కురుల నుంచి ప్రొటీన్‌ తీయొచ్చు!

నెత్తిన ఉన్నప్పుడే కాదు, కత్తెరపడినా జుట్టు విలువైనదేనంటున్నారు భారతీయ శాస్త్రవేత్తలు. అందులో విలువైన మూలకాలు ఉంటాయని చెబుతున్నారు.

Updated : 21 May 2023 04:24 IST

నెత్తిన ఉన్నప్పుడే కాదు, కత్తెరపడినా జుట్టు విలువైనదేనంటున్నారు భారతీయ శాస్త్రవేత్తలు. అందులో విలువైన మూలకాలు ఉంటాయని చెబుతున్నారు. జుట్టు అనేక రకాల ప్రొటీన్లతో రూపొందుతుంది. దీని నిర్మాణంలో కెరాటిన్‌ అనే ప్రొటీన్‌ది కీలక పాత్ర. జుట్టుకి రంగు నిచ్చేది మెలనిన్‌. ఈ రెంటినీ సేకరిస్తే జీవ ఔషధాల తయారీలో ఉపయోగపడతాయి. కానీ వీటి సేకరణ సంక్లిష్టం. కోల్‌కతాలోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌’కు చెందిన ప్రొఫెసర్‌ పౌలమి ఘోష్‌, ఆమె సహోద్యోగులు దీనికో సులభ విధానాన్ని కనుగొన్నారు. సెలూన్ల నుంచి సేకరించిన జుట్టుని శుభ్రపరచి చిన్న ముక్కలుగా కత్తిరించారు. ఆపైన దాన్ని ఒక అయానిక్‌ ద్రావణంలో కలిపారు. తద్వారా కెరాటిన్‌ ప్రొటీన్లను కలిపి ఉంచే హైడ్రోజన్‌ బంధాల్ని విడగొట్టగలిగారు. ఆపైన ఆ మిశ్రమాన్ని వేడిచేసి హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌లోకి ఒంపినపుడు మెలనిన్‌ పిగ్మంట్‌ ఘనరూపంలో వేరుపడింది. ఆపైన డయాలసిస్‌ చేసి కెరాటిన్‌నూ సేకరించారు. ఇలా సేకరించిన కెరాటిన్‌ని హెమోస్టాటిక్‌ బ్యాండేజీల్లో, మెలనిన్‌ని యూవీ కిరణాల నుంచి సంరక్షించే ఉత్పత్తుల్లో వాడొచ్చట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..