Published : 19 Sep 2021 00:12 IST

కొబ్బరి నెయ్యి వచ్చింది తెలుసా..!

ఇంట్లో రెండు కొబ్బరి చిప్పలు ఉంటే... ఏదో ఒక కూరలో వేసుకుంటాం లేదా పచ్చడి చేసుకుంటాం. ఒకవేళ కాస్త ఎక్కువగా ఉన్నాయంటే... వాటిని ఎండబెట్టి భద్రపరుచుకుంటామే తప్ప మరోరకంగా ఆలోచించం. కానీ పోషకాహార నిపుణులూ, వ్యాపారవేత్తలూ మాత్రం దాంతో రకరకాల ఉత్పత్తులు తయారుచేస్తూ కొబ్బరికి కొత్త అర్థాన్ని చెబుతున్నారు. అలా వస్తున్న పదార్థాల్లో కొబ్బరి పిండి నుంచీ నెయ్యి వరకూ ఎన్నో ఉన్నాయి తెలుసా..

ఇంటికి వచ్చిన అతిథులకు రకరకాల పదార్థాలతో భోజనం వడ్డించిన రమ్య ఆఖరున చల్లని లస్సీ ఇచ్చింది. అది తాగాక వాళ్లంతా చాలా బాగుందని మెచ్చుకుంటూ ఆ రుచి ఎలా వచ్చిందని రమ్యను అడిగారు. అది కొబ్బరిపెరుగుతో చేసిన లస్సీ అంటూనే ఇప్పుడు కొబ్బరితో వెన్న, నెయ్యి, జామ్‌, పిండి, తేనె... వంటివెన్నో వస్తున్నాయని రమ్య చెప్పడంతో ఆశ్చర్యపోవడం వాళ్ల వంతయ్యింది. అవును మరి... ఇప్పుడు వస్తున్న రకరకాల కొబ్బరి ఉత్పత్తులు నోరూరిస్తూనే ఎన్నోరకాల పోషకాలనూ అందిస్తున్నాయి. నిజానికి ఒకప్పుడు కొబ్బరితో పాలు, పొడి లాంటివే చేసేవారు. కానీ ఇప్పుడు ఇన్ని రకాలు తయారుచేయడానికి కారణం ఉందంటున్నారు పోషకాహార నిపుణులు. ‘కొందరికి గోధుమపిండి పడదు. జామ్‌ ఇష్టమైనా అందులో తీపిశాతం ఎక్కువ గనుక చాలామంది తినడానికి ఆలోచిస్తారు. నెయ్యి, వెన్న, తేనె... వంటి పదార్థాల విషయంలోనూ బోలెడు సందేహాలుంటాయి. కానీ కొబ్బరి ఉత్పత్తులను కొబ్బరి లేదా కొబ్బరి పూలతో తయారుచేస్తారు కాబట్టి వీటి విషయంలో ఎలాంటి భయమూ అక్కర్లేదు. శరీరానికి మంచి కొవ్వే అందుతుంది’ అని చెబుతున్నారు. ఉదాహరణకు కొబ్బరిపిండిలో గ్లూటెన్‌ ఉండదు కాబట్టి అందరూ తినొచ్చు. దీనికోసం కొబ్బరి నుంచి ఆ పాలను పూర్తిగా వేరు చేసి... మిగిలిన గుజ్జును ఎండబెట్టి పిండి పట్టిస్తారు. బెల్లం, చక్కెర కూడా అంతే. కొబ్బరి పూలను ఎండబెట్టి, ఉడికించి... చక్కెర, బెల్లం చేస్తారు. ఆ పూల నుంచి వచ్చే స్రావాన్ని సేకరించి తేనెను తయారుచేస్తారు. ఈ పదార్థాలన్నీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక... క్రీమ్‌, వెన్న, నెయ్యి, పెరుగు, జామ్‌, చిప్స్‌ లాంటివి దుకాణాల్లో దొరుకుతున్నా, కావాలంటే ఇంట్లోనే ఎవరికి వారు సులువుగా చేసుకోవచ్చు. అలాగే కాస్త క్రంచీగా, టేస్టీగా ఉండే కొబ్బరి చిప్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీటన్నింటి తయారీకి సంబంధించి యూట్యూబ్‌లో బోలెడు వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఎలాంటి లాభాలంటే..

నిజానికి కొబ్బరిలో ఉండేవి సంతృప్త కొవ్వులే అయినప్పటికీ అవి మంచి కొలెస్ట్రాల్‌ పెరిగేలా చేస్తాయి. పైగా కొబ్బరి సహజంగానే తియ్యగా ఉంటుంది గనుక వీటి తయారీలో అదనంగా చక్కెర వాడాల్సిన పనికూడా ఉండదు. అందుకే ఇవన్నీ ఆరోగ్యానికి మేలుచేస్తాయని చెబుతారు నిపుణులు. కొబ్బరిపిండి నుంచి పీచు, ఇనుము సమృద్ధిగా లభిస్తాయి. ఈ పిండి   చక్కెరస్థాయులనూ నియంత్రణలో ఉంచుతుంది. ఇక... కోకోనట్‌ నెక్టర్‌ (కొబ్బరి తేనె)ను తీసుకుంటే... దాన్నుంచి పదిహేడు రకాల అమైనో ఆమ్లాలూ,  యాంటీఆక్సిడెంట్లూ, విటమిన్‌ బి, సి వంటి పోషకాలు కూడా లభిస్తాయి. కొబ్బరి జామ్‌ తయారీలో కేవలం కొబ్బరి పాలు, క్రీమ్‌, లాంటివే ఎక్కువగా వాడతారు గనుక చక్కెర విషయంలో భయం అక్కర్లేదు. ఇలా ఏ రకంగా తీసుకున్నా... కొబ్బరి చేసే మేలు అంతా ఇంతా కాదనేది పోషకాహార నిపుణుల సూచన. సో, కొబ్బరిని ఎన్నిరకాలుగా వాడొచ్చో తెలిసింది కదా... ఆలస్యం చేయకుండా నచ్చిన పదార్థాలను కొని తెచ్చేయండి మరి.


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని