నచ్చావులే... తెచ్చానులే!

ఇష్టపడ్డ అమ్మాయికి ‘ఐ లవ్‌ యూ’ అంటూ ప్రపోజ్‌ చేయడానికో కానుక, ‘నా ప్రేమకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన రోజు ఇది’ అని ఆ మధుర క్షణాల్ని గుర్తుచేసుకుంటూ జరిపే లవ్‌ యానివర్సరీకి మరో బహుమతి, ప్రియురాలిని విడిచి రెండ్రోజులు దూరంగా వెళుతుంటే ‘ప్రతీ క్షణం నిన్నే తలచుకుంటా’ అన్నమాటలతో పాటూ ఆ ఎడబాటునూ చూపిస్తూ ఒక గిఫ్ట్‌.

Updated : 11 Feb 2024 01:36 IST

ఇష్టపడ్డ అమ్మాయికి ‘ఐ లవ్‌ యూ’ అంటూ ప్రపోజ్‌ చేయడానికో కానుక, ‘నా ప్రేమకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన రోజు ఇది’ అని ఆ మధుర క్షణాల్ని గుర్తుచేసుకుంటూ జరిపే లవ్‌ యానివర్సరీకి మరో బహుమతి, ప్రియురాలిని విడిచి రెండ్రోజులు దూరంగా వెళుతుంటే ‘ప్రతీ క్షణం నిన్నే తలచుకుంటా’ అన్నమాటలతో పాటూ ఆ ఎడబాటునూ చూపిస్తూ ఒక గిఫ్ట్‌. ఇలా ఒక్కటేంటీ... ప్రేయసీప్రియులు ఎన్నెన్నో బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలాంటి కానుకలన్నీ ఒకెత్తయితే... ప్రేమికుల పండుగగా చెప్పే వాలెంటైన్స్‌ డే రోజున ఇచ్చే బహుమతులు మరొకెత్తు. అందుకే మరి, రాబోయే ఈ ప్రేమికుల దినోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా చేయడానికి ఈసారి మార్కెట్లోకి ఎన్నో కానుకలొచ్చాయ్‌!

రోజుకో బహుమతి!

వాలెంటైన్స్‌ డే ఒక్క రోజే కానీ వారం ముందు నుంచే ప్రేమ పండుగ మొదలవుతుంది. ఫిబ్రవరి ఏడో తేదీన రోజ్‌ డేతో మొదలైతే ఫిబ్రవరి 14 వరకూ ప్రపోజ్‌ డే, చాక్లెట్‌ డే, టెడ్డీ డే, ప్రామిస్‌ డే, హగ్‌ డే, కిస్‌ డే... అంటూ ఒక్కో రోజుకీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందుకు తగ్గట్టే అన్ని రోజులూ తమ ప్రేమను చూపాలనుకునేవారి కోసం ప్రత్యేకంగా ‘సెవెన్‌ డేస్‌ వాలెంటైన్‌ హ్యాంపర్‌, వాలెంటైన్‌ వీక్‌ హ్యాంపర్‌’ అంటూ బహుమతుల సెట్లూ దొరుకుతున్నాయి. ఓయె హ్యాపీ, ఇండియా గిఫ్ట్స్‌ లాంటి రకరకాల ఆన్‌లైన్‌ గిఫ్ట్‌ వెబ్‌సైట్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. మనం ముందుగానే ఆర్డర్‌ చేశామంటే వారం రోజులూ రోజుకో రకం కానుక అందించి ‘ప్రియమైన’ వారిని ఆశ్చర్యపరచొచ్చు. అంతేకాదు, ప్రేమికుల దినోత్సవం రోజున మరింత ప్రత్యేకంగా రెండు, మూడు గంటలకోసారి ఒక్కో గిఫ్ట్‌ ఇచ్చేలా ‘24 అవర్‌ ప్రీమియమ్‌ వాలెంటైన్‌ హ్యాంపర్‌’నీ ఎంచుకోవచ్చు.

ప్రియమైన బంగారానికి!

ప్రేయసి మనసుకు హత్తుకునే కానుక ఇవ్వాలనుకుంటూ ముందు నుంచే ప్రేమికుడు ఆలోచనల్లో మునిగిపోతాడు.

