ఉర్లి... వస్తోంది సరికొత్తగా!

అందాన్నీ ప్రశాంతతనీ కలిపేసుకుంటూ ఇంటికి శోభతెచ్చే అలంకరణ వస్తువే- ఉర్లి. ఇదివరకు వేడుకల్లోనే ప్రత్యేక ఆకర్షణగా కనిపించే ఈ పూల ముగ్గుల ఉర్లీలు...ఇప్పుడు నిత్యం ఇంటి అలంకరణలోనూ భాగమయ్యాయి. ఉర్లి పాత్రల్లోనే ఎన్నెన్నో ఆకారాలు కొత్తగా ప్రత్యక్షమవుతున్నాయి!

Updated : 04 Feb 2024 17:12 IST

అందాన్నీ ప్రశాంతతనీ కలిపేసుకుంటూ ఇంటికి శోభతెచ్చే అలంకరణ వస్తువే- ఉర్లి. ఇదివరకు వేడుకల్లోనే ప్రత్యేక ఆకర్షణగా కనిపించే ఈ పూల ముగ్గుల ఉర్లీలు...ఇప్పుడు నిత్యం ఇంటి అలంకరణలోనూ భాగమయ్యాయి. ఉర్లి పాత్రల్లోనే ఎన్నెన్నో ఆకారాలు కొత్తగా ప్రత్యక్షమవుతున్నాయి!

పెళ్లిలో సారెగా బోలెడన్ని ఇత్తడి పాత్రలు ఇచ్చారు. కానీ ప్రస్తుతం వాటి అవసరం ఏముంటుందని ఎక్కడో మూలన పెట్టేసింది వాణి. కానీ ఓసారి స్నేహితురాలి ఇంటికి వెళ్లినప్పుడు చూసిన ఓ అలంకరణ వస్తువుతో ఆ ఇత్తడి పాత్రల్ని ఎలా వాడాలో తెలుసుకుంది. అనుకున్నదే తడువుగా ఇత్తడి గంగాళాన్ని తీసుకుని హాల్లో పెట్టేసింది. దాంట్లో నీళ్లు పోసి రంగురంగుల పూలతో డెకరేట్‌ చేసేసింది. ఇలా వాడకంలో లేని పాత్రల్ని వృథాగా ఉంచడమెందుకనీ అలంకరణలోకి తీసుకొస్తే పుట్టుకొచ్చిన సంప్రదాయమే ఉర్లి.

ఇంటింటా చేరాయి...

నిజానికి ఈ ఉర్లి సంప్రదాయం మొదలైంది కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనే. తమిళంలో ఉరులై అంటే గుండ్రని గిన్నె అని అర్థమట. అప్పట్లో పెద్ద పెద్ద పాత్రల్ని ఆయుర్వేద మందుల తయారీకి వాడేవారట. వాటి వాడకం తగ్గిపోయాక వాటినే ఉర్లిలా వాడటం ప్రారంభించారు. నెమ్మదిగా ఈ సంప్రదాయం అన్ని చోట్లకీ పాకిపోయింది. అంతలా అందరి ఇళ్లకీ చేరువైన ఉర్లి సాదాగా ఉంటే ఎలా మరి... అందుకే మట్టి, సిరామిక్‌, రెజిన్‌ పదార్థాలతో పాటు కంచు, రాగి, వెండి, బంగారపు లోహాల మెరుపులతోనూ ఈ పాత్రలు వస్తున్నాయి. ఒకప్పుడు గుండ్రని పాత్రలా ఉండే ఉర్లి... ఇప్పుడు రకరకాల జీవుల ఆకారాలతో కనువిందుచేస్తోంది. ఎన్నెన్నో దేవుళ్ల రూపాలతో ఆకట్టుకుంటోంది. అంతేకాదు, కాస్త మోడ్రన్‌ టచ్‌తో అమ్మాయిల బొమ్మలతోనూ అందుబాటులో ఉన్నాయివి. హాల్లో ఓ పక్కనో, పూజగది ముందరనో పెట్టుకునే ఈ ఉర్లీలతో శుభం కలుగుతుందని చెబుతుంటారు. ఆ మాటలో నిజమెంతో గానీ నీటిపైన వేసిన పూల ముగ్గులు చూడ్డానికి ఆహ్లాదంగా ఉంటాయి. అందులోని పూల వాసనలు ఇల్లంతా గుబాళిస్తూ మనసుకు హాయినీ ఇస్తాయి. ఉర్లీల ఈ ప్రత్యేకతలు తెలిసే కాబోలు... శుభకార్యాలూ దేవుడి పూజలూ వంటి వేడుకలప్పుడే కాకుండా రోజువారీ ఇంటి అలంకరణలోనూ వీటిని భాగం చేసేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..