ‘ణ’ అంటే జ్ఞానమోక్ష ప్రసాదమనీ వివరిస్తారు. ఆలయ ప్రదక్షిణకే అంత ప్రాముఖ్యమున్నప్పుడు ఇక గిరిప్రదక్షిణ ఇంకెంత గొప్ప విషయం..! కానీ గిరిప్రదక్షిణం చేసే వెసులుబాటు కొన్ని ఆలయాలకే ఉంటుంది. పెద్ద కొండపై దైవం వెలసి ఉన్నప్పుడు ఆ కొండ మొత్తాన్నీ దైవస్వరూపంగా భావించి భక్తిశ్రద్ధలతో దానిచుట్టూ చేసేదే- గిరిప్రదక్షిణ. యాదాద్రి కూడా అలాంటి ఒక కొండ కావడం కలిసివచ్చింది. ఈ పంచనారసింహ క్షేత్రంలో కొండనే నరసింహుని ఐదో రూపంగా భావించి గిరి ప్రదక్షిణ చేస్తారు భక్తులు. అయితే గతంలో అందుకు సరైన దారి ఉండేది కాదు. ఇప్పుడు యాదాద్రి నారసింహక్షేత్రాన్ని సందర్శించే భక్తులకు గిరిప్రదక్షిణ చేసుకునే వెసులుబాటు ఉంది. గుట్ట చుట్టూ వినూత్నంగా నిర్మించిన ప్రదక్షిణా పథంలో భక్తులు ఎలాంటి అలసట లేకుండా చెట్ల నీడలో ఆహ్లాదంగా ప్రదక్షిణ చేయవచ్చు. యాదాద్రి క్షేత్రంలోకి ప్రవేశించగానే కన్పించే వైకుంఠ ద్వారం దగ్గరినుంచే గిరిప్రదక్షిణా పథం కూడా ప్రారంభమవుతుంది. కొంచెం ముందుకు వెళ్లగానే తన తపోబలంతో శాంతమూర్తిగా లక్ష్మీనరసింహుడు ఇక్కడ వెలిసేందుకు కారణమైన యాదమహర్షి పేరున ఏర్పాటుచేసిన ‘యాదమహర్షి తపో వృక్షస్థలి’ కనిపిస్తుంది. కొండ పైకి వెళ్లే రహదారి కూడా అక్కడినుంచే మొదలవుతుంది. ఆ తర్వాత వివిధ మహిమాన్విత వృక్షాలతో ఏర్పాటుచేసిన నక్షత్ర వనం కన్పిస్తుంది. ఆ సమీపంలోనే కాలినడకన గుట్ట మీదికి వెళ్లాలనుకునే భక్తుల కోసం మెట్ల దారి ఉంది. ప్రదక్షిణామార్గంలో మరింత ముందుకు వెళ్తే గండి చెరువులో స్వామివారి తెప్పోత్సవం నిర్వహించే లక్ష్మీ పుష్కరిణి, ఆ పక్కగా కల్యాణ కట్ట, దీక్షాధారుల కాంప్లెక్స్‌, భక్త జన పుష్కరిణులు కన్పిస్తాయి. ప్రదక్షిణా మార్గంలో ఏ పక్క నుంచి చూసినా పైన దేవాలయ గోపురాలు భిన్న కోణాల్లో కనిపిస్తూంటే ‘యాదగిరి నరసింహా ఆదుకో... నీ కొండకు చేదుకో...’ అంటూ ఉల్లాసంగా నినదిస్తూ గిరిప్రదక్షిణని అనాయాసంగా పూర్తిచేయొచ్చు భక్తులు.


స్వామి అభిషేకానికి గోదావరి జలాలు!

మెట్ట ప్రాంతం కావడంతో సరైన నీటి వసతి లేక యాదాద్రి భువనగిరి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఒకప్పుడు కరవు ప్రాంతాలుగా ఉండేవి. సాగునీరు కాదు కదా తాగు నీరు కూడా దొరకడం కష్టంగా ఉండేది. దాంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి యాదాద్రి పరిసరాల్లోని బస్వాపూర్‌ రిజర్వాయర్‌కి గోదావరి జలాలను తెప్పించే ఏర్పాటు చేయించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఆ రిజర్వాయర్‌ పేరుని కూడా ‘నృసింహ సాగర్‌’గా మార్చారు. రోజూ స్వామివారి అభిషేకాలకీ, తెప్పోత్సవం నిర్వహించే లక్ష్మీపుష్కరిణికీ ఇప్పుడు పవిత్ర గోదావరి జలాలు నిత్యం అందుబాటులో ఉంటాయి.

(సమాచార సహకారం: జీడిపల్లి దత్తురెడ్డి, ఈనాడు, నల్గొండ; రాఘవుల అశోక్‌కుమార్‌, న్యూస్‌టుడే, యాదాద్రి; ఫొటోలు: కె.శ్రీనివాస్‌)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..