‘నీలీ నీలీ ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా’ అంటూ ఊహల్లో బోలెడన్ని పాటలందుకుంటాడు.

ఏది ఏమైనా, ప్రియురాలి హృదయం ముందు చిన్నబోకుండా ఉండే బహుమతి మాత్రం కావాలంటూ తెగ వెతుకుతాడు. అలాంటి అద్భుతమైన కానుకల్లో ఒకటి జ్యువెలరీ. లాకెట్‌, ఉంగరం, బ్రాస్‌లెట్‌... ఇలా ఏదైనా కానీ ఆ బంగారపు నగలో తన ప్రేమనూ చూపాలనుకుంటాడు. అది గ్రహించే తయారీదారులు ప్రేమ గుర్తుల్ని పసిడిమెరుపులతో కలిపి సరికొత్త డిజైన్లను తీసుకొస్తున్నారు. ఇదివరకు సాదా హృదయాకారంలో ఉండే లవ్‌ లాకెట్లూ ఉంగరాలూ- ఇప్పుడు లవ్‌ పదంలోని అక్షరాలూ గులాబీ పువ్వులూ ప్రేమికుల జంటల రూపాలతో... రాళ్లూ రత్నాలూ పొదువుకుంటూ ఎంతో అందంగా వస్తున్నాయి. ఇంకా మనసులోని మాటలూ ఫొటోలూ దాచుకుంటూ సీక్రెట్‌, ఎన్వలప్‌ లాకెట్లూ అందుబాటులో ఉన్నాయి.

ప్రేమికుల కొవ్వొత్తులు!

వాలెంటైన్స్‌ డే ప్రేమికులకు మాత్రమేనా... పెళ్లిచేసుకున్న జంటలూ మిగతా ప్రత్యేక రోజుల్లానే ప్రేమికుల దినోత్సవాన్నీ ఫాలో అయిపోతుంటాయి. అందుకే కేక్‌ కటింగ్‌ చేయడమే కాదు, బెలూన్లూ కొవ్వొత్తులతో డెకరేట్‌ చేస్తుంటారు. అలంకరణకు ఉపయోగపడే బుడగల్లో హార్ట్‌ ఆకారంలోవి దొరికినట్టే కొవ్వొత్తుల్లోనూ ఉన్నాయి. హృదయాకారంతో పాటు వాలెంటైన్స్‌ డే అక్షరాలూ ప్రేమికుల బొమ్మల్లాంటివెన్నో కొవ్వొత్తులుగా వస్తున్నాయి. అంతేకాదు, ఈ ప్రేమ కొవ్వొత్తులతో కాస్త రొమాంటిక్‌ క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ను ఏర్పాటుచేశారంటే... మీ ప్రేయసి లేదా ప్రియుడికి కచ్చితంగా అది మరిచిపోలేని రోజవుతుంది!

ప్రేమ తెలపడానికో రోజా!

ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి చేతికి ఎర్ర గులాబీ పువ్వును అందిస్తే చాలు... ‘ఐ లవ్‌ యూ’ అన్న మూడు పదాలూ చెప్పకపోయినా- అబ్బాయి మనసులో దాగున్న ప్రేమ వ్యక్తమైపోతుందక్కడ. ఎందుకంటే ప్రేమ గుర్తుగా భావించే గులాబీనే చెప్పేస్తుందా మాట కూడా. అందుకే మరి, గులాబీ పువ్వుకు అంత క్రేజ్‌. మార్కెట్లోనూ గులాబీ పువ్వుల్లో బోలెడన్ని రకాలున్నాయి. తాజా రోజా పూల బొకేలతోపాటు పదికాలాల పాటు పదిలంగా ఉండే బంగారు మెరుపుల గులాబీలూ వాడిపోని ప్రిజర్వ్‌డ్‌ రోజాలూ గ్లాస్‌ రోజ్‌ ఫ్లవర్‌ గిఫ్టులూ ఎన్నెన్నో ఉన్నాయి.

భలే గ్రీటింగ్‌ కార్డు!

