బంగారు నగలకు రంగుల హంగులు!

బంగారు నగలమీద అమ్మాయిల మోజు తెలియంది కాదు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు మార్కెట్లోకి వస్తూ ట్రెండ్‌ సృష్టిస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే- దుస్తుల్లో మాదిరిగానే ఒక్కో సీజన్‌లో ఒక్కో కలెక్షన్‌ని తీసుకొస్తూ అమ్మాయిల్ని ఆకర్షిస్తున్నాయి

Published : 20 Feb 2022 00:01 IST

బంగారు నగలకు రంగుల హంగులు!

బంగారు నగలమీద అమ్మాయిల మోజు తెలియంది కాదు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు మార్కెట్లోకి వస్తూ ట్రెండ్‌ సృష్టిస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే- దుస్తుల్లో మాదిరిగానే ఒక్కో సీజన్‌లో ఒక్కో కలెక్షన్‌ని తీసుకొస్తూ అమ్మాయిల్ని ఆకర్షిస్తున్నాయి జ్యువెలరీ సంస్థలు. అలా సరికొత్తగా వచ్చినదే ఈ హ్యాండ్‌ పెయింటెడ్‌ జ్యువెలరీ..!

‘పార్టీకి ఆ టెంపుల్‌ జ్యువెలరీ పెట్టుకుని వెళ్లాలా... నో వే, అది జమానా... ఇప్పుడంతా ఫ్లోరల్‌ ట్రెండే నడుస్తోంది...’ అంటూ అమ్మాయి అలకపాన్పు ఎక్కిందనుకోండి... దాని కోసం దుకాణానికి పరిగెత్తక తప్పదు మరి. ఎందుకంటే ఒకటో రెండో బంగారు నగలు ఉంటే చాలనుకునే రోజులు పోయాయి. మొన్న కాసులపేరూ నిన్న రామ్‌పరివార్‌, నేడు బొట్టుమాల... ఇలా జ్యువెలరీలోనూ వందల డిజైన్లు వస్తున్నాయి. వాటి సరసన ఇప్పుడు హ్యాండ్‌ పెయింటెడ్‌ జ్యువెలరీ కూడా చేరిందన్నమాట. అదీగాక, కలర్‌ఫుల్‌గా ఉండేందుకు ఎప్పుడూ ఆ రాళ్లే ఎందుకనుకున్నారో ఏమో నగల డిజైనర్లు ఇప్పుడు వజ్రాలు పొదిగి చేసిన బంగారు నగలకు సైతం చేత్తోనే రంగులద్దేస్తున్నారు. అయితే వీటిలో పెండెంట్‌లూ చెవి పోగులూ ఉంగరాలే ఎక్కువ. నెక్లెసుల్లాంటివి ఉన్నా అవీ సింపుల్‌ డిజైన్లలోనే ఉంటున్నాయి. దాంతో అమ్మాయిలు ఈ పెయింటెడ్‌ జ్యువెలరీ మీద మనసు పారేసుకుంటున్నారు.

అలాగని రంగులద్దిన నగలు కొత్తవని చెప్పలేం. ఎనామిల్‌ లేదా మీనాకారి జ్యువెలరీ ఎప్పటినుంచో వాడుకలో ఉంది. అయితే ఆయా నగల్లో- గాజుపొడి కలిపిన రంగుల్ని వేసి మంటకి గురిచేస్తారు. ఆ తరవాత వాటిని పాలిష్‌ చేయడంతో ఆ రంగులు నున్నగా మెరుస్తుంటాయి. చూడ్డానికి కాస్త ముద్దగానూ అనిపిస్తాయి. అదే కొత్తగా వస్తోన్న హ్యాండ్‌ పెయింటెడ్‌ జ్యువెలరీలోని రంగులు చూడ్డానికి అచ్చం కుంచెతో వేసిన అందమైన చిత్రాన్ని తలపిస్తాయి. పెయింట్‌ వేసినప్పటికీ వెనక ఉన్న బంగారం డిజైన్‌ కూడా కనిపిస్తూ ఎంతో బాగుంటున్నాయి. దాంతో ఈ బంగారు నగలు ఓ సుందర కళాఖండాన్ని చూసిన ఫీల్‌ కలిగిస్తున్నాయి. పైగా సీతాకోకచిలుకా, నెమలీ, ఆకులూ, గులాబీ, చామంతీ... వంటి డిజైన్లతో వినూత్నంగానూ ఉంటున్నాయి. ఎక్కువ హడావుడి లేకుండా సాదా డిజైన్లతో ఉంటున్నాయి కాబట్టి ఆఫీసుకీ చిన్న చిన్న ఫంక్షన్లకీ నైట్‌పార్టీలకీ వీటిని పెట్టుకుంటే క్లాసీగానూ ఉంటుంది. అదీగాక భారీ టెంపుల్‌ డిజైన్లతో విసుగెత్తిపోయిన యువతరానికి సునిశితమైన డిజైన్లతో నాజూకుగా ఉన్న ఈ నగలు చూడగానే నచ్చేస్తున్నాయట. మరి మీకూ నచ్చాయా!


