పెరుగు కూరలు... చల్లగా, హాయిగా!

ఎండాకాలంలో చల్లని పెరుగు తింటే ఎంత హాయిగా ఉంటుందో చెప్పక్కర్లేదు. అందులోనే ఇలాంటి పదార్థాలు కలిపితే... నోరూరించే పెరుగు కూరలు రెడీ అవుతాయి. ఎప్పుడైనా కూర, పప్పు, సాంబార్‌... ఇలా అన్నీ చేసుకోవడానికి బద్ధకించినప్పుడు

Updated : 17 Apr 2022 04:53 IST

పెరుగు కూరలు... చల్లగా, హాయిగా!

ఎండాకాలంలో చల్లని పెరుగు తింటే ఎంత హాయిగా ఉంటుందో చెప్పక్కర్లేదు. అందులోనే ఇలాంటి పదార్థాలు కలిపితే... నోరూరించే పెరుగు కూరలు రెడీ అవుతాయి. ఎప్పుడైనా కూర, పప్పు, సాంబార్‌... ఇలా అన్నీ చేసుకోవడానికి బద్ధకించినప్పుడు ఇలాంటివి ఒకటి చేసుకున్నా భోజనాన్ని కానిచ్చేయొచ్చు.  


ఆలూమేథీ దహీ కర్రీ  

కావలసినవి: మెంతికూర తరుగు: కప్పు, ఉడికించిన బంగాళాదుంప: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, పెరుగు: కప్పు, ఉల్లిపాయ: ఒకటి, ఆవాలు: అరచెంచా, మెంతులు: పావుచెంచా, సోంపు: అరచెంచా, పసుపు: పావుచెంచా, కారం: అరచెంచా, జీలకర్రపొడి: చెంచా, నూనె: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత.

తయారీవిధానం: బంగాళాదుంపను ముక్కల్లా కోసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, మెంతులు, సోంపు వేయించుకుని ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. తరువాత మెంతికూర, బంగాళాదుంప ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు, కారం, జీలకర్రపొడి వేసి బాగా కలిపి కాసిని నీళ్లు పోయాలి. ఇది కూరలా అయ్యాక దింపేయాలి. ఈ మిశ్రమం చల్లగా అయ్యాక పెరుగులో వేసి బాగా కలపాలి.


మామిడికాయతో...

కావలసినవి: మామిడికాయ: ఒకటి, పెరుగు: కప్పు, ఉల్లిపాయముక్కలు: కప్పు, పచ్చిమిర్చి: రెండు, పసుపు: అరచెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, ఆవాలు: చెంచా, మినప్పప్పు: చెంచా, ఎండుమిర్చి: రెండు, ఇంగువ: చిటికెడు, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కట్ట, నూనె: చెంచా.

తయారీవిధానం: మామిడికాయ చెక్కు తీసి ముక్కల్లా కోసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, ఇంగువ, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేయించి, మామిడికాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మామిడి ముక్కలు మెత్తగా అవుతున్నప్పుడు కలిపి దింపేయాలి. పెరుగును క్రీంలా వచ్చేలా గిలకొట్టుకుని అందులో మామిడి మిశ్రమం కలిపి కొత్తిమీర వేసుకోవాలి.


క్యారెట్‌తో...

కావలసినవి: క్యారెట్‌: ఒకటి, అల్లం తరుగు: అరచెంచా, ఉల్లిపాయ: ఒకటి, పెరుగు: ముప్పావుకప్పు, పచ్చిమిర్చి: రెండు, నూనె: చెంచా, ఆవాలు: అరచెంచా, జీలకర్ర: అరచెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కట్ట, కొబ్బరి తురుము: టేబుల్‌స్పూను, పసుపు: పావు చెంచా.

తయారీవిధానం: పెరుగును బాగా గిలకొట్టి పెట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేయించి... ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయముక్కలు వేగాక పసుపు, క్యారెట్‌ తరుము, కొబ్బరి తురుము, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి. ఈ మిశ్రమాన్ని పెరుగులో కలిపి చివరగా కొత్తిమీర తరుగు వేస్తే సరి.


టొమాటోతో...

కావలసినవి: టొమాటోలు: అరకేజీ, సెనగపప్పు: మూడు టేబుల్‌స్పూన్లు, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: అరచెంచా, ఆవాలు: అరచెంచా, కరివేపాకు రెబ్బలు: ఎనిమిది, ఉల్లిపాయలు: రెండు, పచ్చిమిర్చి: ఆరు, కొత్తిమీర: కట్ట, పెరుగు: ఒకటిన్నర కప్పు, ఉప్పు: తగినంత, ఎండుమిర్చి: రెండు, పసుపు: పావు చెంచా.

తయారీవిధానం: సెనగపప్పును గంటముందు నానబెట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేయించుకోవాలి. తరువాత నానబెట్టుకున్న సెనగపప్పు వేసి బాగా కలిపి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు వేసి వేయించాలి. టొమాటో ముక్కలు మెత్తగా అయ్యాక కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి స్టౌని కట్టేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక గిలకొట్టిన పెరుగులో వేసి కలపాలి.


కొబ్బరి పెరుగు కూర

కావలసినవి: పెరుగు: మూడుకప్పులు, కొబ్బరి తురుము: రెండుంబావు కప్పులు, జీలకర్ర: మూడు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: రెండు, నీళ్లు: కప్పు, ఉప్పు: తగినంత, నెయ్యి: టేబుల్‌స్పూను, ఎండుమిర్చి: రెండు, కరివేపాకు రెబ్బలు: మూడు, కొత్తిమీర: కట్ట.

తయారీవిధానం: ముందుగా రెండు టేబుల్‌స్పూన్ల జీలకర్రను దోరగా వేయించుకుని తీసుకోవాలి. జీలకర్ర వేడి చల్లారాక కొబ్బరితురుము, పచ్చిమిర్చితో కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగులో నీళ్లు, తగినంత ఉప్పు వేసుకుని క్రీంలా వచ్చేలా గిలకొట్టుకుని ఆ తరువాత కొబ్బరి మిశ్రమాన్ని కలపాలి. ఈ పెరుగును ఓ గిన్నెలో తీసుకుని స్టౌమీద పెట్టి కలుపుతూ ఉండి... చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి. స్టౌమీద మళ్లీ కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఎండుమిర్చి, కరివేపాకు, మిగిలిన జీలకర్ర వేయించుకుని స్టౌని కట్టేయాలి. ఈ తాలింపునూ, కొత్తిమీర తరుగునూ పెరుగులో వేసి బాగా కలిపితే సరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..