‘ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపనూ- ఎదలోని ప్రేమనూ మృదువైన మాటనూ’ అంటూ ఓ అమ్మాయి తన మనసులోని మాటను ప్రేమించిన అబ్బాయికి చెప్పడానికి సిగ్గుపడిపోతూ కాగితం మీద అక్షరాలుగా పేర్చి గ్రీటింగ్‌ కార్డులా అందిస్తుంది. అందుకేనేమో తరాలు మారినా ప్రేమికుల వారధి గ్రీటింగ్‌ కార్డుల్లో కొత్తరకాలు వస్తూనే ఉన్నాయి. వాలెంటైన్స్‌ డే మిర్రర్‌ కార్డులో ప్రియమైనవారి ఫొటోల్ని పెట్టకపోయినా... అది వాళ్లచేతుల్లోకి చేరితే చాలు, నిజమైన ముఖం కార్డులో ప్రత్యక్షమవుతుంది. అందులో ఉండే అద్దమే అందుకు కారణం మరి. ఇంకా మనసులోని భావాల్ని చెప్పే లవ్‌స్టోరీ రొమాంటిక్‌ కార్డ్స్‌, వుడెన్‌ గ్రీటింగ్‌ కార్డ్స్‌లాంటి వెరైటీలెన్నో ఉన్నాయి.

వాలెంటైన్‌ పిజ్జా!

ప్రేమను చూపుతూ... తినిపించొచ్చు కూడా. ఎలాగంటే... పిజ్జా ప్రియుల కోసం ప్రేమికుల దినోత్సవం రోజున కొన్ని ప్రముఖ పిజ్జా రెస్టరంట్లు లవ్‌ పిజ్జాల్ని తయారు చేసిస్తాయి. లవర్స్‌ అడ్డాల్లో భాగమైన ఈ రెస్టరంట్లు-  ప్రేమికుల కోసం ప్రత్యేకంగా ఇలా హృదయాకారంలో పిజ్జాని చేసి పెడుతున్నాయి. ఎంచక్కా ప్రేమ ముచ్చట్లతో పాటు ప్రేమ ముద్దలూ తినేయొచ్చు. హోటళ్లలోనే కాదు, కావాలంటే ఇంట్లోనూ ఈ లవ్‌ పిజ్జాని సొంతంగా తయారు చేసి మనసైన వారిని ఆశ్చర్యపరచొచ్చు!

పచ్చని ప్రేమ!

మీ మనసు దోచుకున్న చిన్నదానికి పచ్చని మొక్కలంటే ప్రాణమా... అయితే మీమీద తనలో ప్రేమ చిగురించేలా వాలెంటైన్‌ ప్లాంట్స్‌ని ఇచ్చేయండి. హార్ట్‌ బాంబూ, లవ్‌  హొయా ప్లాంట్‌, హార్ట్‌ సక్యులెంట్‌ పేర్లతో ప్రేమ మొక్కలు దొరుకుతున్నాయి. లక్కీ వెదురూ ఇంకా కొన్ని సక్యులెంట్‌ మొక్కల్నే హృదయాకారం కనిపించేలా ప్రేమికుల కోసం ప్రత్యేకంగా తయారుచేస్తున్నారు. లవ్‌ హొయా మాత్రం గుండె ఆకారపు ఆకులతో ఉండే ఎడారి మొక్క.

లవ్‌ లైట్లు!

గుడ్‌నైట్‌ చెప్పి ఫోన్‌ పెట్టేశాక కూడా మనం ఇష్టపడ్డ వ్యక్తి మదిలో మనమే మెదలాలనుకుంటే... ఈ లవ్‌లైట్స్‌ని బహుమతిగా ఇవ్వొచ్చు. బల్బుల్లోనే లవ్‌లెటర్‌ లైట్‌ బాక్స్‌, వాలెంటైన్‌ ట్రీ లాంటివి దొరుకుతున్నాయి. మనసులోని మాటలతో ఉన్న చిట్టి చిట్టి బల్బులు వాలెంటైన్‌ ట్రీకి భలేగా వేలాడుతూ కనిపిస్తుంటాయి. ఇవేకాదు, వాలెంటైన్స్‌ డే విండో లైట్స్‌ పేరుతో ఇంకా చాలా రకాలే వచ్చాయి. గదిలో పెట్టుకోవడానికే కాదు అలంకరణ చేయడానికీ ఇవి ఉపయోగపడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..