గోరింట డిజైన్లు పెట్టుకోలేరా.. స్టెన్సిల్‌ వచ్చింది!

గోరింటాకు పెట్టుకోవడమంటే చాలా ఇష్టం. కానీ చక్కని డిజైన్‌ వేసుకోవడం రాదు. అలాగని అస్తమానం బ్యూటీపార్లర్లకూ వెళ్లలేం. అలాంటప్పుడే చేతులు ఎర్రగా పండితే చాలనుకుంటూ చందమామలు పెట్టేసుకుంటాం. కానీ కొత్తగా వస్తున్న ‘మెహందీ స్టెన్సిల్స్‌’తో అలా సర్దుకుపోయే అవసరమే లేదు!

ఒకప్పుడు అమ్మాయిల అరిచేతులు ఎర్రగా పండేది ఆషాఢ మాసంలోనే. కానీ ఇప్పుడు సీన్‌ పూర్తిగా మారిపోయింది. పండగొస్తున్నా, ఫంక్షన్‌కి వెళ్లాలన్నా... ముచ్చటైన డ్రస్సూ, అదిరిపోయే జ్యువెలరీనే కాదు... మగువల చేతులూ మందారం రంగు మెహందీ డిజైన్లతో మెరవాల్సిందే. అందుకే ఈతరం అమ్మాయిలు కూడా సంప్రదాయ గోరింటాకు డిజైన్లలోనే సరికొత్త ఫ్యాషన్‌తో తమ అభిరుచుల్ని చూపిస్తున్నారు. అయితే దానికి కచ్చితంగా గోరింటాకు వేయడంలో కాస్తయినా నైపుణ్యం ఉండితీరాల్సిందే. కాబట్టే వేడుకలప్పుడు మాత్రం మిగతా మేకప్‌తో పాటూ హెన్నా ఆర్టిస్టుల దగ్గర ప్రత్యేకంగా నచ్చిన ఆకృతుల్లో గోరింటాకునీ వేయించుకుంటున్నారు. ఇప్పుడేమో అదే గోరింటాకును ఇంట్లోనే మనమే పెట్టుకునే వెసులుబాటును తీసుకొచ్చాయి హెన్నా స్టెన్సిల్స్‌. ఇవి
ఉంటే- మనకు మెహందీ పెట్టుకోవడం రాకపోయినా... ఎవరి సాయం లేకపోయినా... ఎంచక్కా మన చేతిపైన చక్కని డిజైన్‌ వేసుకోవచ్చన్నమాట. పైగా దీనికి మామూలు కోన్‌తో పెట్టుకున్నట్టుగా అంత ఓపికా అక్కర్లేదు, ఎక్కువ సమయమూ అవసరమవదు.  

అసలేంటీ స్టెన్సిల్స్‌...
రకరకాల రంగుల్లో రబ్బరు షీట్లలా ఉండే ఈ మెహందీ స్టెన్సిల్స్‌ మన చేయిపైన అతికేలా గమ్‌తో ఉంటాయి. వీటిల్లో పువ్వులూ, తీగలూ, ఆకులూ, మామిడి పిందెలూ... లాంటి చిన్న చిన్న డిజైన్ల దగ్గర్నుంచీ చేయికీ, కాలికీ సరిపడే థీమ్డ్‌ గోరింటాకు డిజైన్లు ఉన్నవీ దొరుకుతున్నాయి. మనకు అవసరమైనప్పుడు నచ్చిన స్టెన్సిల్స్‌ కొనుక్కుంటే చాలు, అయిదు నిమిషాల్లో మన చేతుల్లోకి గోరింటాకు డిజైన్లు వచ్చేస్తాయి. పైగా వీటిని వాడటమూ చాలా తేలికే. ఈ స్టెన్సిల్‌ని నెమ్మదిగా చేయిపైన అతికించుకుని, దానిపైనంతా కోన్‌తో మెహందీని నింపేయాలి. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత జాగ్రత్తగా స్టెన్సిల్‌ను తొలగించి చూశామంటే... దాని మీదున్న డిజైన్‌ అచ్చుగుద్దినట్టుగా మన చేతిపైన ఎర్రగా కనిపిస్తుంది. అరిచేతి నుంచి మోచేతి వరకూ వస్తున్న ఈ మెహందీ స్టెన్సిల్స్‌ అమ్మాయిలకు బోల్డంత సౌలభ్యాన్ని తెచ్చిపెట్టాయనడంలో సందేహం లేదు... మరి మీరేమంటారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..